హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మూసీ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా నివాసాలు, ఇండ్లస్థలాలు కోల్పోతున్న బాధితుల పక్షాన తమ పార్టీ లీగల్ సెల్ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తుందని చెప్పారు. బాధితులు రూపాయి కూడా వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకోవద్దని చెప్పారు. మూసీ తీరం వెంట ఇండ్లు, స్థలాలు, ఆస్తులు కోల్పోతున్న కిషన్‌బాగ్, బహదూర్‌పుర, లంగర్‌హౌస్ ప్రాంతాలకు చెందిన బాధితులు బుధవారం తెలంగాణ భవన్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పలువురు బాధితులు కేటీఆర్‌కు తమ గోడును వెళ్లబోసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులను ఓదార్చిన కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చుకున్నదని, న్యాయస్థానంలో దానికి సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు ముఖేశ్ చందా, సోఫియా, సిద్ధిఖీ, ఖుషీ తదితరులు బాధితుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం తెలంగాణ భవన్‌లోనే బాధితులకు భోజన ఏర్పాట్లుచేశారు.
మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కోర్టుల్లో కొట్లాడుతుంది. అవసరమైతే లంచ్ మోషన్ పిటిషన్ కూడా వేస్తాం. మీకు న్యాయం జరిగేవరకు మీ తరఫున మా పార్టీ పోరాడుతుంది.
– కేటీఆర్
డబుల్ బెడ్రూం ఇండ్లను నలుగురికి కేటాయిస్తున్నారు. మేము అక్కడికి వెళ్తే అక్కడున్న వాళ్లు మమ్మల్ని కొట్టి బయటకు తరిమేస్తున్నరు. పురాణాపూల్ నుంచి జియాగూడ వరకు మావాళ్ల ఇండ్ల్లు ఎన్నో పోతున్నాయి. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. పునరావాసం కల్పించాలి. కానీ, అక్కడికెళ్లండి.. ఇక్కడికెళ్లండి అని తరుముతున్నరు. మా బతుకులు అడ్డమీది కూలీల కంటే అధ్వానమైనయి. అసలు మా పరిస్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలి.
-ఫాతిమా బేగం, బహదూర్‌పుర
20 ఏండ్ల క్రితమే మా ఇంటికి రిజిస్ట్రేషన్ ఉన్నది. ఇంటి పన్ను, కరెంట్, నల్లా బిల్లులూ కడుతున్నాం. మున్సిపాలిటీ సహా ఇతర అన్నింటిలోనూ పన్నులు కడుతూ వస్తున్నాం. ఇప్పుడు ఆ డబ్బు ఎవరిస్తరు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు పదేండ్లు ఏనాడూ, ఏ పరేషాన్ లేదు. నేడు రేవంత్‌రెడ్డి ఇల్లు కూల్చి మమ్మల్ని రోడ్డున పడేశాడు. మమ్మల్ని కబ్జాదారులు అంటున్నడు. రేవంత్‌రెడ్డి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నడు. ఆయనకు కోర్టులోనే జవాబు చెప్తం. వదిలిపెట్టం.
-సాధికాబేగం, కిషన్‌భాగ్
మా కండ్ల ముందే మా ఇల్లు పోతుంటే తట్టుకోలేకపోతున్నాం. నాలుగైదు రోజుల నుంచి నిద్ర కూడా పట్టడంలేదు. ఉదయం నుంచి సాయంత్రం దాకా పడిగాపులు పడుతున్నాం. మాకు ఎవ్వరూ భరోసా ఇవ్వడం లేదు. ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నడు. మాకు ఇంత అన్యాయం చేస్తడా? ఓట్లప్పుడు ఎంఐఎం నాయకులు ఇండ్ల చుట్టూ తిరిగారు. ఇప్పుడు ఎటుపోయారు. రూపాయి రూపాయి కూడబెట్టి బంగారం మొత్తం అమ్మి ఇల్లు కొన్నాం.
-మల్లికరజ్విక్, మొఘల్‌నగర్
మూసీ నది వెంట 1940, 1976 సంవత్సరాల నాటి గ్రామాల మ్యాప్‌లు ఉన్నాయి. టీప న్లు ఉన్నాయి. డబ్బు పెట్టి మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇండ్లు కట్టుకున్నాం. మా యన్నీ పక్కా పట్టాభూములు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభు త్వం మా భూములను తీసుకోవాలనుకొంటే సర్కారు నిబంధనల ప్రకారం మాకు పరిహారం చెల్లించాలి. పునరావాసం కల్పించాలి. కానీ, అలాంటిదేమీ చేయకుండా మమ్మల్ని కబ్జాకోరులుగా చిత్రీకరించడాన్ని మేము సహించం.
-ముస్తఫా, కిషన్‌బాగ్