హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ)/ గీసుగొండ: నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ దార్శనికత ఇప్పుడూ ఫలితాలను ఇస్తున్నది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా నాటి కేటీఆర్ చొరవ నేడు తెలంగాణ సమాజానికి ఉపాధి బాటను పరుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన ఓ పరిశ్రమ ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమై పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించింది. ఏకంగా 25 వేల ఉద్యోగాలకు తాజాగా కిటెక్స్ అనే ఆ సంస్థ నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో ఆనాటి కేసీఆర్ కృషి ఫలితాలను ఇస్తున్నదనడానికి ఓ నిదర్శనంగా నిలిచింది. అంతర్జాతీయ దుస్తుల తయారీ సంస్థ అయిన కిటెక్స్ పరిశ్రమ చైర్మన్, ప్రతినిధులను నాడు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పించి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని మెగా టెక్స్టైల్ పార్కులో, రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకున్నది. వారితో ఆనాడే ఎంవోయూ కుదుర్చుకున్నది. దీంతో ఆప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పరిశ్రమ నిర్మాణానికి భూమిపూజ కూడా చేశారు.
గీసుకొండలో కిటెక్స్ కంపెనీ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతుండడంతో పస్త్ర పరిశ్రమలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీర్లతో పాటు వివిధ హోదాల్లో పనిచేయడానికి ఉద్యోగుల నియామకం కోసం కంపెనీ ప్రకటన జారీచేసింది. దీంతో మంగళవారం వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల నుంచి నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. వారి అర్హతను బట్టి కంపెనీ నిర్వాహకులు దరఖాస్తులను స్వీకరించారు. తొలిరోజు 150 మంది అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకున్నట్టు కంపెనీ ప్రతినిధి మనోజ్‌కుమార్ తెలిపారు. కంపెనీలో ఉద్యోగాల ఖాళీలతోపాటు పూర్తి వివరాలు కిటెక్స్ వస్త్ర పరిశ్రమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ వేసిన బలమైన పునాది ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కేసీఆర్ దార్శనికత, ముందుచూపుతో రూపుదిద్దుకున్న టీఎస్ఐపాస్ ద్వారా రాష్ర్టానికి వచ్చిన ఆ పరిశ్రమలో ఉత్పత్తి మొదలవుతున్నది. ఈ క్రమంలో ఆ సంస్థ ఏకంగా 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది ఆశామాషీ విషయం కాదు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ దార్శనికత, కేటీఆర్ చొరవతో ఉద్యోగావకాశాలు ఏర్పడ్డాయన్నమాట.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికవాడలను ఏర్పాటు చేయడమే కాకుండా పెట్టుబడులను కూడా భారీగా రాబట్టేందుకు ఆనాడు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అప్పటి మంత్రి కేటీఆర్ దేశ, విదేశాలకు చెందిన కంపెనీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ రాష్ర్టానికి సాధ్యమైనన్ని ఎక్కువ కంపెనీలు వచ్చేలా విశేష కృషిచేశారు. పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చారు. దీంతో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వేలాది పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇందులో కిటెక్స్ కంపెనీ ఒకటి. ఇది ప్రపంచంలో అతి పెద్ద దుస్తుల పరిశ్రమల్లో ఒకటి. రోజుకు 35 లక్షల దుస్తుల తయారీ సామర్థ్యం గల ఈ పరిశ్రమ వరంగల్‌తోపాటు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో వరంగల్‌లో ఏర్పాటుచేసిన పరిశ్రమ ఉత్పత్తికి సిద్ధం కావడంతో ఇటీవల ఆ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
కిటెక్స్ సంస్థలో పనిచేసేందుకు వివిధ క్యాటగిరీలకు చెందిన 25 వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, సహాయ మేనేజర్లు, ఇంజినీర్లు (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్), ఇన్చార్జులు, జిన్నింగ్, బ్లీచింగ్, డైయింగ్, ప్రింటింగ్, కటింగ్, ఎంబ్రాయిడరీ, పవర్‌స్టేషన్, ఫైనాన్స్, ఐటీ, సోర్సింగ్, ఎగుమతి, దిగుమతి, హెచ్ఆర్, ఫైర్‌సేఫ్టీ, బాయిలర్, ఎస్టీపీ తదితర విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల్లో 80 శాతం మహిళలే ఉంటారని ఇదివరకే కంపెనీ ప్రకటించింది. ముడి పత్తిని ప్రాసెస్ చేయడం, జిన్నింగ్, స్పిన్నింగ్ నుంచి దుస్తులు తయారయ్యే వరకు అన్నిరకాల ప్రక్రియలు ఇక్కడే జరగడం కిటెక్స్ కంపెనీ ప్రత్యేకత. జిన్నింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, ప్రింటింగ్ తదితర అన్ని పనులూ నిర్వహించే విధంగా అత్యాధునిక పరిశ్రమను ఏర్పాటుచేశారు.
కేటీఆర్‌తో భేటీ అయిన గంటలోనే వరంగల్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కిటెక్స్ కంపెనీ ముందుకొచ్చింది. అనంతరం ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన పత్తి, నైపుణ్యంగల కార్మికులు తదితర అనుకూలతలతో సీతారాంపూర్, వరంగల్‌లో కలిపి రూ.2,400కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత తమ పెట్టుబడిని మరో రూ.600 కోట్లకు పెంచుతూ మొత్తం రూ.3,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం సైతం కిటెక్స్‌కు వారి అవసరాలకు తగ్గట్టుగా వరంగల్‌లో 185, సీతారాంపూర్‌లో 250 ఎకరాలను కేటాయించింది. విద్యుత్తు, నీటి సరఫరాకు ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేయడంతోపాటు రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పించింది.
కొచ్చిలో రూ.3,500 కోట్ల మెగా ప్రాజక్టును స్థాపించేందుకు కిటెక్స్ సంస్థ 2020 జనవరిలో కేరళ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నది. అయితే అక్కడి వామపక్ష సర్కారుతో విభేదాలు రావడంతో పెట్టుబడిని ఇతర రాష్ర్టాలకు తరలిస్తామని 2021 జూలైలో కంపెనీ చైర్మన్ జాకబ్ ప్రకటించారు. దీంతో కర్ణాటక, ఏపీ, తమిళనాడు సహా 10 రాష్ర్టాలు, శ్రీలంక దేశం కూడా కిటెక్స్ కంపెనీకి ఆహ్వానం పలికాయి. ఇదే సమయలో కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని, కంపెనీ చైర్మన్ జాకబ్‌తో మాట్లాడారు. తెలంగాణ పెట్టుబడులకు గమ్యస్థానం ఎందుకో ఆయనకు వివరించి చెప్పారు. స్వయంగా ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడాలని, నచ్చితేనే తదుపరి ముందుకు సాగవచ్చని సూచించారు.
కొవిడ్ ఇబ్బందుల కారణంగా, తెలంగాణ ప్రభుత్వమే ప్రత్యేక విమానాన్ని కొచ్చికి పంపడంతో కిటెక్స్ ఎండీ సాబూ ఎం జాకబ్ సహా వారి బృందాన్ని హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్‌లోని కేఎంటీపీకి తీసుకెళ్లి వారికి భూములను చూపారు. ఆ మరుసటిరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో మరో స్థలాన్ని చూపించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవను, కేసీఆర్ నాయకత్వం, మంత్రి కేటీఆర్ స్నేహపూర్వక వైఖరికి ముగ్దుడైన జాకబ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నారు.