అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని ప్రగల్భాలు పలికిన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కోదండరాం, మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి వంటివారు ఆ భూములను రైతులకు ఎందుకు తిరిగి ఇవ్వలేక పోయిండ్రు? ఫ్యూచర్‌సిటీ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు, ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నరు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ భూములు, అసైన్డ్, ప్రభుత్వ భూములను టార్గెట్ చేసి లాక్కుంటున్నరు.
-కేటీఆర్
రంగారెడ్డి, జూన్ 27 (నమస్తేతెలంగాణ): రాష్ట్రం లో హైడ్రాను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ సర్కార్ అనేక దుర్మార్గాలకు ఒడిగడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా అధికారపార్టీ నేతలు, హైడ్రాను పావుగా వాడుకుంటూ అనేక చోట్ల భూములు కాజేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను అధికార పార్టీ నేతలు, ముఖ్యమంత్రి బంధువులు కొల్లగొడుతున్నారని, ప్రజా అవసరాలు, పరిశ్రమల పేరిట ఎస్సీ, ఎస్టీ, అసైన్డ్, ప్రభుత్వ భూములు, కుంటలను కాజేసే కుట్రలకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో సర్, సభ్యత్వ నమోదుపై శనివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్‌సిటీ పేరిట రేవంత్ బంధువులు భూ దందాలకు తెరలేపారని ఆరోపించారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌సిటీని నిర్మిస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 14 వేల ఎకరాల్లో మాత్రమే ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్నారని చెప్పారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఫార్మాసిటీ నిర్మించాలన్న లక్ష్యంతో రైతులను ఒప్పించి 14 వేల ఎకరాలు సేకరించారని, ఆ భూమిని ఫ్యూచర్‌సిటీకి కేటాయించడం చట్ట విరుద్ధమని చెప్పారు.
ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఫార్మాసిటీ భూములను అక్రమంగా కేటాయించడం వల్ల పెట్టుబడులు పెట్టిన వారే నష్టపోతారని హితవుపలికారు. ముఖ్యంగా ముఖ్యమంత్రికే ఫ్యూచర్ లేదని, ఫ్యూచర్‌సిటీ కడుతామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవాచేశారు. మరోవైపు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దుచేసి ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని ప్రగల్భాలు పలికిన భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, కోదండరామ్, మల్రెడ్డి రంగారెడ్డి, కోదండరెడ్డి వంటివారు ఆ భూములను రైతులకు ఎందుకు తిరిగి ఇవ్వలేక పోయారని ప్రశ్నించారు.
ఫ్యూచర్‌సిటీ పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరులు, ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు రియల్ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ భూములు, అసైన్డ్, ప్రభుత్వ భూములను టార్గెట్ చేసి లాక్కుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఫార్మా కంపెనీల వల్ల హైదరాబాద్ ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారన్న దూరదృష్టితో రంగారెడ్డి జిల్లాలో కాలుష్య రహిత అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్మా కంపెనీలు నిర్మించాలని నిర్ణయించారని గుర్తుచేశారు.
ఈ ప్రాంతంలో కాలుష్య రహిత ఫార్మాసిటీని నిర్మిస్తే 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కేవని చెప్పారు. కానీ, ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు లేనిపోని దుష్ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని, ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు తిరిగి ఇండ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వలేదని చెప్పారు.
మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా ఇటీవల రాష్ర్టానికి వచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన అద్భుత కట్టడాలు, అమలు చేసిన పథకాలను చూసి మెచ్చుకున్నారని కేటీఆర్ వివరించారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను చూసి ఆయన ఆశ్చర్యపోయారని చెప్పారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా పోరాడిన రేవంత్‌రెడ్డికి రాష్ట్ర పగ్గాలు అప్పగించడం వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోయిందని వాపోయారు. రాష్ట్రంలో పాలన.. పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఎప్పుడు ఎవరిని కొడుతాడో తెలియని దుస్థితి ఉన్నదని దుయ్యబట్టారు. రాష్ర్టాన్ని పాలిస్తున్నది హిట్లర్రెడ్డి అని తనకు హిట్లరే ఆదర్శమని రేవంత్‌రెడ్డే స్వయంగా ఒప్పుకొన్నాడని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకు కూడా రైతుబంధు వేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి రైతుబంధు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో వికాసం పోయి.. విధ్వంసం, విషాదం మిగిలిందని కేటీఆర్ వాపోయారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందితే కాంగ్రెస్ పాలనలో విధ్వంసానికి గురైందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుబంధు ఊసేలేదని, పింఛన్ల పెంపులేదని, తులం బంగారం అంతకన్నా లేదని, యూరి యా కోసం తెచ్చిన యాప్‌లో మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు స్థానమే లేదని, గ్యారెంటీ కార్డులు మూలకు పడ్డాయని దుయ్యబట్టారు. 420 హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి వాటిని అమలు చేతగాక కేసీఆర్‌పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ అధికారంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో 1,025 సంక్షేమ హాస్టళ్లు, 204 గురుకుల పాఠశాలలు, లక్ష కోట్లతో 24 గంటల విద్యుత్తు, 14 లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఇచ్చారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేశారని, 70 లక్షల మందికి రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. రేవంత్ 30 నెలల్లో 70 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి రెన్యువల్ సీఎం అని, రెగ్యులర్ సీఎం కాదని ఎద్దేవాచేశారు. నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన సాగుతున్నదని, ఆ పాలన పోవాలంటే కాంగ్రెస్‌ను గద్దె దింపాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలువడం ఖాయమని చెప్పారు.
ఇంటింటికీ వెళ్లి ఓట రు నమోదును విజయవంతం చేయాలని, సర్‌లో భాగంగా అర్హుల ఓట్లు ఒక్కరివి కూడా తొలగిపోకుం డా జాగ్రత్త పడాలని కార్యకర్తలకు సూచించారు. కా ర్యక్రమంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, శంభీపూర్‌రాజు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, పటోళ్ల కార్తీక్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని కడుతామని చెప్తున్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన 14 వేల ఎకరాల్లోనే ఫ్యూచర్‌సిటీ నిర్మిస్తున్నడు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఫార్మాసిటీ నిర్మాణం కోసం రైతులను ఒప్పించి 14 వేల ఎకరాలు సేకరించిండ్రు. ఆ భూమిని ఫ్యూచర్ సిటీకి కేటాయించడం చట్ట విరుద్ధం. అక్కడ పెట్టుబడులు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఫార్మాసిటీ భూములను అక్రమంగా కంపెనీలకు కేటాయించడం వల్ల పెట్టుబడులు పెట్టిన వారే నష్టపోతరు.
-కేటీఆర్
మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజాయితీ ఉంటే వారిని కనీసం లక్షాధికారులనైనా చేయాలి. రాష్ట్రంలో వికాసం పోయి.. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలింది. కేసీఆర్ కిట్ పోయింది. కరెంటు కోతల కాలం వచ్చింది. రైతుబంధు పోయి, రాహుల్ బంధు వచ్చింది. సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర నడుస్తున్నది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలు కేసీఆర్‌నే ఎందుకు తలుచుకుంటున్నారో అందరూ అర్థం చేసుకోవాలి.
-కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఆరు గ్యారెంటీల్లో భాగమైన మహిళలకు రూ.2,500 హామీ ఇప్పటికీ అమలు చేయలేదని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఐదేండ్లకు ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన 1.50 లక్షలు ఇస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని డైలాగులు కొట్టిన రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే మహిళలను కనీసం లక్షాధికారులనైనా చేయాలని సూచించారు. రాష్ట్రంలో వికాసం పోయి.. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలిందని, కేసీఆర్ కిట్ పోయిందని, కరెంటు కోతల కాలం వచ్చిందని, రైతుబంధు పోయి, రాహుల్ బంధు వచ్చిందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర నడుస్తున్నదని, సీఎంగా రేవంత్‌రెడ్డి ఉన్నా ప్రజలు కేసీఆర్‌నే ఎందుకు తలుచుకుంటున్నారో అందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారని, ఎంతోమంది అమరుల త్యాగ స్ఫూర్తితోనే బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలన సాగిందని గుర్తుచేశారు. ప్రజా సంక్షేమం, ప్రగతి పథం పదేండ్లలో జోడెడ్లుగా ముందుకు సాగాయని, బీఆర్ఎస్ ఓటమి వల్ల ఎవరు నష్టపోయారో ప్రజలు గుర్తించాలని కోరారు. కేసీఆర్ యాభై ఏండ్లలో ఎన్నో పదవులు చూశారని, ఎన్నో పదవులను త్యాగం చేశారని గుర్తుచేశారు.