అప్పుడప్పుడు కార్పొరేట్ ఉద్యోగమే మంచిదనిపిస్తుంది. రాజకీయ పిచ్చోళ్లతో మాట్లాడేటప్పుడు, ప్రతిపక్షాలు తిడుతున్నప్పుడు.. రాజకీయాల్లోకి ఎందుకొచ్చాం రా దేవుడా అనిపిస్తుంది. అయితే హైదరాబాద్‌లో వచ్చిన మార్పులు, తెచ్చిన ఇన్వెస్ట్మెంట్స్.. ప్రజలతో దగ్గరగా ఉన్నందుకు, సిరిసిల్లలో నేతకార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినందుకు గొప్ప సంతృప్తినిస్తుంది. తెలంగాణ ఇంత గొప్పగా ఎట్ల చేస్తుందని విశ్వవేదికల మీద మమ్మల్ని అడిగినప్పుడు, మేం చెబుతున్నప్పుడు తెలంగాణ బిడ్డగా గర్వంగా సంతోషమనిపిస్తది.
నేను బయటికెళితే మాస్ మీటింగ్స్‌లో మాస్ రాజకీయనాయకుడిని. పారిశ్రామికవేత్తల వద్దకు వెళితే ఇండస్ట్రీ మంత్రిని. ఎస్ఎం కృష్ణలా, చంద్రబాబులా సీఈవో, తొక్కతోటకూర కాదు. నేను సాఫ్ట్‌వేరే కాదు.. హార్డ్‌వేర్‌ని కూడా.
కేసీఆర్ వయసెంత.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల వయసెంత? కేసీఆర్ 70 ఏండ్ల నాయకుడు. తెలంగాణ కోసం 14 ఏండ్లు కష్టపడి 23 ఏండ్లుగా అగ్రగామిగా ఉన్న నాయకుడు. నోటికొచ్చిన బూతులు. ఎట్ల పడితే అట్ల మాట్లాడుడు. కేసీఆర్‌ను ఎంత ఎక్కువ తిడితే అంత గొప్ప అనే ధోరణి మంచిదికాదు. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించడం నేర్చుకోండి. కేసీఆర్ కంటే నాలుగు పనులు ఎక్కువ చేస్తామని చెప్పండి. ప్రజలకు దగ్గరికి వెళదాం. సంస్కారవంతంగా మాట్లాడుదాం. మీరు సంస్కారవంతంగా మాట్లాడితే మేం సంస్కారవంతంగా మాట్లాడుతాం. కాదంటే మీకంటే గొప్పభాష మాకూ వచ్చు.
ప్రజల దగ్గరకు పోయినప్పుడు కాంగ్రెస్‌పార్టీ 50 ఏండ్లు చేసిన దానికి ముక్కునేలకు రాసి క్షమాపణలు కోరండి. గతంలో చావగొట్టినందుకు, తెలంగాణలోని వందల మంది ప్రాణాలు తీసుకునేందుకు కారణమైనందుకు క్షమాపణ చెప్పండి. కరెంట్ ఇవ్వనందుకు, తాగు.. సాగునీరు ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పండి. బీజేపీ 9 ఏండ్లుగా నికృష్ట రాజకీయాలు చేస్తూ తెలంగాణకు మొండిచేయి చూపినందుకు, ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల కూడా ఇవ్వనందుకు, ఐటీఐఆర్ రద్దుచేసినందుకు క్షమాపణలు చెప్పి పాపప్రక్షాళన చేసుకుని తెలంగాణ ప్రజలను వేడుకుని ఓట్లు అడుక్కోండి. కేసీఆర్‌గారిని తిడితే ఓట్లు వస్తాయనే భ్రమలు వదులుకోండి.
-మంత్రి కేటీఆర్
Minister KTR |హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): దేశాన్ని సర్వనాశనం చేసిన రెండు లేకి పార్టీలకు బీ టీంగా ఉండాల్సిన ఖర్మ తమకేంటని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము ఏ పార్టీలకు బీ టీం కాదని, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రగతి నమూనాను కాంక్షిస్తున్న ఇతర రాష్ర్టాల ప్రజలకు ఏ టీమ్ అని స్పష్టంచేశారు. దేశంలో తామిద్దరమే ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ కోరుకొంటున్నాయని, మధ్యలో ఎవరైనా వస్తే బీ టీంగా ముద్ర వేస్తారని విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో సీఎం కేసీఆర్‌పై, బీఆర్ఎస్పై ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణ బలానికి నిదర్శమని పేర్కొన్నారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు బీజేపీ, కాంగ్రెస్ కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేవని ఎద్దేవా చేశారు.
‘మా ముఖ్యమంత్రి కేసీఆర్. మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్. మరి.. కాంగ్రెస్‌లో, బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థో చెప్పండి? కనీసం.. కేసీఆర్ కాలిగోటికి సరిపోయే నాయకుడు ఎవరైనా ఆ పార్టీల్లో ఉన్నారా? మేము తిరస్కరించిన సరుకును నెత్తిన పెట్టుకొని ఊరేగే మీరా మాగురించి మాట్లాడేది?’ అని మండిపడ్డారు. అదానీకి లాభం చేయాలంటే మోదీకి ఓటెయ్యాలని ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించిన 15 మంది ప్రధానుల్లో అత్యంత అసమర్థ, అవినీతిపరుడు, చేతగాని ప్రధాని మోదీ మాత్రమేనని విమర్శించారు. మోదీ కోరుకొనేది కాంగ్రెస్‌ను, రాహుల్ గాంధీనేనని.. కేసీఆర్ వంటి నాయకుడొస్తే తన ఆటలు సాగవని ఆయనకు తెలుసని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అస్థిత్వంలోనే లేదని, ఉండబోదని తెలిపారు. మంత్రి కేటీఆర్ మంగళవారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, తెలంగాణ అభివృద్ధి నమూనా, దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణ తదితర అంశాలపై మాట్లాడారు. కేటీఆర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
నరేంద్రమోదీ మధ్యప్రదేశ్‌లో మా పార్టీ టార్గెట్‌గా మాట్లాడారు. దీన్ని బట్టి మా పార్టీ విస్తరిస్తున్నదని స్పష్టమైంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మాజీ ఎమ్మెల్యేలు, ఒడిశాలో మాజీ సీఎం గిరిధర్ గుమాంగ్ మా పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్‌లోనూ అక్కడి పెద్ద ప్రాంతీయ పార్టీ మా పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నది. ఇవన్నీ మోదీకి తెలుసు. అందుకే మధ్యప్రదేశ్‌లో కేసీఆర్ పేరు ప్రస్తావిస్తూ, అక్కడి ప్రజలకు అప్పీల్ చేస్తున్నారంటే ఇది కచ్చితంగా పెరుగుతున్న మా బలానికి, ప్రాబల్యానికి నిదర్శనం.
పొంగులేటిని, జూపల్లిని మేం వదిలేసుకొంటేనే కాంగ్రెస్‌కు వెళ్లారు. మేం వదిలించుకున్నవాళ్లను తీసుకొని ఏదో సాధించినట్టు చెప్తే ఎలా? టికెట్ అడిగీఅడిగీ మేం ఇవ్వబోమంటేనే వెళ్లారు. టికెట్ ఇచ్చే అవకాశం ఉంటే వారు ఇక్కడే ఉండేవారు. ఎవరికైనా ఫస్ట్ ఛాయిస్ బీఆర్ఎస్. సెకండ్ చాయిస్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఫస్ట్ చాయిస్ అని వెళ్లేవారు ఎవరన్నా ఉన్నారా? పోయేటప్పుడు నాలుగు రాళ్లు వేయాలి కాబట్టి వేసి వెళ్తున్నారు.
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు చెప్పారు! రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్నారు. ఏ రైతు ఆదాయం డబుల్ అయింది? ఒకే ఒక్క రైతు ఆదానీ ఆదాయం మాత్రమే భారీగా పెరిగింది. ఇక 2022 నాటికి దేశంలోని పేదలందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. ఒక్కరికైనా ఇచ్చారా? ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తానన్నారు.. ఇచ్చారా? 2022 నాటికి దేశంలో బుల్లెట్ రైలు పరుగులు పెడుతుందన్నారు.. పెట్టిందా? వీటిని కప్పిపుచ్చుకొనేందుకు లేఖి విమర్శలు, భావదారిద్య్రపు విమర్శలు ఒక ప్రధాని నోటి వెంట రావడం తగదు. నేను ఇలాంటి విమర్శలు చేయలేనా? అదానీకి మాత్రమే మోదీ లాభం చేశారని, అదానీకి భక్తుడని, అదానీకి భాగస్వామి అని, అదానీకి బినామీ అని అనలేమా?
మా ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఐటీ దాడులు జరిగాయి. మా బీఆర్ఎస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతాయి. మరి తెలంగాణలోని ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై ఎందుకు దాడులు జరగడం లేదు? నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌గాంధీని ఈడీ విచారించింది. మరి వీరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ కేసు ఎందుకు ఆగిపోయింది? ఇవన్నీ ఆలోచించకుండా బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని లేనిపోని హడావిడి చేస్తున్నారు.
ఈ దేశంలో ఇద్దరమే ఉండాలి. మరొకరు ఉండకూడదు.. ఇంకో గొంతు వినపడకూడదనేది బీజేపీ, కాంగ్రెస్ సిద్ధాంతం. ఈ దేశంలో మోదీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్‌గాంధీ. రాహుల్‌గాంధీ ఎంత ఎక్కువగా మాట్లాడితే.. జనం అంత ఎక్కువగా బీజేపీకి ఓటు వేస్తారని వాళ్ల ఆశ. ‘రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో బాగుండాలని మేం కోరుకుంటాం. ఆయనే మాకు అతిపెద్ద ఆస్తి. ఆయన ఉన్నంత కాలం మా బీజేపీ సుభిక్షంగా ఉంటుంది. మా మోదీ బాగుంటారు’ అని బీజేపీ నాయకులు చెప్తుంటారు. ఇలాంటి ఒక బలహీన, లొంగిపోయే ప్రతిపక్షం ఉన్నది కాబట్టే ఈ రోజు మోదీ ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతున్నది. మా పార్టీ బలపడటం మోదీకి ఇష్టముండదు. మా పార్టీ మధ్యప్రదేశ్‌లో బలపడినా, మహారాష్ట్రలోకి చొచ్చుకొచ్చినా, ఒడిశా, ఆంధ్రలోకి వెళ్లినా ఆయనకు సహజంగానే నచ్చదు. ఎందుకంటే మోదీ కోరుకొనేది ఎప్పటికైనా కాంగ్రెసే ఉండాలని! కాంగ్రెస్ ఉంటే ఎప్పుడైనా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చు. అదే కేసీఆర్ లాంటి నాయకుడు వస్తే కొరుకుడు పడని కొయ్యగా మారుతారని భయం. ఈ భయం చాలా మంచిది.
తొమ్మిదేండ్లుగా రాష్ర్టానికి బీజేపీ ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఏం చేయరని తెలుసు. అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్టుగా వెళ్లి వచ్చాం. లేదంటే మళ్లీ వీళ్లే విమర్శిస్తారు.. మమ్మల్ని అడిగారా? కనీసం అడుగుతున్నారా? అడక్కుండా అమ్మయినా అన్నం పెడుతుందా? అని అంటారు. అందుకే ఢిల్లీకి వెళ్తున్నాం, అడుగుతున్నాం. ఢిల్లీకి ఎందుకు వెళ్లారని అడుగుతున్నారు. మేము ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ వాళ్లు ఇక్కడికి వచ్చి ‘బీఆర్ఎస్ నేతలు మమ్మల్ని ఏం అడగలేదు. అడగంది ఎలా ఇస్తాం’ అని అంటే మేం దానికి సమాధానం చెప్పుకోవాలి. అక్కడికి వెళ్లి మెట్రో, రోడ్లు, మెగా టెక్స్టైల్ పార్క్‌తోపాటు మాకు రావాల్సిన ఇతర అంశాలపై అడిగాం. వాళ్లను అడుగుతూనే ఉంటాం. మేం అడిగినవి ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. లేదంటే వాళ్ల బట్టలిప్పి నడి బజార్లో ప్రజా క్షేత్రంలో నిలబెడతాం.
అప్పులు జీఎస్డీపీతో ముడిపడి ఉంటాయి. తెలంగాణ జీఎస్డీపీ నేడు రూ.13.27 లక్షల కోట్లు. ఈ నిష్పత్తి ప్రకారం అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి ఐదోస్థానంలో ఉన్నది. కేంద్రం విషయానికొస్తే, 14 మంది ప్రధానులు రూ.56 లక్షల కోట్ల అప్పు చేస్తే.. మోదీ ఒక్కరే రూ.100 లక్షల కోట్లు అప్పులు చేశారు. మేము చేసింది తప్పని నిరూపిస్తే, మాకన్నా మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రం ఉందని చూపెడితే, నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయను. గతంలో తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవ్వనివాళ్లు ఇప్పుడేదో సాధిస్తామంటే నమ్మడానికి జనం పిచ్చివాళ్లు కాదు. తెలంగాణలో కేసీఆర్‌ను దింపేందుకు పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. ప్రజలు మాత్రం కేసీఆర్ అక్కడే ఉండాలంటున్నారు. గత ఎన్నికల్లో 56 నుంచి 88 స్థానాలు గెలిచాం. ఈసారి 95 స్థానాలతో గెలుస్తాం. ఎంఐఎంతో మాకు ఎటువంటి పొత్తూ, లోపాయికారి ఒప్పందం లేదు.
ఈడీ, బోడీ, మోదీ ఏం చేసుకొంటారో చేసుకోండి. కవిత విషయంలో బీజేపీతో ఎటువంటి రాజీ లేదు. నిన్నగాక మొన్న మా పార్టీ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు జరిగాయి. కాంగ్రెస్ నాయకులు మోదీని విమర్శించకుండా బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియాగాంధీపై ఎందుకు ఈడీ విచారణ ఆగింది? ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై కూడా దాడులు జరగలేదు. మేం తప్పు చేసి ఉంటే దేనికైనా సిద్ధం. భయపడేది లేదు.
రేవంత్‌రెడ్డి వ్యభిచారి అని నేను కూడా అంటాను నిరూపించుకుంటారా? ఒక మాట మాట్లాడే ముందు కనీస జ్ఞానం ఉండాలి కదా? నా జీవితంలో సిగరెట్ కూడా తాగలేదు. ఏకంగా డ్రగ్స్ అంటే నేనేం చెప్పాలి? వాడెవడో లేకి వెధవ మాట్లాడితే.. నేను వెళ్లి రుజువు చేసుకోవాలా? వాడొచ్చి బురద జల్లితే.. నేనెళ్లి కడుక్కోవాలా? ఇదేం కుసంస్కారం? కేటీఆర్ మంత్రిగా ఫెయిల్ అయ్యాడని చెప్పండి. ఏ విషయంలోనో ఆధారాలు బయట పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం పొడిస్తే.. మేమేమైనా చెడగొట్టామా? దమ్ముంటే సిద్ధాంతాల మీద మాట్లాడు. విధానాల మీద మాట్లాడు. అవేమీ లేనప్పుడు.. వ్యక్తిత్వ హననం.. చిల్లర మాటలు మాట్లాడుతారు. ఈయన ఒక పార్టీకి అధ్యక్షుడా? ఇది కాంగ్రెస్ చరిత్రకే సిగ్గుచేటు. వీడు థర్డ్‌గ్రేడ్ క్రిమినల్, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి చిప్పకూడు తిన్న దరిద్రుడని నేను అనలేనా? కానీ.. ఇంత నికృష్టమైన రాజకీయాలు అవసరమా? చివరికి నా కొడుకును పట్టుకొని పంది అంటారా? ఇలాంటి నాయకులు సమాజానికి అవసరమా?
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా 26 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లలో 2.21 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో అయినా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలివ్వటం సాధ్యంకాదు. ప్రభుత్వ రంగంలో నియామకాలు చేపడుతూనే.. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాం. రాష్ర్టానికి 47 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆహ్వానించాం. దాదాపు రూ.3.23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఫాక్స్‌కాన్ ద్వారా లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి. గతంలో 3.23 లక్షలున్న ఐటీ ఉద్యోగులు, నేడు 9.05 లక్షలకు పెరిగారు. గుజరాత్లో పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్ష పేపర్లు 13 సార్లు లీక్ అయ్యాయి. అక్కడ మంత్రి, సీఎం రాజీనామా చేశారా? ఐటీ మంత్రికి టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో ఏం సంబంధం? టీఎస్పీఎస్సీ, పదో తరగతి పరీక్ష పేపర్లను బీజేపీ కార్యకర్తలే లీక్ చేశారు. గ్లోబరీనా సంస్థ ఎవరిదో నాకు తెలియదు. దీని గురించి నాపై ఆరోపణలు చేసినవారిపై పరువు నష్టం దావా వేశాం.
హైదరాబాద్ నగర అభివృద్ధిని రజినీకాంత్, లయ లాంటి నటులు ప్రశంసించారు. హైదరాబాద్ నగరం అన్ని వైపులా నాలుగు టిమ్స్‌లు, నిమ్స్‌లో రెండు వేల పడకల దవాఖాన నిర్మాణమవుతున్నాయి. రాష్ట్రంలో తాగునీటి, సాగునీటి సమస్యలు లేవు. ప్రజల సమస్యలపై పోరాడుదామంటే తెలివైన నాయకుడు లేడు. సన్నాసులు నాయకత్వం వహిస్తే ఇలాంటి భావదారిద్య్రమే ఉంటది. గుజరాత్లో ఒక బ్రిడ్జి కూలితే 161 మంది చనిపోయారు. అక్కడ ఎవరు రాజీనామా చేశారు? నయీంను పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ కాదా? నయీంను తుదముట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా! బీఎల్ సంతోష్ అనే బ్రోకర్ స్వామీజీలను పంపించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. దానిని అందరూ చూశారు. కోర్టు ఆదేశంతో సిట్ విచారణ నిలిచింది.
జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిబంధన మేరకే ఓఆర్ఆర్ను లీజుకు ఇచ్చాం. పారదర్శకంగా బిడ్లు పిలిచాం. 31 సంస్థలు ప్రి బిడ్‌లో పాల్గొంటే, ఫైనల్ బిడ్‌కు 13 సంస్థలు ఎంపికయ్యాయి. ఓఆర్ఆర్ లీజును దక్కించుకొన్న ఐఆర్బీ సంస్థ ముంబై- పుణె రోడ్డును నిర్వహిస్తున్నది. లీజు ప్రకారం ఆ సంస్థ 7,380 కోట్లను జూలైలో ప్రభుత్వానికి కట్టబోతున్నది. ఈ మొత్తాన్ని 30 సంవత్సరాల్లో రూ.లక్ష కోట్లు చేయలేమా? తప్పు చేస్తే కోర్టులో ఆధారం చూపించాలి అని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు.
మేం ఏ పార్టీకి తొత్తులం కాదు. ఏ పార్టీకి ‘ఏ’ టీమ్ కాదు.. ‘బీ’టీమ్ కాదు. మేం తెలంగాణ ప్రజల ‘ఏ’ టీమ్. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మేం ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. వాళ్ల ప్రభుత్వంలో చేరామా? వాళ్లతోనో, వీళ్లతోనో కలిసి పోటీ చేశామా? మాది స్వతంత్ర పార్టీ. ఎప్పుడూ ఇదేవిధంగా ఉంటాం. దేశానికి మంచిదనుకొన్నప్పుడు బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాం. అదే సమయంలో బీజేపీ నేతలు ఎప్పుడైన సంస్కారహీనంగా మాట్లాడితే ఖండించాం.
రాష్ర్టాలు, కేంద్రం మధ్య సంబంధాల విషయంలో కలిసి పనిచేశాం. కానీ రాజకీయంగా ఎప్పుడూ ఎవరితోనూ రాజీ పడలేదు. ఆ రెండు పార్టీలే దేశ దుస్థితికి కారణం. వాటి లక్ష్యం ఒక్కటే. ‘దేశంలో ఇద్దరమే ఉండాలి.. ఈ ధ్రువం నేను, ఆ ధ్రువం నువ్వు ఉండాలి. మన చుట్టూ చిన్న పార్టీలు తిరగాలి. స్వతంత్రంగా ఎవరైనా వెళితే బీ టీం అని ముద్ర వేసేయాలి’ అనేదే వాటి విధానం. ఇలాంటి లేకి పార్టీలకు బీ టీంగా ఉండాల్సిన ఖర్మ మాకేంటి? వీడు పోతే వాడు, వాడు పోతే వీడు అన్నట్టుగా ఇంకెవరూ ఉండకూడదంటూ దాడులు చేస్తే చూస్తూ ఉండాలా? మేం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రగతి నమూనాను కాంక్షిస్తున్న ఇతర రాష్ర్టాల ప్రజలకు ఏ టీం.
అదానీకి లాభం చేయాలంటే ప్రధాని మోదీకి ఓటెయ్యండి. నరేంద్రమోదీ పాలనలో ఈ దేశంలో బాగుపడ్డ ఒకే ఒక వ్యక్తి అదానీ. ఆయన మాత్రమే శ్రీమంతుడయ్యారు.. ప్రపంచ కుబేరుడయ్యారు. ఆయనిచ్చిన డబ్బులతో ఈయన ఎమ్మెల్యేలను కొంటారు. పార్టీలను చీల్చుతారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొడతారు. ఇదంతా తెలియంది ఎవరికీ? వారికి తెలిసిన విద్య ఒక్కటే.. ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు. ఈ దేశాన్ని పాలించిన 15 మంది ప్రధానుల్లో అత్యంత అసమర్థుడు, అత్యంత అవినీతిపరుడు, అత్యంత చేతగాని ప్రధాని నరేంద్రమోదీనే.
ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని కట్టిన మగాడు, మొనగాడు సీఎం కేసీఆర్. నీటి పారుదల ప్రాజెక్టులకు ఒక్క రూపాయి సాయం చేయని సన్నాసి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నది కేసీఆర్. వలసలు పోయిన పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జూలై, ఆగస్టులో నీళ్లు ఇవ్వబోతున్నాం. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టింది కేసీఆర్. 1.10 లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం. ఇంటింటికీ తాగునీటిని అందించిన మొట్టమొదటి మొనగాడు కేసీఆర్ కాదా? బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇంటింటికీ తాగునీరు ఇచ్చారా? దీనిపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలంగాణను ప్రశంసించారు. తెలంగాణలో రూ.1.14 లక్షల నుంచి రూ.3.17 లక్షలకు తలసరి ఆదాయం పెరిగింది. జీఎస్డీపీ రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.13 లక్షల కోట్లకు పెరిగింది. దేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. ఇది గర్వకారణం కాదా?
తెలంగాణకన్నా మెరుగైన ఫలితాలు సాధించిన ఒక్క రాష్ట్రం కూడా దేశంలో లేదు. తాగునీరు, కరెంటు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఐటీ తదితర రంగాల్లో రాష్ట్రం దూసుకుపోతున్నది. రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్ల నుంచి రూ.2.41 లక్షల కోట్లకు పెరిగాయి. గత కాంగ్రెస్, టీడీపీ హయాంలో 27 ఏండ్లలో సాధించిన ప్రగతి, తెలంగాణ రాష్ట్రం ఒక్క సంవత్సరంలోనే సాధించింది. తొమ్మిదేండ్లలో సమగ్ర, సమతుల్య, సమ్మిళిత అభివృద్ధి సాధించింది. అభివృద్ధి, సంక్షేమం, ఐటీ, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది. దేశ జనాభాలో రెండున్నర శాతం ఉన్న తెలంగాణ, జీడీపీలో ఐదు శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్నది. రాష్ట్రంలో తలసరి ఆదాయం 2014లో రూ.1.14 లక్షలు ఉండగా, నేడు రూ.3.17లక్షలకు పెరిగింది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ. ఎన్నికల్లో ఇవే మా ఎజెండా.
ఇతర పార్టీలను గెలిపించి ఢిల్లీ చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఈ రాష్ర్టానికి అవసరమా? మళ్లీ కేసీఆరే మా ముఖ్యమంత్రి. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మాకు ఆ స్పష్టత ఉన్నది. అసలు బలమే లేని కాంగ్రెస్‌ను బలహీనపర్చే ప్రశ్నే తలెత్తదు. కాంగ్రెస్ పార్టీ క్రితంసారి చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తెచ్చుకొని, ఎవరెవరితోనో పొత్తులు పెట్టుకొని పోటీచేస్తే వచ్చినవి 19 సీట్లు. ఈసారి పది సీట్లు వస్తాయేమో. కర్ణాటకలో బీజేపీని ఓడించాలని మూడేండ్ల క్రితమే ప్రజలు నిర్ణయానికొచ్చారు. అక్కడ కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాబట్టి ఆ పార్టీకి ఓట్లు వేశారు. ఇక్కడ ప్రో ఇంక్యుబెన్సీ ఉన్నది. ప్రజలు, రైతులు ఇప్పటికే మళ్లీ బీఆర్ఎస్ను అధికారంలోకి తేవాలని నిర్ణయించుకొన్నారు.
బీజేపీ అనే పార్టీ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పాలపొంగులా పొరపాటున ఓ ఎన్నికల్లో గెలువగానే… వాపును చూసి బలుపు అనుకొని రెచ్చిపోయారు. గత ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో 119 స్థానాలకు గానూ 108 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఈసారి కూడా 102 – 103 స్థానాల్లో డిపాజిట్ పోతుంది. కాబట్టి ఆ పార్టీ మాకు ఏ రకంగానూ ప్రత్యర్థి కాదు. బీఆర్ఎస్కు దగ్గర్లో కూడా లేదు. కేంద్ర, రాష్ట్ర నాయకులు మా ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా విమర్శిస్తే.. అందుకు తగ్గట్టుగానే మేం సమాధానం చెప్పినం. బీజేపీకి రాష్ట్రంలో గతంలోనూ అస్తిత్వం లేదు.. ఇకపై కూడా ఉండబోదు.
కుటుంబ పాలనపై కాంగ్రెస్, బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉన్నది. వేరే ఏ అంశమూ దొరక్క.. తొమ్మిదేండ్లుగా ఒకే ఆరోపణ చేస్తున్నారు. నేను 16 ఏండ్లుగా ప్రజా జీవితంలో ఉన్నాను. నాలుగు ఎన్నికల్లో కొట్లాడాను. వరుసగా ప్రతిసారి మెజారిటీని పెంచుకుంటూ వచ్చాను. మొదటి ఎన్నికల్లో 171 ఓట్ల మెజారిటీతో గెలిస్తే.. గతసారి సుమారు 90 వేల మెజారిటీతో గెలిచాను. ప్రజలకు ఉపయోగపడే వాడిని కాబట్టే కదా నాపై ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. నేను నిజంగానే అసమర్థుడినైతే, బలవంతంగా కేసీఆర్ నన్ను రుద్దితే, నన్ను సిరిసిల్ల ప్రజలు చెత్తబుట్టలో పడేసేవాళ్లు కదా? మరి ఎందుకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతున్నది? ఇందిరాగాంధీని, ఎన్టీఆర్‌ను ఓడించిన దేశం ఇది. వాళ్లకంటే పెద్దవాడినైతే కాదు కదా? మమ్మల్ని విమర్శిస్తున్నది కాంగ్రెస్, బీజేపీ. జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ.. ఆమె కొడుకు రాజీవ్‌గాంధీ.. ఆయన భార్య సోనియాగాంధీ.. వారి సుపుత్రుడు రాహుల్‌గాంధీ అధినేతగా ఉన్న, వాళ్ల చెల్లి ప్రియాంక గాంధీ జనరల్ సెక్రటరీగా ఉన్నపార్టీ మాపై కుటుంబ పాలన అని మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూమి ధరలు భారీగా పెరిగిపోయాయి. రూ.500 కోసం హత్యలు జరిగే రోజులు ఇవి. అలాంటిది ఒకరి భూమి మరొకరి పేరుతో పట్టాల్లో ఎక్కితే ఊరుకుంటారా? గతంలో రికార్డుల్లో కొన్ని అవకతవకలు జరిగాయి. అందులో కొన్ని ధరణిలోకి ఎక్కడం లేదనే ఆవేదన కొంత ఉన్నది. అయితే.. దశలవారీగా అన్నీ పరిష్కారమవుతాయి. కొత్తగా ఒకటి తీసుకొచ్చినప్పుడు చిన్నచిన్న తప్పులు జరిగితే జరగొచ్చు. అన్నీ కుదుట పడతాయి. ధరణిలో ఇప్పటివరకు సుమారు కోటి లావాదేవీలు జరిగాయి. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండానే ఒకేరోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగి పోతున్నాయి. ఇదేనా అవినీతి అంటే? కోర్టుల్లో ఉన్నవి మాత్రం పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు క్లియరెన్స్ ఇచ్చిన వెంటనే అవన్నీ పరిష్కారమవుతాయి. రేవంత్‌రెడ్డి మతిలేని మాటలు తప్ప.. ఒక్క బాధిత రైతైనా వచ్చి నా దగ్గర ధరణి పేరుతో లంచం తీసుకున్నారని చెప్పారా? ఒకసారి ధరణిలోకి ఎక్కితే పట్టా రైతు లేకుండా.. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ అయినా ఎడిట్ చేయలేరు. భూ కబ్జాలు, దందాలు చేసేవాళ్లకే ధరణితో నష్టం జరుగుతున్నది. ఈ గగ్గోలు అంతా వారిదే. కాంగ్రెస్, బీజేపీ నేతలంతా ధరణితో లాభం పొందిన వాళ్లే. ధరణిని తీసేస్తాం.. కేసీఆర్‌ను దించేస్తాం.. వంటి చిల్లర మాటలు కాకుండా ప్రజలకు ఏం చేస్తారో చెబితే బాగుంటుంది. ప్రజలకు పంచడమే లక్ష్యం కావాలి కానీ.. కేసీఆర్‌ను దించడమే లక్ష్యమేంటి? ఇదెక్కడి దౌర్భాగ్యపు విధానం?
2014, 2018లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 111 జీవోను రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో వాగ్దానం చేశాయి. దానినే మేము అమలుచేశాం. దానికెందుకు ఇంత రాద్ధాంతం? కేసీఆర్ 111 జీవో ఎత్తివేస్తే 100 కొబ్బరికాయలు కొడతానని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పింది నిజం కాదా? 111 జీవో కింద రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, రాజగోపాల్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి.. ఇలా అందరికీ భూములున్నాయి. ధరణిలో వివరాలన్నీ ఉంటాయి. కావాలంటే లెక్కలు తీయండి. ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయో తెలిసిపోతుంది కదా? గొంతు పెంచి అరిస్తే సరిపోదు. ఆధారాలు ఉంటే చూపించండి.
గోడలకు సున్నాలు వేసుకొని బతికిన వ్యక్తి, డబ్బులతో దొరికిపోయిన దొంగ రేవంత్‌రెడ్డి. ఆయనకు జూబ్లీహిల్స్‌లో నాలుగు ప్లాట్లు, రెండు ఇండ్లు, ఖరీదైన కార్లు ఉంటే ఆయనపై ఎందుకు ఈడీ దాడులు చేయదు? రేవంత్‌రెడ్డే ఒకప్పుడు కాంగ్రెస్ గురించి అద్భుతంగా అనర్గళంగా చెప్పారు. ఏ టూ జడ్ కాంగ్రెస్ స్కాములు, కుంభకోణాలు అని చెప్పారు. ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్వెల్త్ అని.. కాంగ్రెస్ కాదు అది ‘స్కాం’గ్రెస్ అని విమర్శించారు. ఇవాళ వాళ్లు వచ్చి అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నది. రూ.50 లక్షల నోట్ల కట్టలతో టీవీ కెమెరాల ముందు ప్రపంచమంతా చూస్తుండగా దొరికిపోయిన ఒక దొంగ, థర్డ్‌గ్రేడ్ ఫెలో, ఛీటర్‌ను పీసీసీ ప్రెసిడెంట్‌గా పెట్టుకొని నీతి గురించి మాట్లాడితే నికృష్టంగా, దరిద్రంగా ఉన్నది.
రేవంత్‌రెడ్డి పొద్దున లేస్తే.. కేసీఆర్ లక్షకోట్ల కుంభకోణం అంటున్నారు కదా? అసలు కామన్సెన్స్ ఉన్నదా? మెదడు మోకాళ్లలోకి జారిపోయి.. ఏది చూసినా స్కామ్‌లాగే కనిపిస్తున్నదా? అటువంటి దగుల్బాజీ చేసిన ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుంటామా? ప్రతి ప్రాజెక్టులో 30 శాతం కమీషన్ తీసుకున్నామా? దమ్ముంటే నిరూపించమనండి? రాహుల్‌గాంధీ ప్రతి ప్రాజెక్టులో 100 శాతం కమీషన్ తీసుకుంటాడని నేనూ ఆరోపిస్తా.. సరిపోతుందా? రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాత్ అన్నీ కమీషన్లే తింటున్నాడు అంటాను సరిపోతుందా? దేశంలో న్యాయస్థానాలు ఉన్నాయి. వెళ్లి ఆశ్రయించొచ్చు? సీబీఐ, ఐటీ, ఈడీ.. వేట కుక్కలన్నీ మాపై పడుతూనే ఉన్నాయి కదా? కొండను తవ్వి ఎలుకనైనా పట్టారా? కాంగ్రెస్ నోట్లో ఉన్నది అవినీతి. కాంగ్రెస్ శరీరంలోనే అణువణువునా ఉన్నది అవినీతి. తెలంగాణలో అమరులు చనిపోయింది కాంగ్రెస్ వల్లేనని.. సోనియాగాంధీ పొలిదేవత కాదు. బలిదేవత అని చెప్పింది రేవంత్‌రెడ్డి కాదా? ఇవాళ ఆయనొచ్చి సోనియమ్మ దేవత అని చెబితే ఎవరు నమ్ముతారు?
రైతుబంధు ద్వారా రూ.73 వేల కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేసిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా? మేం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశాం. బీఆర్ఎస్ను కాదని సాగునీరు ఇవ్వకుండా చావగొట్టిన రాబందు కాంగ్రెస్‌ను ప్రజలు నెత్తిన పెట్టుకుంటారా? కరెంటు అడిగితే కాల్చి చంపింది తెలుగుదేశం ప్రభుత్వం. రైతులు మళ్లీ ఇటువంటి తప్పు చేయరని అనుకుంటున్నా. జేబులో ఉన్న వంద రూపాయలనోటును పారేసి చిల్లర నాణాలు ఏరుకొంటారా? 12 లక్షల మంది ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన కేసీఆర్‌ను కాదనుకుంటారా? 13 లక్షలమందికి కేసీఆర్ కిట్లు ఇచ్చాం. సర్కారు దవాఖానల్లో అద్భుతమైన సౌకర్యాలు కల్పించిన కేసీఆర్‌ను కాదనుకుంటారా? 2014లో రాష్ట్రంలో 3.23 లక్షల ఐటీ ఉద్యోగాలుంటే, నేడు 9.05 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదనుకొంటుందా తెలంగాణ యువత? 67 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కలిపి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, కేసీఆర్ తొమ్మిదేండ్లలో 33 మెడికల్ కాలేజీలు పెట్టారు. వెయ్యిన్నొక్క గురుకుల పాఠశాలలు ఉన్న రాష్ట్రం ఇంకోటి ఉన్నదా? 6 లక్షలమంది విద్యార్థులకు ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షలు ఖర్చుచేస్తున్న రాష్ట్రం మరొకటి ఉన్నదా? ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. వాళ్లు బీఆర్ఎస్ను వదులుకొంటారా? ఏ విషయంలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదులుకుంటారు?