కేసీఆర్ మాట వినాలని.. ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తదని ప్రజలు చెప్తున్నరు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతదనే భరోసా కలుగుతదంటున్నరు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తమంటే మేమొస్తమని ప్రతి నియోజకవవర్గం నుంచీ స్వచ్ఛందంగా కదులుతున్నరు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా.. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టమొచ్చినా అందరూ తెలంగాణ భవన్వైపే వస్తున్నరు.
-కేటీఆర్
KTR | వరంగల్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అన్ని సందర్భాల్లోనూ తెలంగాణ ప్రజల గుండె ధైర్యంగా ఉంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా వెంటనే తెలంగాణ భవన్‌కు వస్తున్నారని, వారికి తెలంగాణ భవన్.. జనతా గ్యారేజీలాగా ఉంటున్నదని చెప్పారు. 14 ఏండ్లు రాష్ట్ర సాధన ఉద్యమ పార్టీగా, పదేండ్లు అధికార పార్టీగా, 16 నెలలుగా ప్రతిపక్ష పార్టీగా.. ప్రజలు ఏ బాధ్యతను ఇస్తే ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వహిస్తూ తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నదని వివరించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను కేటీఆర్ బుధవారం మధ్యాహ్నం మండుటెండలో పరిశీలించారు.
రజతోత్సవ మహాసభ ప్రాంగణం, వేదిక, పార్కింగ్, వైద్యసేవలు, తాగునీరు, ఇతర అన్ని వసతుల పనులను పర్య వేక్షించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి మహాసభ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు.. అనే పోరాటతత్వాన్ని సంపూర్ణంగా ఆకళింపు చేసుకొని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తెలంగాణ సాధించాలనే నినాదంతో 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న సంస్థ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ నాయకత్వంలో 24 ఏండ్ల క్రితం ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఏర్పడింది. తర్వాత 14 ఏండ్లు తెలంగాణ ప్రజలను ఎక్కడికక్కడ సమీకరిస్తూ, రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను జాతీయ, రాజకీయ వ్యవస్థలకు, దేశంలోని వివిధ సమూహాలకు ఎప్పటికప్పుడు వివరించింది.
ప్రతీ సమస్యపై పోరాడింది. బీఆర్ఎస్కు ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం ఉన్న రెండు తెలుగు రాష్ర్టాల్లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నో రాజకీయ సంస్థలు, ఉద్యమసంస్థలు పుట్టాయి… మాయమైపోయాయి. ఒక ఉద్యమపార్టీగా, అధికార పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా ఇన్ని పాత్రల్లో 24 ఏండ్లు పూర్తి చేసుకుని, 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విశిష్టత బీఆర్ఎస్కు ఉన్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన బీఆర్ఎస్ మాత్రమే అస్థిత్వాన్ని నిలుపుకొన్నాయి. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్ఎస్ హిమాలయాల స్థాయికి తీసుకెళ్లింది’ అని కేటీఆర్ వివరించారు.
తెలంగాణ ప్రజల గుండె ధైర్యం ఈ గులాబీ జెండా. ఏ వర్గం ప్రజలకు ఏ కష్టమొచ్చినా హైదరాబాద్‌లోని తెలంగాణభవన్ వైపే వస్తున్నారు. తెలంగాణభవన్ అన్ని వర్గాల కష్టాలను తీర్చే జనతా గ్యారేజీ మాదిరిగా ఉంటున్నది. హైడ్రా, మూసీ, లగచర్ల బాధితులైనా… ధన దాహానికి, అధికార బలానికి ఇబ్బందిపడిన హెచ్‌సీయూ విద్యార్థులైనా.. ఈ గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు న్యాయం చేస్తదన్న నమ్మకంతో జై కొడుతున్న పరిస్థితి ఉన్నది.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ ఆషామాషీ సభ కాదని, దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే మహాసభగా నిలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఉద్యమంలో మొదటినుంచీ గులాబీ జెండాకు ఉమ్మడి వరంగల్ జిల్లా అండగా ఉన్నది. ఉద్యమ ప్రస్థానంలో ఏ కష్టమొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కేసీఆర్ తిరిగి చూసింది వరంగల్ వైపే. జయప్రదంగా, అద్భుతంగా ఇక్కడ ఎన్నో మహాసభలను నిర్వహించుకున్నాం. బీఆర్ఎస్కు 24 ఏండ్లు నిండి 25వ సంవత్సరంలో అడుగుపెడుతున్న రజతోత్సవానికి వరంగల్ వేదిక కావడం మనందరికీ గర్వకారణం.
ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తలు, నాయకులు, అందరి కోరిక మేరకు మరో మహాసభకు వరంగల్‌ను వేదికగా ఎంచుకున్నాం. 1,250 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్, సభా ప్రాంగణం ఉంటుంది. రాష్ట్రంలోని ఏ మూలనుంచైనా వచ్చే ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహాసభ ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ప్రతీ నియోజకవర్గం నుంచి, ప్రతీ జిల్లా నుంచి.. ఇంకా ఎక్కువ వాహనాలు ఏర్పాటుచేయాలని, కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ మాట వింటే కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేయడానికి.. బాధితులందరికీ గుండె నిండా మరోసారి ఉత్సాహం వస్తదని అంటున్నారు. మేమొస్తమంటే మేమొస్తమంటూ ప్రతి నియోజకవవర్గం నుంచి ఒత్తిడి వస్తున్నది’ అని కేటీఆర్ వివరించారు.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించినవారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన కేటీఆర్.. మీడియా సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించి, సంతాపం వ్యక్తంచేశారు.
ఏప్రిల్ 27న మొత్తం రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీలు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీ వార్డుల్లో ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగురవేసి బయలుదేరాలి. ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు కేసీఆర్ మహాసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమయం కంటే ముందుగానే ఇక్కడికి చేరుకోవాలి. ఎడ్లబండ్లలో వచ్చే వాళ్లు ట్రాఫిక్‌జాం చేయకుండా 26న మహాసభ వద్దకు చేరుకోవాలి.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
‘ఉమ్మడి వరంగల్, పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా మిత్రులు ఎవరికివారు ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనంలో వచ్చేయండి. హుస్నాబాద్, హుజూరాబాద్ వాళ్లు మోటర్‌సైకిళ్లపై వచ్చేందుకు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో రావాలి. 40 వేల వాహనాలు వచ్చినా ఏ ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం ఉన్నది. చిన్న వాహనాలు, పెద్ద వాహనాలు, బస్సులు, ఆటోలు, జీపులు, కార్లు… ఇలా ఎన్ని వాహనాలు వచ్చినా ఎక్కడో దూరం నుంచి నడిచివచ్చే అవసరం లేకుండా మహాసభ ప్రాంగణం పక్కనే పార్కింగ్ ఏర్పాట్లుచేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు. మహాసభ కోసం వచ్చే వారు వాహనాలు దూరంగా పెట్టే అవసరం లేదు. ఏ రోడ్డు నుంచి వచ్చే వాహనాలకు అక్కడే పార్కింగ్ కల్పించారు.
సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మీదుగా వచ్చే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల వాహనాలకు 260 ఎకరాల్లో పార్కింగ్ ఉన్నది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లా నుంచి వచ్చే వాహనాల కోసం 600 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చే వారికీ ఇబ్బంది లేకుండా పార్కింగ్ వసతి ఉన్నది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వచ్చే ఏ ఒక్కరూ కిలోమీటర్ల దూరం నడిచే ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పార్కింగ్ స్థలం, సభావేదిక వద్ద ఏర్పాటు చేశాం. ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఉంటుంది.
మహాసభకు వచ్చే లక్షలాది మంది కోసం ఎక్కడికక్కడ 10 లక్షల వాటర్ ప్యాకెట్లు, 10 లక్షల సల్ల ప్యాకెట్లు పెడుతున్నాం. మహాసభకు వచ్చినవారికి ఎండదెబ్బ, ఇతర ఏ సమస్య వచ్చినా వెంటనే వైద్యసాయం అందించేందుకు 100 పైచిలుకు వైద్యబృందాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఎమర్జెన్సీ వైద్యసేవల కోసం 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేస్తున్నాం. దూరప్రాంతాల నుంచి వస్తున్న ఆడబిడ్డలు, అన్నదమ్ముల కోసం ఎండాకాలం ఇబ్బందులు లేకుండా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో తాత్కాలిక టాయిలెట్ల నిర్మాణం కొనసాగుతున్నది’ అని కేటీఆర్ వివరించారు.
ఎల్కతుర్తిలో జరగబోతున్న సభ ఆషామాషీ సభ కాదు. దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే మహాసభగా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి, ప్రతి జిల్లా నుంచి.. ఇంకా ఎక్కువ వాహనాలు ఏర్పాటుచేయాలని రిపోర్టులు పంపుతున్నారు. కేసీఆర్ మాట వినాలని, ఆయన మాట వింటే ధైర్యం వస్తుందని ప్రజలు చెప్తున్నారు.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభతో తెలంగాణ సాధన ఉద్యమం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు. ‘ఇదొక ఉత్కృష్ట సందర్భం. పార్టీ చరిత్రలో ఇలాంటివి మళ్లీమళ్లీ రావు. మళ్లీ 50 ఏండ్ల పండుగ.. గోల్డెన్ జూబ్లీ వస్తుంది. రజతోత్సవ మహాసభకు వస్తున్న ప్రజలతో ఈరోజు ఒక దృశ్యం చూస్తే.. చాలా గొప్పగా అనిపించింది. మళ్లీ ఉద్యమం నాటి రోజులు గుర్తుకొచ్చాయి. ఉద్యమ సమయంలో వరంగల్‌లో సభ పెడితే నర్సంపేట, పరకాల నుంచి ప్రభ బండ్లు వచ్చేవి. ఇప్పుడు సూర్యాపేట నుంచి బయలుదేరినయి. ‘బండెనక బండి కట్టి..’ అని బండి యాదగిరి అప్పుడెప్పుడో పాట రాశారు. ఇవాళ సూర్యాపేట జిల్లా రైతన్నలు ఎడ్లబండ్లతో పెద్ద ఎత్తున బయలుదేరి వస్తున్నారు. ఈరోజు సాయంత్రం తొర్రూరు చేరుకుంటారు. ఉద్యమస్ఫూర్తిని, రైతాంగానికి కేసీఆర్‌పై ఉన్న ప్రేమను చాటుతూ అక్కడినుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. 60 లక్షల గులాబీ దండు అందరికీ నా ప్రార్థ్ధన.
మనందరం బయలుదేరి మహాసభకు రావాలి. వర్ధన్నపేట నుంచి 500 ఎడ్లబండ్లు రాబోతున్నాయని దయాకర్‌రావు చెప్తున్నారు. ఎడ్లబండ్లలో వచ్చే వాళ్లు ట్రాఫిక్‌జాం కాకుండా 26న మహాసభ వద్దకు చేరుకోవాలి. గతంలో వరంగల్‌లో సభలు పెట్టినప్పుడల్లా జనగామ వరకు ట్రాఫిక్‌జామ్ అయ్యేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా రెండు వేల మంది వలంటీర్లను నియమించుకున్నాం. కెనాల్ బ్రిడ్జిలు, చిన్న కల్వర్టుల వద్ద వలంటీర్లను ప్రత్యేకంగా నియమిస్తాం. ప్రతీ గులాబీ సైనికుడు, కేసీఆర్ దళంలోని ప్రతీ సభ్యుడు, ప్రతీ ఒక్కరూ అందుబాటులో ఉన్న వాహనంలో మహాసభకు చేరుకోవాలి. మన నాయకుడు కేసీఆర్‌కు, తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి, అడ్డుకోవడానికి, ఎదుర్కోవడానికి, 11 ఏండ్లుగా బీజేపీ చేస్తున్న పన్నాగాలను, తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై కేసీఆర్ ఇచ్చే సందేశాన్ని గ్రామగ్రామానికి తిరిగి చేరవేయడానికి అందరూ కదిలి రావాలి.
ఏప్రిల్ 27న మొత్తం రాష్ట్రంలోని 12,796 గ్రామ పంచాయతీలు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీ వార్డుల్లో ఎక్కడికక్కడ గులాబీ జెండాలు ఎగురవేసి బయలుదేరాలి. ఆరోజు సాయంత్రం 4.30 గంటలకు కేసీఆర్ మహాసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమయం కంటే ముందుగానే ఇక్కడికి చేరుకోవాలి. కరోనా టైంలో సైతం కేసీఆర్ సందేశం వినాలని తెలంగాణ ప్రజలకు ఉన్న ఉత్సుకత ఇప్పుడూ ఉన్నది. కేసీఆర్ మాటలు వింటే ధైర్యం వస్తుందనే పరిస్థితి రాష్ట్రమంతా ఉన్నది.
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తున్నది. ఎల్కతుర్తిలో మేం నిర్వహించే సభ గవర్నమెంట్ మీద పోరాటానికో, ప్రజలను రెచ్చగొట్టడానికి చేస్తున్నది కాదు. శాంతియుతంగా, మా పార్టీ 25వ వార్షికోత్సవాన్ని రజతోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇప్పటి వరకు ఉన్నట్టుగానే రాబోయే మూడు నాలుగు రోజులు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని జిల్లా యంత్రాంగానికి, పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు.
కేసీఆర్ మాట వినాలని.. ఆయన మాట వింటే గుండె నిండా ధైర్యం వస్తదని ప్రజలు చెప్తున్నరు. కేసీఆర్ మాటలు వింటే కాంగ్రెస్ అరాచక పాలన అంతమవుతదనే భరోసా కలుగుతదంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మేమొస్తమంటే మేమొస్తమని ప్రతి నియోజకవవర్గం నుంచీ స్వచ్ఛందంగా కదులుతున్నరు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా.. రాష్ట్రంలో ఏ వర్గం వారికి కష్టమొచ్చినా అందరూ తెలంగాణ భవన్వైపే వస్తున్నారు.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కరెంటు ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతదో తెలుస్తలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే కరెంట్ మీద మాకు నమ్మకం లేదు. వీళ్లను నమ్ముకుంటే కచ్చితంగా ఏదో రకంగా మోసం చేస్తారని బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం 200 జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నాం.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం 20 రోజులుగా వరంగల్ జిల్లా నాయకులు చాలామంది కష్టపడుతున్నారని కేటీఆర్ అభినందించారు. ‘సోదరులు దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పూర్తిస్థాయిలో నిమ్నగమై ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజయ్య, సత్యవతి రాథోడ్, రెడ్యానాయక్, కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ రవీందర్రావు అందరూ వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని కేటీఆర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యానాయక్, దాస్యం వినయ్‌భాస్కర్, వొడితెల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, బానోత్ శంకర్‌నాయక్, నన్నపనేని నరేందర్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గ్యాదరి బాలమల్లు, నాగుర్ల వెంకటేశ్వర్లు, కే వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి పాల్గొన్నారు.