హైదరాబాద్ జూలై 17 (నమస్తే తెలంగాణ): మీడియా చిట్‌చాట్ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లగక్కిన చెత్తతో మర్యాద అనే పదానికి ఉన్న అన్ని హద్దులను చెరిపేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తనను ఉద్దేశించి అడ్డగోలు వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారంటూ గురువారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇక ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. తనపై బురద జల్లుతూ చేసిన ప్రతి ఆరోపణకు మూల్యం చెల్లించేలా రేవంత్‌రెడ్డిని కోర్టుకు ఈడుస్తానని స్పష్టం చేశారు. తనపై విషం చిమ్మడం రేవంత్‌కు పరిపాటి అయిందని, కేవలం ముఖ్యమంత్రి కార్యాలయంపై ఉన్న గౌరవంతోనే ఇంతవరకు సంయమనం పాటించానని పేర్కొన్నారు.
డ్రగ్స్ విషయంలో తనపై ఆరోపణలు చేయడమే తప్ప ఎక్కడైనా కేసు నమోదైందా? అణువంతైనా రుజువులున్నాయా? సమాధానం చెప్పాలని నిలదీశారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు చేయడం కాదని దమ్ముంటే ఆధారాలు చూపాలని ముఖ్యమంత్రిని సవాల్ చేశారు. దొంగచాటున వ్యాఖ్యలు చేసి దొడ్డిదారిన పారిపోవడం కాదని, ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. లేదా తనవి ఆధారంలేని, చౌకబారు, చిల్లర వ్యాఖ్యలని ఒప్పుకోవాలని పేర్కొన్నారు. ‘రేవంత్‌రెడ్డీ.. హైదరాబాద్‌లో నాతో ముఖాముఖి చర్చించే దమ్ము, ధైర్యంలేక చిట్‌చాట్‌ల పేరుతో నాపై బురద జల్లేందుకు ఢిల్లీ పారిపోయావు’ అని వ్యాఖ్యానించారు.
చట్టం, న్యాయస్థానాల నుంచి తప్పించుకొనేందుకు ఇలా పిరికితనంతో దొంగచాటుగా చిట్‌చాట్‌ల వ్యక్తిత్వ హననానికి దిగుతున్నావని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి చిల్లర వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఓపికపట్టామని ఇక మీద ఊరుకోబోమని స్పష్టంచేశారు. తనపై చేసిన ప్రతి ఆరోపణకు మూల్యం చెల్లించేలా కోర్టుకు ఈడుస్తానని స్పష్టం చేశారు. తనపై చేసిన నిరాధార, నిందాపూర్వకమైన ఆరోపణలకు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని లేదా పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
కేటీఆర్‌ను ముఖాముఖి ఎదుర్కొనే దమ్ములేకనే సీఎం రేవంత్ ఆయనపై ఢిల్లీలో పసలేని ఆరోపణలు చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటికి ఎన్నిసార్లు కేటీఆర్ గురించి మాట్లాడినావు. కేటీఆర్‌ను ఎదర్కొనే దమ్ము నీకు లేదు. నువ్వేం చేసినా ఆ స్థాయి నీకు రాదు. ఆ ఇమేజ్ నీకు రాదు. నువ్వే సవాల్ విసిరినావ్ కదా.. వస్తవా కేసీఆర్ రండీ.. వస్తవా కేటీఆర్ అని నువ్వే పిలిచినవు కదా? కేటీఆర్ నీ సవాల్‌ను స్వీకరించిండు. బహిరంగ చర్చకు సిద్ధం అన్నడు. మూడు రోజుల సమయం ఇచ్చే కదా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చిండు.
అప్పుడేమన్నవ్ నేను కేటీఆర్‌తో మాట్లాడను..అంటే చేతులు ఎత్తేసినట్టే కదా? నీ దగ్గర విషం తప్ప విషయం లేదు. అందుకే నువు ముఖం చాటేసినవు. కేటీఆర్ అనేక సార్లు నిన్ను లై డిటెక్టర్ టెస్టుకు రమ్మని పిలిచిండు. నువ్వు వచ్చినవా? ఓటుకు నోటు కేసులో నువ్వురా.. ఈ కార్ రేసింగ్‌లో నేను వస్తా అని పిలిచిండు.
తప్పు చేయనోనివే అయితే ఎందుకు ముఖం చాటేసినవ్. నీకు సత్తా వుంటే, విషయం ఉంటే మొన్న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చర్చకు ఎందుకు రాలేదు? దొంగే దొంగా..దొంగా అని అరిచినట్టు అర్థరాత్రి పూట గోడలు దూకే అలవాటు, అర్ధరాత్రి పూట ప్రైవేటు కార్లలో పోయే అలవాటు ఈ రాష్ట్రంలో ఎవరికి ఉన్నది? రేవంత్‌రెడ్డికి కాకపోతే! పోనీ అసెంబ్లీ పెట్టు. అక్కడనే మాట్లాడుదం. మా మైక్ కట్ చెయ్యకుండా నిజాయితీగా సమయం ఇవ్వు. అన్ని అంశాలపై చర్చకు మేం సిద్దం. బీఆర్ఎస్ రెడీగా ఉంది’ అని స్సష్టం చేశారు.