ఎల్లారెడ్డిపేట, నవంబర్ 22: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశ కార్యకర్త కుటుంబానికి సాయం చేస్తానని ఇచ్చిన మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలుపుకొన్నారు. బాధితురాలికి తనవంతు సాయంగా రూ.లక్ష అందిస్తున్నట్టు ప్రకటించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 17న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
ఈ క్రమంలో దుమాలకు చెందిన ఆశ కార్యకర్త నీరెంక లత అక్కడికి వచ్చి కేటీఆర్‌తో తన సమస్యను విన్నవించుకున్నది. తాను క్యాన్సర్‌తో, తన భర్త రవి బ్రెయిన్ ట్యూమర్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడని.. తమను ఆదుకోవాలని వేడుకున్నది. దీంతో బాధితురాలిని ఓదార్చి.. తప్పకుండా సాయం అందిస్తానని కేటీఆర్ భరోసానందిచారు. మాటిచ్చినట్టుగానే తనవంతుగా చికిత్స కోసం రూ.లక్ష ప్రకటించగా తోటి ఆశ కార్యకర్తలు రామన్నకు కృతజ్ఞతలు తెలిపారు.