హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలుచేస్తామని చెప్పి వెయ్యి రోజులవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వినూత్న నిరసనలకు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం శనివారం పలు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అన్ని వర్గాలను నట్టేట ముంచిందని మండిపడ్డారు. ప్రతి ఇంటికీ బాకీ కార్డుల పంపిణీ, నియోజకవర్గాల్లో ధర్నాలు, రైతు సదస్సులు, విద్యార్థుల ర్యాలీలతో కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

పలు నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో పార్టీ నేతలు హాజరై శ్రేణులతో మాట్లాడారు. జనగామ జిల్లాలోని పలు మండలాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాజీ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లోనే నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్తు, పుషలంగా సాగునీరు పొందిన తెలంగాణ నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ చీకట్లోకి జారుకున్నదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఒక ప్రాజెక్టు కానీ, మౌలిక వసతుల కల్పన కానీ జరుగలేదని, కేవలం పాత పథకాలకు పేర్లు మారుస్తూ కాలయాపన చేస్తున్నారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలపై విడుదల చేసే చార్జ్‌షీట్ ద్వారా ప్రజలకు నిజాలు వివరిస్తామని చిట్‌చాట్‌లో తెలిపారు. రూ.12వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల, విద్యాసంస్థల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నదని చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపల్లిలో జరిగిన సమావేశంలో సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సెప్టెంబర్ 5న విద్యార్థులు, యువతతో కలిసి చేపట్టే భారీ ర్యాలీల్లో కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతామని స్పష్టంచేశారు.
గౌడ, యాదవ, ముదిరాజ్, ఇతర చేతివృత్తుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పకనబెట్టిందని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో అందిన సంక్షేమ ఫలాలు నేడు బంద్ అయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వంద రోజుల్లోనే వ్యవసాయాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టిందని నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విత్తనాలు, యూరియా కొరత నుంచి పంటల కొనుగోలు వరకూ ప్రతి దశలోనూ రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రజల ముందుకు తీసుకెళ్తామని స్పష్టంచేశారు.
ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పేరిట ఆర్భాటం చేసిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమాన్ని విస్మరించిందని గంగుల కమలాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఎండగడుతామని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, పింఛన్‌దారులకు పింఛన్లు పెంచుతామని చెప్పడమే కాకుండా, పాత పథకాలను అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సెప్టెంబర్ 2 ప్రతి ఇంటికీ బాకీ కార్డులు అందించి, కాంగ్రెస్ చెల్లించాల్సిన బకాయిలపై ప్రజలను చైతన్యపరుస్తామని వెల్లడించారు.

తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట భారీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దళితబంధు పథకాన్ని నిలిపివేసి దళితుల నోట్లో మట్టి కొట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అబద్ధపు హామీల రంగును బయటపెడతామని హెచ్చరించారు. జగిత్యాలలో జరిగిన సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, 1000 రోజులు గడుస్తున్నా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, గుండుసున్నా పెట్టిందని విమర్శించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వేర్వేరుగా జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశాలు ఏర్పాటుచేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడలో చల్మెడ లక్ష్మీనర్సింహారావు, మంథనిలో పుట్ట మధుకర్, మానకొండూర్ నియోజకవర్గంలోని సదాశివపల్లిలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సన్నద్ధం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్, ఒక రూపాయి కూడా ఇవ్వలేదని సంగారెడ్డి సమావేశంలో సునీతాలక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు.
విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ ను కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతుల కొరత, రోడ్ల దుస్థితి, తాగునీటి ఎద్దడి, శాంతిభద్రతల క్షీణతతో అస్తవ్యస్తంగా మార్చిందని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విమర్శించారు. సెప్టెంబర్ 6న నిర్వహించే నిరసనలతో హైదరాబాద్ ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. సెప్టెంబర్ 2న ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, బాకీ కార్డుల పంపిణీ, 420 ఫీట్ల బ్యానర్ ప్రదర్శించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.
సెప్టెంబర్ 1న తెలంగాణ భవన్లో ప్రభుత్వంపై బీఆర్ఎస్ చార్జ్‌షీట్ విడుదల చేయనుండగా, 2న ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ కార్యక్రమాలు, బాకీ కార్డుల పంపిణీ, 3న వ్యవసాయ సమస్యలపై రైతు సదస్సులు, హైదరాబాద్‌లో 22 డివిజన్ల సమస్యలపై నిరసనలు చేపట్టనున్నారు. 4న మహిళలు, దివ్యాంగులతో సదస్సులు, 5న విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీలు, 6న హైదరాబాద్‌తోపాటు గ్రామాల్లో ప్రజా సమస్యలపై ర్యాలీలు చేపట్టనున్నారు. 7న కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ప్రజావాణిలో వినతిపత్రాలు, 8న వారం రోజుల పోరాటంపై విలేకరుల సమావేశాలు నిర్వహించి అంబేదర్ విగ్రహాలకు నివాళులర్పించనున్నారు.