KTR | రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి (Revanth Reddy) దమ్ముంటే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) మరోసారి సవాల్ విసిరారు. ‘ఫిరాయింపు ఎమ్మెల్యేలు గబ్బిలాల్లా వేలాడుతున్నారు. పదవుల కోసం ఇంత దిగజారుతారా? అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమైపోయాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి ఆడోళ్లా.. మొగోళ్లా.. స్పీకర్ ముందే పచ్చి అబద్ధాలా?’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్రమంగా చేర్చుకున్న పది మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి, ఎన్నికల ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఎవరి వైపు ఉన్నదో ప్రజలు నిర్ణయిస్తారని, దమ్మూ ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచామని, ఇది ప్రజలిచ్చిన ఆశీర్వాదమని చెప్పిన 5 నిమిషాల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు. త్వరలో పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఎన్నికల ఫలితాల్లో గులాబీ ప్రభంజనం చూసి వెనక్కి తగ్గారని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ నోరు విప్పలేదని, తాను ప్రచారం చెయ్యలేదని, అయినా, రాష్ట్రంలో 12 వేల సర్పంచ్ స్థానాలకు 33% బీఆర్ఎస్ గెలుచుకున్న దెబ్బతో రేవంత్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరయ్యారని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికలు పెట్టినా అందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. అధికారంలో లేకపోయినా కేసీఆర్‌పై నమ్మకం, తనపై ప్రేమతో సిరిసిల్ల నియోజకవర్గంలోని 117 సర్పంచ్ స్థానాల్లో 80 గెలిచి సిరిసిల్ల గులాబీ అడ్డా అని నిరూపించిన కార్యకర్తలు, నాయకులు, ఓటర్లకు శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేటీఆర్ చెప్పారు.
ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలు తిరిగినా, బెదిరించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు. పల్లెలు బాగుపడాలన్నా, అభివృద్ధి పరుగులు పెట్టాలన్నా కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని మరోసారి తేల్చి చెప్పిన ప్రజలకు ధన్యవాదాలు.
-కేటీఆర్
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సిరిసిల్ల నియోజకవర్గంలోని కొత్త సర్పంచ్‌లకు శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ హాజరయ్యారు. గెలిచిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు సన్మానం చేసి, వారి విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచకాలు, అప్రజాస్వామ్య విధానాలు, పాలనా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మొదట కాంగ్రెస్ 66% గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారని.. కానీ, సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో మంత్రులుగా, స్పీకర్లుగా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి వారు గడ్డిపోచలాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. బయట కాంగ్రెస్‌లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, ఢిల్లీలో రాహుల్‌గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెప్తుంటే వినేవారికే సిగ్గేస్తున్నదని ఎద్దేవా చేశారు. పదవుల కోసం సూరు పట్టుకొని గబ్బిలాల్లా వేలాడుతున్న వీరి బతుకులు ఆగమైపోయాయని పేర్కొన్నారు. సీఎం ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలు పకనపెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటలో అంపైర్‌గా ఉండాల్సిన స్పీకర్ కూడా తాము ఇచ్చిన ఆధారాలు పకనపెట్టి ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లో ఉండటం బాధాకరమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి గారూ.. మీకు నిజంగానే ప్రజాదరణ ఉంటే.. నా సవాల్ స్వీకరించండి. మా పార్టీ నుంచి మీరు సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. అప్పుడు ప్రజలే చెప్తారు. ఎవరి శాతం ఎంతో.. ఎవరి బతుకెంతో.. ఎవరి సత్తా ఎంతో.. తేలిపోతుంది.
-కేటీఆర్
సర్పంచ్ ఎన్నికల సమయంలో గ్రామాలు, అభ్యర్థుల మధ్య తలెత్తిన చిన్నపాటి విభేదాలను పకనపెట్టి, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట కోసం కార్యకర్తలంతా ఐకమత్యంగా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పంచాయతీల పరిధిలోని ఎంపీటీసీ స్థానాలను క్లస్టర్ల వారీగా సమీక్షించుకొని గెలుపు దిశగా ప్రణాళికలు సిద్ధంచేయాలని నాయకులకు సూచించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, గెలిచిన తర్వాత అందరూ సమిష్టి కృషితో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కొత్త సర్పంచ్‌లకు సూచించారు. బెదిరింపులు, ఫోన్‌కాల్స్‌కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వచ్చే నూతన సంవత్సరంలో కొత్త సభ్యత్వాల నమోదు, గ్రామ, మండల, జిల్లా కమిటీల నియామకం ఉంటుందని, పాత తరం అనుభవం, కొత్త రక్తం కలిసేలా చాకుల్లాంటి యువకులతో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, పార్టీ జిల్లా, పట్టణ అధ్యక్షులు తోట ఆగయ్య, జిందం చక్రపాణి, టెస్కో సంస్థ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, న్యాలకొండ అరుణ, కొత్త సర్పంచ్‌లు పాల్గొన్నారు.
రైతులు, మహిళలు, బీసీలను మోసం చేసినందుకే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారు. బీఆర్ఎస్ విజయాన్ని చూసి భయపడే సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు..
-కేటీఆర్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సర్పంచ్‌లను బెదిరించడంపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అని, అది ఎవరి అత్త సొమ్ము కాదని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను ఆపే అధికారం ఏ ఎమ్మెల్యేకు గానీ, సీఎంకు గానీ లేదని స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వం, నిధులు ఆపేస్తామని చిల్లరమాటలు మాట్లాడే వారిని ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ పల్లెప్రగతి ద్వారా గ్రామాలను నందనవనాలుగా తీర్చిదిద్దారని, నేడు కాంగ్రెస్ పాలనలో కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయించే స్థితి కూడా లేదని విమర్శించా రు. ఎల్ఈడీ బల్బులు మార్చే దికులేక పల్లెలు చీకటిమయమవుతున్నాయని దుయ్యబట్టారు.