హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావుపై ముషీరాబాద్, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల్లో పోలీసులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాల్లేకుండానే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారంటూ కేటీఆర్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు.
కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి వసూలు చేసిన రూ.2,500 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పంపారంటూ 2024, మార్చి 27న కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీ శ్రీనివాసరావు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసును కొట్టేయాలని కేటీఆర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదించారు. విచారణ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. ఈ కేసు విచారణ మార్చి 18కి వాయిదా పడింది.
ఎన్నికల ప్రచార ర్యాలీలో భాగం గా 2023, నవంబర్ 27న పటాకులు కాల్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారంటూ అప్పటి ముషీరాబాద్ ఏఎస్ఐ ఆర్ ప్రేమ్‌కుమార్ ఫిర్యాదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది తెలిపారు. ప్రజలు ఫిర్యాదు చేయలేదని, పోలీసులే ఫిర్యాదు చేశారని, సాక్షులు కూడా పోలీసులేనని అన్నారు.
ర్యాలీకి ముందస్తు అనుమతి తీసుకున్నారని, టపాసులతో ఇబ్బందులు పడినట్టు ఎవరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. కేసు విచారణ ప్రక్రియను నిలిపివేయాలని, కేసును కొట్టేయాలని కోరారు. పిటిషన్ దాఖలు చేసిన వారిలో కేటీఆర్‌తో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా ఉన్నారు. తదుపరి విచారణ మార్చి 12కు వాయిదా పడింది.