KTR | హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): మహిళలు, ఆడబిడ్డల పట్ల మాజీ మంత్రి కేటీఆర్‌కు ఉన్న గౌరవ మర్యాదలను కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేకపోతున్నది. మహిళల సమస్యలు, వాటిని పరిష్కరించే అంశాలపై ఆయన ప్రదర్శించే హుందాతనం కాంగ్రెస్ నేతల కంటికి కనిపించటం లేదు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, నటుడు ప్రభాస్‌పై గతంలో టీడీపీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. 2014లో, 2019లో దారుణ విమర్శలు చేశారు. ఈ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని 2014, 2019లో కేటీఆర్ స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను సోషల్ మీడియాలోకి లాగొద్దని హెచ్చరించారు.
దోషులకు శిక్షపడేలా చేస్తామని, అవసరమైతే చట్టాల్లో మార్పులు సైతం తీసుకురావడానికి వెనుకాడబోమని కేటీఆర్ 2014లోనే చెప్పారు. నాడు తనకు సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తో మాట్లాడినట్టు చెప్పారు. 2019 జనవరిలోనూ అదే తరహా విష ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకున్న నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం నుంచి కేటీఆర్, కవిత స్పందించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని నాటి హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ను ఆదేశించారు.
అప్పటికే వైఎస్ షర్మిల దంపతులు అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేయటంతో హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీస్ విభాగం స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. అడిషనల్ డీసీపీ రఘువీర్ నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం పలు కోణాల్లో కేసును ఇన్వెస్టిగేట్ చేసి, కొందరిని అరెస్టు చేసింది. అప్పటికి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉండగా.. తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, అందుకే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వైఎస్ షర్మిల చెప్పారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలో టీడీపీకి భాగస్వామ్యం ఉందని ఆమె ఆరోపించారు. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనం రేపాయి.