హైదరాబాద్ : లగచర్ల గిరిజన రైతులకు (Lagacharla farmer) బేడీలు వేయడం పట్ల బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ గుండె నొప్పి వచ్చిన రైతన్నకు సంకెళ్లు (Hand Cuff) వేయడం దారుణమని , రేవంత్ రెడ్డి క్రూరమనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు.
హీర్యా నాయక్ కి గుండెల్లో నొప్పి వస్తే వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని కుటుంబ సభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించకుండా అమానవీయంగా వ్యవహరించిందని విమర్శించారు.
గురువారం ఉదయం రెండోసారి మళ్లీ గుండెపోటు రావడంతో అతడిని సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాఘవేంద్ర, బసప్ప ఆరోగ్యం కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి కి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.
గుండెపోటు వచ్చిన రైతుకు ప్రభుత్వం స్ట్రెచర్ మీదనో, అంబులెన్స్ మీదనో తీసుకురావాల్సి ఉండగా బేడీలు వేసి తీసుకురావడం శోచనీయమని అన్నారు. రాజ్యాంగంలోని 14, 16, 19 ఆర్టికల్స్ ప్రకారం వారి హక్కులను హరించడమే నని స్పష్టం చేశారు. నూతన క్రిమినల్ చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం కూడా, పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం అండర్ ట్రయల్స్ ఖైదీల హక్కులను హరించడమేనని వెల్లడించారు.
గవర్నర్ విచారణకు ఆదేశించాలి
రాష్ట్ర హైకోర్టు (High court) ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ ఈ అంశం లోని తగిన విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జైపూర్లో విందులు, వినోదాలలో జల్సాలు చేసుకుంటూ చిందులు చేసుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ గిరిజన రైతులు మాత్రం జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీకి నిజంగానే హృదయం ఉంటే, గిరిజనుల పట్ల ప్రేమ ఉంటే రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి చేతకాకుంటే జైలులో ఉన్న లగచర్చ రైతులకు అవసరమైన వైద్య సహకారాన్ని, సహాయన్ని పార్టీ తరఫున అందిస్తామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలని,
భేషజాలకు పోకుండా గిరిజనులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకొని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తనపై ఎలాంటి దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ చెప్పినా కూడా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని వారిపై కేసులు పెట్టించడం అహాంకారానికి నిదర్శనమని విమర్శించారు. అదానీకోసం, అల్లుడి కోసం భూములు గుంజుకుంటామంటే ఇవ్వకపోవడమే రైతన్నలు చేసిన ఏకైక తప్పు అని అన్నారు. రేవంత్ రెడ్డి భూదాహం, అహంకారం వల్లే 20 రోజులుగా రైతులు జైళ్లలో మగ్గుతున్నారని వాపోయారు.