హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకోవాలని, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించి చెప్పాలని పిలుపునిచ్చారు. పాలిచ్చే బర్రెను పకనపెట్టి ఎగిరితన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు అయిందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న అంతులేని వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని, అభ్యర్థితో సంబంధం లేకుండా కారు గుర్తుకు ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యపరిస్తే స్థానిక ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలోని అన్ని మండలాలు, జిల్లా పరిషత్ స్థానం బీఆర్ఎస్దే అవుతుందని ధీమా వ్యక్తంచేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో మీపై కేసులు పెడుతున్న పోలీసులే ఎన్నికల తర్వాత పైరవీల కోసం మీ ఇంటి వద్ద క్యూ కడతారని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా గెలిస్తే ఏ అధికారీ వేధించడని తెలిపారు. తెలంగాణభవన్‌లో బుధవారం వికారాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, మునుగోడు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎకువఅన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి లొల్లి ఎకువ చేస్తున్నారని, రెండు, రెండున్నరేండ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, నిబ్బరంగా ఉండాలని సూచించారు.
కేసీఆర్ నాయకత్వంలో ఒక తపస్సులాగా తెలంగాణలోని సబ్బండవర్ణాల సంక్షేమం కోసం ప్రభుత్వంలో పనిచేశామని, ప్రజల కోసం పనిచేస్తూ పార్టీ నాయకులను కొంత పట్టించుకోలేదని పేర్కొన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలు, నాయకులను కండ్లల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. వికారాబాద్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన జిల్లాను ఏర్పాటుచేసి కూడా సరిగా చెప్పుకోలేపోయామని అన్నారు. వికారాబాద్‌కు మెడికల్, నర్సింగ్ కాలేజ్ వస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదని, కానీ కేసీఆర్ దానిని సాకారం చేశారని చెప్పారు. తొమ్మిదేండ్లలో 6.5 లక్షల రేషన్‌కార్డులను అర్హులకు ఇచ్చామని వివరించారు.
రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారు. బాలొండ పోలీస్‌స్టేషన్‌లోనే కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టడం సిగ్గుచేటు. రాష్ట్రాన్ని ఎవరు నడుపుతున్నారు… గుండాలా? కాంగ్రెస్ కార్యకర్తలా? మలాజిగిరిలో గూండాలు రోడ్డు మీద షో చేస్తే పోలీసులు ఏమీ చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేస్తే అధికారులు అందరూ సెట్‌రైట్ అవుతారు.
-కేటీఆర్
ఆరు గ్యారెంటీల పేరుతో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ తెలంగాణ ప్రజలను దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ విమర్శించారు. రూ.2000 పింఛన్ రూ.4000 చేస్తానన్న రేవంత్‌రెడ్డి.. 20 నెలల్లో వృద్ధులకు రూ.40 వేలు బాకీ పడ్డారని విమర్శించారు. ఆడపిల్లలకు ఐదు లక్షల భరోసా కార్డు, సూటీలు, నెలకు రూ.2,500 ఇస్తానని ఏమీ చేయలేదని, ప్రతీ ఆడబిడ్డకు రేవంత్ సర్కార్ రూ.50 వేల బాకీ ఉన్నదని దుయ్యబట్టారు. తెలంగాణలోని ప్రతి వర్గం కాంగ్రెస్ చేతిలో మోసపోయిందని విమర్శించారు. 11 సార్లు రైతుబంధు వేసి ఏనాడూ కేసీఆర్ దానిని రాజకీయం చేయలేదని, అన్నదాతలకు న్యాయం చేశామనే అనుకున్నారని చెప్పారు. కానీ, నాట్ల వేసేటప్పుడు ఇవ్వకుండా ఓట్లు వేసే సమయంలో రేవంత్‌రెడ్డి రైతుభరోసా వేస్తున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఒక్కసారి మాత్రమే రైతుభరోసా వేసి పండుగ చేసుకోండి అన్నట్టుగా రేవంత్ చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్‌రెడ్డి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. పాలన చేతగాక, సమర్థత లేక, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం చేతకాని దద్దమ్మ.. హామీలను అమలుచేయలేక కేసీఆర్‌ను నిందిస్తున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కరోనా సమయంలో కూడా పెన్షన్, రైతుబంధు, కల్యాణలక్ష్మి , కేసీఆర్ కిట్, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కేసీఆర్ సమయానికి ఇచ్చారని గుర్తుచేశారు. ఎంత కష్టం, ఇబ్బంది ఉన్నా బయటికి కనిపించకుండా ఒక తండ్రి లాగా రాష్ట్ర ప్రజలను కేసీఆర్ కంటికిరెప్పలా కాపాడుకున్నారని చెప్పారు.
చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గుర్రం విలువ తెలియాలంటే గాడిదలను చూడాలని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరు గుర్రాలో, ఎవరు గాడిదలో ప్రజలకు అర్థం అయిందని చెప్పారు. కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మాజీ ఎంపీ రావుల, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, నాయకులు శుభప్రద్ పటేల్, అనిల్ పాల్గొన్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రీ ఫైనల్ లాంటివి. ప్రతిష్ఠాత్మకంగా తీసుకోండి. మా కోసం కష్టపడ్డ క్యాడర్‌ను మేం గెలిపించుకుంటాం. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ ఒకటై పనిచేసి గెలిపించుకోవాలి. ఇంటింటికీ తిరిగి ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను వివరించి చెప్పాలి.
-కేటీఆర్
కాంగ్రెస్ మోసాల నుంచి తెలంగాణ ప్రజలను మనమే కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గానికి వస్తానని, బహిరంగ సభ నిర్వహించుకుందామని చెప్పారు. తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన టీపీసీసీ సభ్యుడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ అర్షద్ హుస్సేన్, కౌటాల మాజీ ఎంపీపీ బుసారర్ విశ్వనాథ్, మాజీ ఎంపీటీసీ బసారర్ అశోక్, తాటినగర్ మాజీ సర్పంచ్ రత్నం సోమయ్య, బెజ్జూర్ మండలం నుంచి బారే కుల సంఘం నాయకులు కావుడె నందయ్య, ముదిరాజ్ సంఘం నాయకులు పాకాల భిక్షం, గుమ్మల బాలయ్య, ఆదివాసీ నాయకులు ఎన శ్రీహరి, కాంగ్రెస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం జరుగాలంటే బీఆర్ఎస్ గెలవాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు నక మనోహర్, నవీన్, ముస్తాఫిజ్, షాకిర్, బండు పటేల్ తదితరులు పాల్గొన్నారు.