నువ్వు కొడంగల్‌లో రాజీనామా చెయ్.. నేను సిరిసిల్లలో రాజీనామా చేస్తా.. ఇద్దరం తేల్చుకుందాం.. పదవికి రాజీనామా చేసి కొడంగల్ నుంచి తిరిగి గెలిచే సత్తా ఉన్నదా? ఏడాది పాలన బాగున్నదని అనుకుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో దమ్ముంటే రాజీనామా చేయించు.. ఉప ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారో తేల్చుకుందాం.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఇద్దరం రాజీనామా చేద్దామా? ఎవరిపై ప్రజావ్యతిరేకత ఉన్నదో తేల్చుకుందామా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు సవాల్ విసిరారు. ఏడాదిలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజలతో తిట్లు పడుతున్నారని వివరించారు. అదానీ, అల్లుడు, సోదరులు, బావమరిది బాగు కోసమే రేవంత్‌రెడ్డి తపన పడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. తెలంగాణతల్లి విగ్రహం రూపురేఖలు మార్చడంపై ఘాటుగా స్పందించారు. ‘ఆలిని మార్చినవారిని చూశాం కానీ, తల్లిని మార్చినవారిని ఇప్పుడే చూస్తున్నాం. తల్లిని పేదరాలిగా చూడాలని కోరుకునే దిక్కుమాలిన సంస్కృతి కాంగ్రెస్ నేతలది. భరతమాత, తెలుగుతల్లి, కన్నడమాత.. రాచరిక పోకడలకు నిదర్శనమా? వాళ్లు పెడుతున్నది కాంగ్రెస్ తల్లిని. ఢిల్లీ తల్లిని. 70 ఏండ్ల కిందనే తెలంగాణతల్లి గురించి కవులు రావెల వెంకటరామారావు, దాశరథి కవితలు రాశారు. ఉద్యమం నుంచి పుట్టింది తెలంగాణతల్లి రూపం. ధనిక రాష్ట్రంలో తెలంగాణ తల్లిని పేదరాలుగా ఉండాలని అనుకోవడం మూర్ఖత్వం. సెంటిమెంట్‌ను మేం తీసుకురావట్లేదు. ప్రతి పౌరుడిలో తెలంగాణ సెంటిమెంట్ ఎప్పటికీ ఉంటుంది.
కాంగ్రెస్ తల్లి విగ్రహం పెడితే వెళ్లే సమయం లేదు. పోవాల్సిన అవసరం లేదు. మేడ్చల్‌లో తెలంగాణతల్లిని ఆవిష్కరిస్తున్నాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులను ఎదుర్కోవడానికి కేసీఆర్ అంతటి గొప్ప నాయకులు అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి తాము చాలని చెప్పారు. కేసీఆర్ స్థాయికి కాంగ్రెస్ నేతలు సరితూగరని అన్నారు. రేవంత్ బూతులు వినడానికి అసెంబ్లీకి కేసీఆర్ రావాల్నా? రేవంత్ నీచమైన భాష మాట్లాడుతున్నంత వరకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అవమానపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కేసీఆర్ ఎవరికీ భయపడేవారు కాదని, అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంధించే ప్రశ్నలకే సమాధానాలు వెతుక్కుంటున్నారని, ఇక కేసీఆర్‌కు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. కేసీఆర్ బయటకు రాకున్నా ఆయన మార్గదర్శనం ప్రకారమే పనిచేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మౌనంగా ఉండటం వెనుక వ్యూహం ఉన్నదని, అన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పారు. 60 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీ తమదని, కేసీఆర్ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని చెప్పారు. ‘ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను తిడితే చూస్తూ ఊరుకోబోము. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా రేవంత్‌రెడ్డికి ఆయన భాషలోనే బుద్ధి చెప్తున్నాం. రేవంత్‌రెడ్డి మాటలు వినలేక ప్రజలు టీవీలు బందుపెడుతున్నరు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మూటల వేట కోసమే మూసీ ప్రక్షాళన
మూసీ సుందరీకరణకు టెండర్లు పిలవకుండా, డీపీఆర్ లేకుండా ఇండ్లు కూల్చడం ఏమిటి? ఇది డబ్బు మూటల వేట కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. హామీల అమలుకు డబ్బులు లేనప్పుడు మూసీకి లక్షన్నర కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి. హామీల అమలుపై వాట్సాప్‌లో స్టేటస్లు, సోషల్‌మీడియాలో ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టులు పెడితే.. కాంగ్రెస్ వాళ్లు, పోలీసులు బెదిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు పోలీసులు, అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ బావమరిదికి అమృతం, అల్లుడికి లగచర్ల, అనుముల బ్రదర్స్‌కు ఫోర్త్‌సిటీ అప్పగించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీని లిఫ్ట్ దగ్గర కలవలేదు.. ఢిల్లీలో లిఫ్ట్ కోసం కలిశారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్ జరిగి మూడు నెలలు గడిచినా ఎందుకు తేలలేదు. రేవంత్‌కు రక్షణ కవచంగా పనిచేస్తున్న బండి సంజయ్.. పెనవేసుకున్న అనుబంధంతో పనిచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసిమెలిసి పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి నేర్చుకున్న పోరాట పటిమ ఉన్నది కాబట్టి ఈటల రాజేందర్ ప్రజల పక్షాన పోరాడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు కలిసి భూములు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తొందరలోనే అన్నీ బయటపెడతాం’ అపి తేల్చి చెప్పారు.
ప్రజల కోసం జైలుకైనా సిద్ధమే
తనపై ఏదో ఒక కేసు పెట్టి జైలుకు పంపి మూడు నాలుగు నెలలు ఉంచాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. తనపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా తగ్గేది లేదని, ప్రజల కోసం వంద సార్లయినా జైలుకు వెళ్లాడానికి సిద్ధమని పునరుద్ఘాటించారు. ‘ఆత్మవిశ్వాసంతో బతకడాన్ని అహంకారం అంటే ఏమీ చేయలేం. ఎవరేమి అనుకున్నా తగ్గను. తప్పు చేయనప్పుడు ఎందుకు తగ్గాలి? అబద్ధాలకు అంగీలాగు తొడిగితే ఎనుముల రేవంత్‌రెడ్డి. తెలంగాణ అస్థిత్వాన్ని మార్చాలని చూస్తే సహించం. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం. గత పదేండ్లలో మేం కక్ష సాధింపులకు పాల్పడితే కాంగ్రెస్ లీడర్లు ఒక్కరు కూడా బయట తిరిగేవాళ్లు కాదు. కక్ష సాధింపు చర్యలు మానుకుని పాలనపై దృష్టి పెట్టాలి’ అని కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.