హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన నిరాధార వ్యాఖ్యల కారణంగా తన పరువుకు భంగం కలిగిందంటూ ఆయనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు లీగల్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదురోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ నెల 19న బండి సంజయ్ మీడియా సమావేశంలో తనపై తప్పు డు ఆరోపణలు చేశారని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించారని, ఆయన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. తనను అప్రతిష్ఠపాలు చేయాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, వాటిని నిరూపించాలని సవాల్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు విస్తృతంగా మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రచారం అయ్యాయని ఈ నేపథ్యంలో ప్రజలు తనను తప్పుగా అర్థం చేసుకొని ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా కల్పించిన కట్టుకథలుగా కేటీఆర్ కొట్టిపారేశారు.
కేంద్రమంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలు ప్రజాబాహుళ్యంలోకి విస్తృతంగా ప్రచారం అవుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై బురద చల్లాలనే దురుద్దేశంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదేండ్లు రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేసిన తనను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. గతంలోనూ బండి తనపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, రాజకీయంగా తనను ఎదురొనే శక్తిలేక వ్యక్తిత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయాలనే కుట్ర తప్పవారి ఆరోపణల్లో నిజం లేదని స్పష్టంచేశారు.