హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రులైన కేటీఆర్, హరీశ్‌రావును నిందితులుగా విచారణకు పిలువలేదని, కేవలం సాక్షులుగానే పిలిచినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టంచేశారు. అందుకే వారికి సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు.
శనివారం ప్రజాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కూడా సాక్షులుగా పిలుస్తున్నారని, కేవలం బీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు. చట్టబద్ధ సంస్థలపై బురదజల్లే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.
అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేసిన వారు ఏ పార్టీ వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు. కేటీఆర్, హరీశ్‌రావును సాక్షులుగానే పిలిచారన్న మంత్రి వ్యాఖ్యలతో ఫోన్‌ట్యాపింగ్ కేసుతో వారిద్దరికీ సంబంధంలేదని, వారిద్దరూ ఎలాంటి తప్పూ చేయలేదని మంత్రి పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులుగా పిలిస్తేనే తప్పు చేసినట్టని, కానీ ఇప్పుడు సాక్షిగా పిలిచారు కాబట్టి తప్పు చేయనట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.