KTR | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : నిత్యం కరెంట్ కోతలు, వారానికి రెండు రోజుల పవర్ హాలీడేల దుస్థితి నుంచి అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేసేలా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ దార్శనితకకు నిదర్శనమే యాదాద్రి పవర్ ప్లాంట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. నల్లగొండ జిల్లాలో శనివారం ప్రభుత్వం ప్రారంభించబోయే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఏ) నిర్మాణం వెనుక ఉన్న కేసీఆర్ కృషి, దార్శనికత తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుందని శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపారు. కేసీఆర్ దీర్ఘదృష్టికి, భారీ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో అనితరసాధ్యమైన వేగానికి యాదాద్రి థర్మల్ వైటీపీఎస్ మరో ఉదాహరణ అని పేర్కొన్నారు.
వైటీపీఎస్ పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు (5×800) అని, స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదేనని వెల్లడించారు. వైటీపీఎస్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్ (భెల్) సంస్థకు అప్పగించిందని, దాదాపు రూ.20,400 కోట్ల విలువైన ఆర్డర్, భారత విద్యుత్తు రంగ చరిత్రలో ఒక ప్రభుత్వ రంగ సంస్థకు ఇచ్చిన అత్యంత విలువైన ఆర్డర్‌గా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరితరమూ కాదని కేటీఆర్ మరోమారు స్పష్టంచేశారు. 2014లో కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం మాత్రమే ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలంలో తెలంగాణలో స్థాపిత సామర్థ్యాన్ని దాదాపు 20,000 మెగావాట్లకు చేర్చిందని గుర్తుచేశారు. ఇది దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విజయగాథ అని, ఇది తెలంగాణ చరిత్రపై కేసీఆర్ చేసిన చెరగని సంతకమని కొనియాడారు.
తాను మంత్రిగా ఉన్నా లేకున్నా తన రాష్ట్రం తెలంగాణ అని, దాని అభివృద్ధి కోసం ప్రయత్నిస్తూనే ఉంటానని కేటీఆర్ స్పందించారు. ఎక్స్ వేదికగా తెలంగాణకు చెందిన ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ‘మీరు నిజమైన నాయకుడు. తెలంగాణను మీకంటే బాగా ప్రమోట్ చేయగల వ్యక్తి లేరు. కేరళలో నిన్న జరిగిన టైకాన్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మీ మాటలు విన్నప్పుడు మీరు ఇంకా మా ఐటీ, పరిశ్రమల మంత్రిగానే ఉన్నారనిపించింది. మీరు త్వరలోనే తిరిగి అధికారంలోకి వచ్చి తెలంగాణను మరింత అభివృద్ధి పరుస్తారని ఆశిస్తున్నాను’ అని నెటిజన్ ఎక్స్‌లో పోస్టుచేయగా కేటీఆర్ ప్రతిస్పందించారు. ‘నేను మంత్రిగా ఉన్నా లేకపోయినా తెలంగాణ నా రాష్ట్రం. నేను ఎకడ ఉన్నా తెలంగాణను ప్రమోట్ చేస్తూనే ఉంటాను. మీ ఆప్యాయమైన వ్యాఖ్యలను ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనను ప్రజలు మరింతగా మిస్సవుతున్నారన్న భావన కలుగుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు ఓ తండ్రి తనకు అందించిన లేఖనే ఉదాహరణ అని తెలిపారు. ‘నిన్న కేరళలోని కొచ్చి నుంచి తిరిగి వస్తున్నప్పుడు, ఏయిర్ హోస్టెస్ ఒక ప్రయాణికుడి నుంచి వచ్చిన లేఖను నాకు అందించారు. ఆ వ్యక్తి తన కుమారుడు డాక్టర్ అవ్వడానికి కారణం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల స్థాపించడమే. ఇందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలపాలని కోరుతూ లేఖ రాశారు’ అని కేటీఆర్ వివరించారు. క్యూట్ బాయ్ విరాట్ తన దగ్గరకు వచ్చి, ఒక ఫొటో తీసుకొని కేసీఆర్ తాతకు తన ప్రేమను తెలియజేయాలని కోరినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలను ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు.