KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మూసీ నది సుందరీకరణ పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. మూసీ సుందరీకరణ పనులను పాకిస్థాన్ కంపెనీలకు కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని, బ్లాక్‌లిస్టులో ఉన్న కంపెనీకి అప్పగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతానని హెచ్చరించారు. బుధవారం ఆయన కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని ఎల్బీఎస్నగర్లో జలమండలి నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం, కూకట్పల్లి ఖాజాకుంటలో నిర్మించిన మరో ఎస్టీపీని పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో 11.86 ఎకరాల స్థలంలో రూ.171.57 కోట్ల నిధులతో 133 ఎంఎల్డీ సామర్థ్యంతో జలమండలి ఆధ్వర్యంలో ఈ మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టడం విశేషం.
కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్‌అలీ, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జలమండలి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీలను వినియోగించుకుంటే సరిపోతుందని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం రూ.4 వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలు నిర్మంచిందని చెప్పారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదని దుయ్యబట్టారు. మూసీ సుందరీకరణ కోసం 1.50 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఒకసారి, రూ.50 వేల కోట్లు అని మరోసారి, రూ.75 వేల కోట్లు అని ఇంకోసారి ఇలా రకరకాలుగా మంత్రులు పొంతనలేని ప్రకటనలు చేయడం వెనుక అస లు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.
మంత్రుల మాటలు చూస్తుంటే పలు అనుమానాలు తలెత్తున్నాయని చెప్పారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అసలు ఉద్దేశం వేరే ఉన్నదా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతున్నదని పేర్కొన్నారు. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీరు మూసీలోకి వెళ్తుందని, 94% స్వచ్ఛమైన నీరు వెళ్తున్నప్పుడు మూసీ శుద్ధి ఎందుకు? అని ప్రశ్నించారు. కొత్తగా శుద్ధి చేసేదేమీలేదని తెలిపారు. మూసీ నిర్వాసితులకు ముందుగానే నష్టపరిహారం చెల్లించాలని, డబుల్ బెడ్రూం ఇంటి తాళాలు అప్పగించి కూల్చివేతలు చేపట్టాలని, లేనిప క్షంలో మూసీ వద్ద కూల్చివేతలను బీఆర్ఎస్ అడ్డుకుంటుందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముం దు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గ్యారెంటీలు అమలు పరిచేదాకా ప్రజల పక్షాన నిలబడతామని స్పష్టంచేశారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన రూ.4 వేల పింఛన్, తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలుచేయాలని, వానకాలం రైతుభరోసాను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పబ్లిసిటీ స్టంట్ల మాయ ఎక్కువ రోజులు పని చేయదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన శ్మశానవాటికలు, లింక్‌రోడ్లు, ైప్లెఓవర్లు, అండర్‌పాస్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీహాల్స్, పార్క్‌లు, మురుగునీరు శుద్ధి కేంద్రాలను చూసి ప్రజలు ప్రశంసలు కురిపించారని తెలిపారు.
కూకట్‌పల్లిలో ఎస్టీపీల నిర్మాణం కోసం రూ.300 కోట్లు కేటాయించగా నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇండ్ల కూల్చివేతల విషయంలో ముఖ్యమంత్రి అన్నదమ్ములకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇండ్లు కూల్చడానికి బుల్డోజర్లు పెడతరు కానీ, పెద్దలకు పెట్టరా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుల్డోజర్ల బాధితులకు వెంటనే రెడీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన నాలుగు ప్రాజెక్ట్‌లు పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. పనులు పూర్తి చేసుకున్న ఫతేనగర్ ఎస్టీపీని ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్నదని మండిపడ్డారు. ఫతేనగర్ బ్రిడ్జి కోసం రూ.60 కోట్లు కేటాయించి పనులు చేపట్టినా నిధులు విడుదల చేయని కారణంగా ఆ పనులు ముందుకు సాగడం లేదని తెలిపారు. తాము 14 వేల ఎకరాల స్థలాన్ని ఫార్మాసిటీకి కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసి, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేస్తామనడం శోచనీయమని పేర్కొన్నారు.
మూసీ ప్రాజెక్టుపై సీఎం, మంత్రుల మాటలకు పొంతన లేదు. మూసీ సుందరీకరణ కోసం 1.50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఒకసారి, రూ.50 వేల కోట్లు అని మరోసారి, రూ.75 వేల కోట్లు అని ఇంకోసారి ఇలా రకరకాలుగా పొంతనలేని ప్రకటనలు చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతాం.
– కేటీఆర్