హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల ప్రగతి, ఎన్నికల మ్యానిఫెస్టో, విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడం, పార్టీ శ్రేణుల అప్రమత్తం.. ఇలా చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. చరిత్రను తిరగరాసి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోబోతున్నామని ప్రకటించారు.
ఆదివారం జలవిహార్‌లో బీఆర్ఎస్ ఎన్నికల నియోజకవర్గ ఇంచార్జిలు, సోషల్ మీడియా వారియర్లకు ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బీఆర్ఎస్వైపే ఉన్నారని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్, బీజేపీ ఫేక్‌న్యూస్‌నే ఆయుధంగా మలచుకుంటాయని వాటిని ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొట్టాలని తెలిపారు. పార్టీ మ్యానిఫెస్టోకు విశేష స్పందన వస్తున్నదని, దీన్ని ఇంటింటికీ చేర్చేవిధంగా కార్యాచరణ ఉండాలని వెల్లడించారు. తొమ్మిదిన్నరేండ్ల సీఎం కేసీఆర్ పాలన, కాంగ్రెస్ తెలంగాణకు దశాబ్దాలుగా చేసిన దగాను వివరించాలని సూచించారు.
సమన్వయంతో ముందుకు సాగాలి
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా అన్ని స్థాయిల్లో పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు సమన్వయం చేయాల్సిన బాధ్యత ఇంచార్జిలపై ఉన్నదని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికో వార్ రూం ఏర్పాటు చేసుకోవాలని, ఇందులో నియోజకవర్గ ఇన్చార్జి, సోషల్ మీడియా వారియర్, నియోజకవర్గ స్వరూప స్వభావాలు తెలిసిన వ్యక్తి ఉండేలా చూసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 వేల పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, బూత్ వారీగా స్థితిగతులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనించాలని, పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందే ప్రతి సూచన క్షణాల్లో అన్ని బూత్‌లకు వెళ్లేలా విస్తృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 3,700 మున్సిపాలిటీల్లోని వార్డుల్లో బీఆర్ఎస్కు సుశిక్షితులైన పార్టీ కార్యకర్తలున్నారని వెల్లడించారు. ఇతర పార్టీలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, అక్కడక్కడా రెచ్చిగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తాయని, ఈ క్రమంలో భావోద్వేగాలకు ఆస్కారం లేకుండా శాంతి సామరస్యాలతో ఉండేలా గులాబీ సైన్యాన్ని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
సర్వేలన్నీ మనకే అనుకూలం
కాంగ్రెస్, బీజేపీ సహా బరిలో నిలిచే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తాయని, ఆ పార్టీలు రాష్ర్టానికి, నియోజకవర్గానికి చేసిన మోసాలను ప్రజల ముందు ఉంచాలని కేటీఆర్, హరీశ్‌రావు సూచించారు. జాతీయ, రాష్ట్రస్థాయి సర్వేలు ఇప్పటి వరకు ఇచ్చిన ఫలితాలన్నీ రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని చేపట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని కుండబద్దలు కొడుతున్నాయని తెలిపారు.
‘ప్రతి గులాబీ సైనికుడు బాధ్యతగా వ్యవహరించాలి. దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఊహించని పనులు చేశాం, విప్లవాత్మక పథకాలను తెచ్చి ప్రజల జీవితాలను మార్చాం. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఈ విషయం తెలిసినా నాలుగు ఓట్ల కోసం లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తారు. అసత్యాన్ని సత్యవంతమైన సమాధానంతో తిప్పికొట్టాలి తప్ప ఘర్షణాత్మక వైఖరికి తావు ఇవ్వకూడదు’ అని దిశానిర్దేశం చేశారు.
మీరే బ్రిగేడియర్లు
నియోజకవర్గానికి వార్‌రూం వారియర్లే బ్రిగేడియర్లుగా పనిచేయాలని మంత్రులు సూచించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులతో (స్కీముల వారీగా) టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని, ఆ సమయంలో అభ్యర్థులతో మాట్లాడించే ప్రయత్నం చేయాలని తెలిపారు. 2014 ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు సోషల్ మీడియా విస్తృతి పెరిగిందని, బీఆర్ఎస్కు ఉన్న సానుకూలతలను వినియోగించుకొని గ్రామపంచాయతీకి కనీసం 500 మందితో సోషల్ మీడియా గ్రూప్‌ను ఏర్పాటు చేసి, ఆ గ్రూప్ ద్వారా ఎప్పకప్పడు పార్టీ సందేశాన్ని తీసుకెళ్లాలని వివరించారు. సమావేశానికి బీఆర్ఎస్ లోక్పక్ష నేత నామా నాగేశ్వర్రావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ సహా నియోజకవర్గానికి నలుగురు చొప్పున హాజరయ్యారు.
కాంగ్రెస్‌తో పాఠాలు చెప్పించుకునే ఖర్మ మాకు లేదు: కేటీఆర్
కాంగ్రెస్‌తో సంస్కారం గురించి పాఠాలు చెప్పించుకోవాల్సిన ఖర్మ తమకు లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీయా తమకు చెప్పేది అని నిప్పులు చెరిగారు. నియోజకవర్గ ఇంచార్జిలు, వార్‌రూం వారియర్లతో సమావేశానంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. సంస్కారం అంటే ఏమిటో ముందు పీసీసీ అధ్యక్షుడికి పాఠం చెప్పాలని సూచించారు.
చావునోట్లో తలపెట్టి తెలంగాణ కోసం కొట్లాడి రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన కేసీఆర్‌ను పట్టుకొని స్థాయిలేకుండా, సోయిలేకుండా మాట్లాడే రేవంత్‌కు జానారెడ్డి సంస్కారం నేర్పాలన్నారు. ‘కేసీఆర్‌ను రాళ్లతో కొట్టి చంపండి’ అని రేవంత్ అన్నప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా, కాళ్లు మీద, తలకింద పెట్టినా ప్రజలు సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని పేర్కొన్నారు.