హైదరాబాద్ : గచ్చిబౌలిలో అమృత సంకల్ప్ క్లినిక్‌ను బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) ప్రారంభించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఒక మంచి ఆలోచనతో డాక్టర్ సురేంద్ర, శిరీష, విజయలక్ష్మి కలిసి మాదాపూర్‌లో ఈ క్లినిక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మారిన జీవన పరిస్థితుల్లో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత ముఖ్యమైందిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడుతోందన్నారు. కేవలం శారీరక బాధలు మాత్రమే కాకుండా, మానసిక రుగ్మతలు, సమస్యల విషయంలో కూడా ప్రజలు వైద్యుల సహాయాన్ని పొందాల్సిన అవసరం ఉందన్నారు.
మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు. దీనిపై ఉన్న నెగటివ్ అభిప్రాయం మారాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మానసిక సమస్యల కారణంగా చాలా మంది ఆత్మహత్య లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రాణం కోల్పోవడం కంటే మానసిక చికిత్స తీసుకోవడం ఎంతో సులభమనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దేశంలో అనేక మందిని బాధిస్తున్న షుగర్ వ్యాధికి ప్రధాన కారణం ఒత్తిడి అనే విషయం చాలామందికి తెలియదు. ఈ తరహా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి క్లినిక్‌లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.