హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ పార్టీల మ్యానిఫెస్టోలు చిత్తుకాగితంతో సమానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. అడ్డదారిలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పేవన్నీ మాయమాటలేనని సీఎం రేవంత్రెడ్డి మరోసారి నిరూపించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితమని మభ్యపెట్టి, గద్దెనెకగానే నాలుగున్నర లక్షల మంది నుంచి రూ.1,400 కోట్లను వసూలు చేశారని దుయ్యబట్టారు. మరో రూ.15,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఖజానా నింపుకొనేందుకు గడుపు పెంచారని ఆరోపించారు. నాడు ఉచిత ఎల్ఆర్ఎస్ అని హామీ ఇచ్చి నేడు జనం జేబులు ఖాళీ చేస్తున్న కాంగ్రెస్ సరారు మాట తప్పినందుకు ప్రజలకు రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.