హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఏదో అడ్డిమార్ గుడ్డిదెబ్బలో పేమెంట్ కోటాలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారయని, లేకపోతే ఆయనకు అంత సీన్ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్‌గాంధీకి ఏటీఎంలాగా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పోటీ చేసే అన్ని ఎన్నికలకు డబ్బులు ఇకడి నుంచే పోతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలను ప్రతినెల ఇక్కడ నుంచే రేవంత్‌రెడ్డి పంపిస్తున్నారని, దీనికి కేంద్రంలోని బీజేపీ సర్కారు సహకరిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందని కేంద్ర హోమంత్రి అమిత్ షా చెప్పారని గుర్తుచేశారు.
మరి పట్టుకోవాల్సిన పోలీస్ మంత్రిగా ఉండి అమిత్‌షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బుధవారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ-కార్ రేసు విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎందుకు భయపడతానని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఉన్నది 3 ఫీట్లు కానీ ఏదో 30 ఫీట్లు ఉన్నట్టుగా డైలాగులు కొడతారని ఎద్దేవా చేశారు. అంతకంటే ఎక్కువగా ఊహించుకుంటే అంతకంటే దీటుగా, ఘాటుగా తాము సమాధానం చెప్తామని అన్నారు. రేవంత్‌రెడ్డి పెట్టించే అక్రమ కేసులకు భయపడబోమని స్పష్టంచేశారు.
పరువు తీస్తున్నా అసదుద్దీన్ చెట్టాపట్టాల్
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అగ్రనేత అసదుద్దీన్ ఒవైసీ గతంలో రేవంత్‌రెడ్డిని ఆర్ఎస్ఎస్ అన్న అని సంబోధించారని కేటీఆర్ గుర్తుచేశారు. రెండేండ్లలో ఏమి నచ్చిందో తెలియదుగానీ ఆయనతో కలిసి అసద్ పనిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ బీహార్‌లో ఎంఐఎం పార్టీ బీజేపీ బీ టీమ్ అని అంటున్నారని, జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నదని, ఇదేమి చిత్రమో అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అసదుద్దీన్ పరువు తీస్తున్నా, ఆయన వాళ్లతోనే ఎందుకు కలిసి తిరుగుతున్నారో అర్థంకావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరు అనే భ్రమలో నుంచి రేవంత్‌రెడ్డి బయటకు రావాలని సూచించారు. కాంగ్రెస్ పుట్టకముందు నుంచే ముస్లింలు ఉన్నారని, రేపు కాంగ్రెస్ పార్టీ అంతమై పోయినా, ముస్లింలు ఉంటారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే ముస్లింలు లేరు అనే ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.