ఒక్కో రంగానికి ఒక్కో పారిశ్రామికవాడ.. ప్రపంచాన్ని ఏలుతున్న పారిశ్రామిక దిగ్గజాలు.. పరిశోధన వ్యవస్థలు.. స్టార్టప్‌లు.. లాజిస్టిక్‌లు, ఐటీ, గేమింగ్, ఫార్మా, టెక్స్టైల్.. రోదసి పరిజ్ఞానం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే లేదు.. కంపెనీ, పరిశ్రమ ఏదైనా సరే.. తెలంగాణే గమ్యస్థానం. పెట్టుబడులు పెట్టేవారికి ఈజీ డెస్టినేషన్. చిన్న చిన్న కంపెనీల నుంచి బహుళజాతి సంస్థల వరకు భారత్‌వైపు చూస్తే.. కనిపించేది తెలంగాణే. తెలంగాణకు వస్తే.. స్థల సేకరణ సమస్యకాదు. అనుమతుల్లో ఇబ్బందే ఉండదు. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే ఖాయంగా అనుమతి వస్తుంది. నాణ్యమైన విద్యుత్తు, నీరు.. రహదారులు.. ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఆలోచించాల్సిన పనేలేదు. ఇది ఏడున్నరేండ్లలో తెలంగాణ సాధించిన అబ్బురపరిచే విజయం. తెలంగాణ నాయకత్వ దక్షతకు నిదర్శనం.
తెలంగాణ ఏర్పాటుకు కొట్లాట ఎంతైందో.. తెచ్చుకొన్నదాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం పడుతున్న శ్రమ అంతకంటే ఎక్కువైంది. రాష్ట్రం వచ్చిన నాటినుంచి ఫలానా రంగం అని కాకుండా.. ఒకేసారి సమాంతరంగా పలు రంగాల అభివృద్ధిపై ప్రభుత్వం సారించిన దృష్టికి వచ్చిన ఫలితమిది. ఒక పక్క వ్యవసాయం.. నీళ్లు.. విద్య, వైద్యం, సంక్షేమ రంగాలను పరిపుష్టం చేస్తూనే.. మరోవైపు ఐటీ, పరిశ్రమలు, టెక్నాలజీ రంగాల ప్రగతిపై కూడా దృష్టిసారించిన ఫలం.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి. పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణకు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా మారాయి. రాష్ర్టాల పరిధులను దాటి.. దేశాలతోనే పోటీపడే స్థాయికి తెలంగాణ ఎదిగింది.
వృద్ధిరేటు 12.98% దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ.. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు..2020-21లో రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): వినూత్న విధానాలతో పారిశ్రామిక వర్గాలను విశేషంగా ఆకట్టుకొంటున్న తెలంగాణ.. పెట్టుబడులకు దేశంలోనే ప్రధాన గమ్యస్థానంగా మారింది. గత ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా 17,797 పరిశ్రమలకు అనుమతులిచ్చి భారీస్థాయిలో రూ. 2.21 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టింది. ఫలితంగా 16.06 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చూపుతున్న ప్రత్యేక చొరవ తెలంగాణను ప్రపంచ విపణిలో అత్యుత్తమ పోటీదారుగా నిలిపింది.
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల ద్వారానే నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీఎస్ ఐపాస్‌ను అమల్లోకి తీసుకొచ్చి జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు అనుమతులను సులభతరం చేసింది. గత ఏడేండ్లలో 15,797 తయారీరంగ పరిశ్రమలకు, 1,719 సేవారంగ పరిశ్రమలకు అనుమతులివ్వడంతోపాటు ఖాయిలాపడ్డ 334 చిన్న పరిశ్రమలను ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా పునరుద్ధరించింది. మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు, కమలాపూర్ రేయాన్స్ ఫ్యాక్టరీలను తెరిపించింది. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ ద్వారా 56 కొత్త పారిశ్రామిక వాడల్లో 19,981 ఎకరాలను అభివృద్ధిచేసింది. మరో 15,620 ఎకరాల భూమిని సేకరించి సిద్ధం చేస్తున్నది.
దశాబ్దాలుగా ఉన్న విద్యుత్తు సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నది. జల వనరుల్లో 10% వాటాను రిజర్వు చేయడం ద్వారా పరిశ్రమలకు నీటి సమస్య తలెత్తకుండా చేసింది. రాష్ట్రంలో వాణిజ్యాన్ని సులభతరం చేసేందుకు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టడంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఫలితంగా కిటెక్స్, యంగ్వన్, పెప్సీకో, కోకాకోలా, అమెజాన్ డాటా సర్వీసెస్, విప్రో, ఐకియా ఇండియా, వెల్స్పన్ లాంటి బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు అధికంగా వచ్చాయి.
బడుగు, బలహీన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీ-ఐడియా, టీ-ప్రైడ్ పేరుతో ప్రత్యేక ప్రోత్సాహకాలను అందజేస్తున్నది. దీనిలో భాగంగా గత ఏడేండ్లలో దళితుల ఆధ్వర్యంలోని 24,426 యూనిట్లకు రూ.1,081 కోట్లు, గిరిజనులకు చెందిన 22,440 యూనిట్లకు రూ.1,016 కోట్లు, వికలాంగుల ఆధ్వర్యంలోని 1,538 యూనిట్లకు రూ.83 కోట్ల ప్రోత్సాహకాలను అందజేసింది. మరోవైపు మైనారిటీ యువతకు లబ్ధి చేకూరేలా హైదరాబాద్ పాతబస్తీలో టాస్క్, టీ-హబ్, న్యాక్, వీ-హబ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. గత ఏడేండ్లలో ముస్లింలకు చెందిన 705 యూనిట్లకు అనుమతులిచ్చింది. తద్వారా రూ.800 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 6,800 మందికి ఉద్యోగాలు లభించాయి.
కేరళకు చెందిన కిటెక్స్ దుస్తుల తయారీ పరిశ్రమ ఆ రాష్ట్రం నుంచి నిష్క్రమించనున్నట్టు ప్రకటించడంతో మన దేశంలోని వివిధ రాష్ర్టాలతోపాటు బంగ్లాదేశ్, ఇండోనేషియా లాంటి దేశాలు ఆ సంస్థ యాజమాన్యాన్ని సంప్రదించాయి. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కిటెక్స్ను తెలంగాణకు రప్పించడంలో సఫలీకృతులయ్యారు. దీంతో ఆ సంస్థ రాష్ట్రంలో రూ.2,400 వేల కోట్లతో రెండు వస్త్ర పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది.
ఉద్యోగాల కల్పనలో ప్రధానపాత్ర పోషిస్తున్న చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా చిన్న, మధ్యతరహా (ఎస్ఎంఈ) పారిశ్రామిక వాడల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఒక్కో పార్కును 50-60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నది. వీటిలో బుగ్గపాడు, కల్లెం, నర్మాల, కుందన్‌పల్లి పార్కులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మరో 4 పార్కుల పనులు తుదిదశకు చేరాయి. ఇవికాకుండా ఇప్పటికే కొనసాగుతున్న 12 పార్కుల అప్‌గ్రేడ్‌కు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో పార్కుకు రూ.10 కోట్లు ఖర్చుచేసి ఉద్యోగులకు నైపుణ్య శిక్షణా కేంద్రం, అదనపు మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది.
దేశీయ ఔషధ రంగానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతున్న తెలంగాణ వివిధ రాష్ర్టాలతోపాటు పలు దేశాలకు అనేక రకాల ఔషధాలను ఎగుమతి చేస్తున్నది. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద ఆర్ అండ్ డీ క్లస్టర్‌గా, ప్రపంచ వ్యాక్సిన్ కేంద్రంగా ఎదిగింది. రాష్ట్రంలో ఔషధ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా బయోఫార్మా హబ్‌ను, మెడికల్ డివైజెస్ పార్కును ఏర్పాటు చేశారు. దీంతో లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే 311 సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.6,734.56 కోట్ల పెట్టుబడులతోపాటు 34,000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.
ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు, తెలంగాణలో కల్పిస్తున్న ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు మెచ్చి గత ఏడేండ్లలో పలు ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. వీటిలో బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, జీఈ ఏవియేషన్, సఫ్రాన్, రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎల్బిట్ సిస్టమ్స్ తదితర అంతర్జాతీయ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ (ఓఈఎం) సంస్థలున్నాయి. ఇవి కాకుండా టాటా, అదానీ గ్రూపు, కల్యాణి గ్రూపు లాంటి దేశీయ సంస్థలు తెలంగాణలో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలను ఏర్పాటు చేశాయి. వీటికి అనుబంధ పరికరాల తయారీ కోసం పలు చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పారును ఏర్పాటు చేయడంతోపాటు ఏరోస్పేస్, డిఫెన్స్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించేందుకు చర్యలు చేపడుతున్నది.
ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ), ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ఈవీ రంగం అభివృద్ధికి ప్రత్యేక పాలసీని ప్రవేశపెట్టడంతోపాటు 3,800 ఎకరాల్లో ప్రత్యేక క్లస్టర్‌ను అభివృద్ధి చేసింది. దీనిలో పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే పలు సంస్థలు ముందుకొచ్చాయి. మరోవైపు జహీరాబాద్‌లో మహీంద్రా సంస్థ రూ.100 కోట్లతో ట్రాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నది. ఫియట్ సంస్థ సైతం రూ.1,110 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇదేవిధంగా బండ తిమ్మాపూర్, బండ మైలారంలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేయడంతో రూ.1,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
తెలంగాణ ఏర్పాటు అనంతరం చేనేతరంగం మళ్లీ జీవం పోసుకున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేతన్నలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్నకు చేయూత’, ‘చేనేతమిత్ర’ పథకాలను అమలు చేస్తున్నది. నేతన్నకు చేయూత కింద ఇప్పటివరకు 20,537 మంది చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు అందించింది. చేనేతమిత్ర పథకం కింద నూలు కొనుగోలుపై 40% రాయితీ ఇస్తుండటంతో నేతన్నలకు రూ.11.57 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అంతేకాకుండా ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల యూనిఫామ్స్, బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకే ఇచ్చి చేతినిండా పని కల్పిస్తున్నది.
టీ హబ్, వీ హబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంకుర పరిశ్రమలకు చేయూతనిస్తున్నది. నూతన ఆవిష్కరణలకు నెలవుగా భాసిల్లుతున్న టీహబ్ మొదటి లాక్డౌన్ సమయంలోనే పలు వెబినార్లను నిర్వహించి 4,000 మందిలో భరోసా నింపింది. అలాగే, వీహబ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నది. వారికి వ్యాపార మెళకువలను నేర్పడంతోపాటు సాంకేతికంగా, ఆర్థికంగా చేయూతనిస్తున్నది. వీహబ్ ద్వారా ఇప్పటివరకు రూ.53.2 కోట్లు అందించి 4,527 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దింది.
దేశ ఐటీ రంగంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ.. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో రూ.1.28 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఐటీ ఎగుమతులు.. 2020-21లో రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. రాష్ట్ర ఐటీ రంగం కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించింది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఉన్న 20కి పైగా సంస్థలు హైదరాబాద్‌లో కొలువుదీరడం విశేషం.