హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రుల అవినీతి, అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. అధికారం ఉందన్న అహంకారంతో జిల్లా మంత్రు లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలతో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో కేటీఆర్ సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయటంతోపాటు కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలపై విస్తృతం గా చర్చించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్ భూతం తెరపైకి వస్తున్నదంటూ పార్టీ నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ నేతల అరాచకాలు, అవినీతికి అడ్డు అదుపు లేకుండా పో యిందని వివరించారు. మంత్రుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఏవిధంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారో నియోజకవర్గాలవారీగా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని అంశా ల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో వారిపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు.
రాష్ట్ర రాజకీయాలతోపాటు నల్లగొండ జిల్లాకు సంబంధించిన స్థానిక అంశాలపై కూడా మరింత చురుగ్గా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడుదామని జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో లేవనెత్తాల్సిన సమస్యలను వారికి వివరించారు. త్వరలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి కాంగ్రెస్ నేతల అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
సమావేశంలో జగదీశ్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, నోముల భగత్, రవీంద్రకుమార్, ఎన్ భాస్కర్‌రావు, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య, బిక్షమయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జడ్పీ మాజీ చైర్మన్లు సందీప్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, పలువురు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.