హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): బంగారు తెలంగాణలో పోషకాహారలోపం ఆనవాళ్లను నిర్మూలించడమే రాష్ట్ర సర్కారు లక్ష్యమని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని’ శుక్రవారం హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని మునగ రామ్మోహన్రావు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కేటీఆర్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్ రుచికరంగా ఉందని, మెనూ బాగుందని కితాబిచ్చారు. మెనూ ప్రకారం అల్పాహారం అందివ్వకపోతే తనకు ఫోన్ చేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యతతో కూడిన అల్పాహారాన్ని అందివ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.
మరో ఐదారు రోజుల్లో దసరాలు సెలవులు వస్తున్నాయని, ఈ లోపు అల్పాహార పథకం ఎలా ఉన్నదనే ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని టీచర్లకు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ పథకాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ పథకం అమలుతో తల్లిదండ్రులకు, విద్యార్థులకు లాభం కలుగుతుందని తెలిపారు. తమిళనాడులో 1 నుంచి 5వ తరగతుల వరకు బ్రేక్‌ఫాస్ట్ పెడుతున్నారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, విద్యాశాఖ అధికారి రోహిణి, జోనల్ కమిషనర్ రవికిరణ్, అడిషనల్ కమిషనర్ స్నేహశబరిశ్, ఆర్డీవో రవి తదితరులు పాల్గొన్నారు.