KTR | రాబోయే రోజుల్లో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ కనపడొద్దని.. తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఒకనాడు మహాకవి దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్నారు. దాంతో పాటు నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని 70 సంవత్సరాల కిందట దాశరథి గారు అన్నమాట. రావెళ్ల వెంకటరామారావు అనే కవి అద్భుతంగా చెప్పారు. ‘వెలలేని నందనోద్యానమురా.. నా తల్లి తెలంగాణ’ అని గొప్పగా తల్లి తెలంగాణ గురించి చెప్పారు. ఉద్యమం గురించి మీకు తెలుసు. ధూంధాంలు.. బతుకమ్మలు.. బోనాలు.. ఆటపాటలతో ఇదీ మన సంస్కృతి.. ఇది మనగొప్పదనం అని చెప్పుకున్నాం. ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు.. ఎంతోమంది మహానుభావులు.. సాహితీవేత్తలు కలిసి తెలంగాణకు ఒక అస్థిత్వాన్ని, ఒక రూపాన్ని కల్పించారు. 2006లో ఆనాడు సమైక్యపాలకులు మనపై పగబట్టి.. వెంటాడి వేటాడుతుంటే.. ఆరోజు రోజు ప్రతిష్టించింది తెలంగాణ తల్లి’ అన్నారు.
‘బ్రహ్మాండంగా ఆ తల్లి ఎంత గొప్పగా ఆ రోజు ఎంతో గొప్పగా ఆలోచనతో రూపకల్పన చేయడం జరిగింది. తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డ అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా, సూర్యాపేట నుంచి నారాయణఖేడ్ దాకా మొత్తంగా ఎక్కడికక్కడ దసరా పండగా వచ్చిందంటే.. దానికంటే ముందుండే సద్దుల బతుకమ్మ కోసం ఎదురుచూసే రోజులు తెలుసు. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డలకు గౌరవం. ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను వారికి స్థానం కల్పిస్తూ.. తెలంగాణతల్లి విగ్రహంలో బతుకమ్మను ఏర్పాటు చేశారు. గద్వాల, పోచంపల్లి నేతన్నలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కారు. ఆ పట్టుచీరను ధరిస్తూ ఆ దేవతా మూర్తి మన గద్వాల, పోచంపల్లి నేతన్నల కళానైపుణ్యానికి ప్రతీకగా ధరించింది. కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు.. మన ప్రాంతంలో పండే మెట్టపంటలకు నిదర్శనంగా జొన్న కంకులు. చూడంగానే దండంపెట్టేలానిపించేలా విధంగా బ్రహ్మాండంగా.. భరతమాత ముద్దుబిడ్డగా.. రాజమాతగా అందమైన కిరీటం. ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూర్ వజ్రాన్ని కూడా పెట్టి ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. కానీ, ఇప్పుడున్న పాలకులు.. హంతకులే సంతాపం చెప్పినట్లు.. ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందలవేల చావులకు కారణమయ్యారో.. తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కషంగా తొక్కే ప్రయత్నం చేశారో.. వాళ్లు ఇవాళ ముందువరుసలో నిలబడి.. తెలంగాణ అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు. బీదగా ఉండాలి. తెలుగుతల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు. భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు.. కన్నడమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు. తమిళమత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు.. తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాలులా ఉండాలి.. రాష్ట్రం దివాళా తీసినట్లు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాళాకోరు పాలకులు వాళ్ల భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపం మార్చారు’ అంటూ మండిపడ్డారు.
‘ఈ మాట నేనంటే కొందరు తప్పు అనుకోవచ్చు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఆవేశంతో ఉద్వేగంలో అంటున్నట మాటలు.. ప్రపంచంలో ఆళిని మార్చిన మగాళ్లు ఉండొచ్చు.. కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఉండబోరు అనేమాట చెబుతున్న. ఇవాళ తెలంగాణ ఆ దౌర్భాగ్యపు పరిస్థితిని చూస్తున్నాం. కేవలం తెలంగాణ తల్లి విగ్రహం ఒక్కటే ఉన్నదా? ఉద్యమ సమయంలో ఊరూరా వేలకోద్దీ విగ్రహాలు.. ఏ ఊరికి వెళ్తే.. ఆ ఊరిలో బ్రహ్మాండంగా చందాలు వేసుకొని ఈమె మా తెలంగాణ తల్లి అని గౌరవించుకునేలా.. ప్రణమిల్లే విధంగా అద్భుతమైన ఆకృతి ఇచ్చి.. సాష్టాంగ నమస్కరాలు చేసి స్ఫూర్తి పొంది ఉద్యమంలో పాల్గొన్న వారు ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్న. తెలంగాణ తల్లి రూపు మార్చుమని మిమ్మల్ని. ఎవరికి ఉండే అభ్యంతరం ? ప్రభుత్వాలు మారినప్పుడల్లా తల్లులు మారాలా? ప్రభుత్వాలు మారితే తలరాతలు మారాలి తప్ప.. తల్లులు మారడం తప్పు తప్పు తప్పు అనేమాట నొక్కి చెబుతున్న. ప్రభుత్వం మారితే తెలుగు తల్లి మారిందా? కాంగ్రెస్ నుంచి బీజేపీ వస్తే భరతమాత మారిందా? నేను మా ఆడబిడ్డల తరఫున అడుగుతున్న. సిగ్గున్నదా మీకు అసలు. తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైన బతుకమ్మను మాయం చేస్తరా? ఒక వైపు బతుకు నాశనం చేస్తున్నరు. మరో వైపు బతుకమ్మను మాయం చేయడమంటే.. ఇది తెలంగాణ అస్థిత్వంపై జరుగుతున్న దాడికి పరాకాష్టగా చెప్పక తప్పదు. తెలంగాణ తల్లి అంటే కేవలం ఒక పార్టీకి.. ఒక వ్యక్తికి.. సంస్థకు సంబంధించింది కాదు. మొత్తం సమస్త తెలంగాణ జాతిని జాగృత పరిచిన తల్లి తెలంగాణ తల్లి. ఈ ప్రభుత్వం వ్యవహారం ఎలా ఉందంటే.. బతుకమ్మ చీరెలు వద్దు.. బతుకమ్మ పండుగకు ఏర్పాట్లు వద్దు.. అసలు బతుకమ్మనే కనపడొద్దు.. రానున్న రోజుల్లో.. తెలంగాణ కనబడవద్దు.. అవసరమైతే తెలంగాణను మాయం చేయాలనే కుట్ర కనబడుతున్నది’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.