హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ, ఇండస్ట్రియల్ మాజీ మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయస్థాయిలో అరుదైన గౌరవం లభించింది. మరో ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ ఈవెంట్‌కు శనివారం ఆహ్వానం అందింది. 2026 జనవరి 9 నుంచి 11 వరకు దుబాయ్‌లో జరిగే రెండో ‘అంతర్జాతీయ జునికార్న్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్’లో పాల్గొనాలని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ (ఐఎస్ఎఫ్) బాధ్యులు కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ రంగాల్లో కేటీఆర్ చేసిన కృషిని గుర్తించి సమ్మిట్‌లో పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, సాగు, గ్రామీణాభివృద్ధి, మహి ళా సాధికారత వంటి రంగాల్లో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లాభాపేక్షలేని సంస్థ ఐఎస్ఎఫ్ నిర్వహించనున్న ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా ఇంటర్నేషనల్ కంపెనీల సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులు, పెట్టుబడిదారులు, యువ ఆవిష్కర్తలు పాల్గొననున్నారు. ముఖ్యంగా ‘జునికార్న్ 100 కే’ చొరవ ద్వారా గ్రామీణ యువతను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించనున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామి ఇన్నోవేషన్, స్టార్టప్ హబ్‌గా తీర్చిదిద్దడంలో కేటీఆర్ కీలకపాత్ర పోషించారని, సాంకేతిక ఆధారిత పాలనకు ఆయన చేసిన నిరంతర కృషిని ఈ సమ్మిట్ వేదికగా పంచుకోవాలని నిర్వాహకులు ఆహ్వానపత్రికలో పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ వేదికపై కేటీఆర్ భాగస్వామ్యం యువ ఆవిష్కర్తలకు స్ఫూర్తినిస్తుందని, తెలంగాణ ఇన్నోవేషన్ మోడల్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.