హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ యుద్ధభేరి మోగించింది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజే శనివారం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శాసనసభ లోపల, వెలుపల ఆందోళనలతో హోరెత్తించింది. వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించింది. సెక్రటేరియట్ గేటు ఎదుట బైఠాయించిన బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా.. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శనివారం ఉదయం గన్పార్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అనంతరం ఖాళీ యూరియా బస్తాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానం చర్చలో పాల్గొన్నారు.
వ్యవసాయ కమిషనరేట్ ముట్టడి
సభ ఆదివారానికి వాయిదా పడిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ర్యాలీగా బయలుదేరి వ్యవసాయ కమిషనరేట్‌కు చేరుకున్నారు. ఎరువుల కొరతపై కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ‘బీఆర్ఎస్ పాలనలో ఏనా డూ ఎరువులు, యూరియా కొరత సమస్య లేదని ఇప్పుడెందుకు వచ్చిందని కమిషనర్ గోపీని ప్రశ్నించారు. ‘కరోనా విపత్తులోనూ ఎరువులు తెప్పించినం. లారీలు బంద్, అన్ని బంద్ ఉన్నా ఎరువులు తీసుకొచ్చినం రైతులకు అందించినం. ఇప్పుడు ఇది మీ వైఫల్యం. ప్రభుత్వ వైఫల్యం. బఫర్ స్టాక్ పెట్టకపోవడం, ముందస్తు ప్లాన్ లేకపోవడం వల్ల రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నరు. ఉదయం నుంచి రాత్రి దాకా పడిగాపులు కాసే పరిస్థితి తీసుకొచ్చారు. యూరియా ఇవ్వకపోగా, రైతులనే కొడుతున్నరు. ఇదేం పద్ధతి. అసలు మీ ప్లానింగ్ ఏమిటి? పూర్తి వివరాలు ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలం’ అని వారు స్పష్టంచేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కదిలేది లేదంటూ అకడే భీష్మించుకు కూర్చోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. అకడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. ఎత్తుకెళ్లి పోలీస్ వాహనంలోకి ఎక్కించారు.
సెక్రటేరియట్ వద్ద మెరుపు ధర్నా
బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను పోలీస్ వాహనంలో తరలించే క్రమంలో సచివాల యం సమీపంలో ట్రాఫిక్‌లో వాహనం ఆగిపోగానే, నాయకులు దిగి, సెక్రటేరియట్ వైపు పరుగులు పెట్టారు. రాష్ట్రంలో యూరియా సమస్యపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని గేట్లు మూసివేయడంతో అక్కడే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ల సెక్రటేరియట్ ముట్టడిపై ప్రభుత్వ ఆదేశాలపై హైదరాబాద్ సీపీ ఆనంద్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. డ్రైవర్ బస్సును ఆపడం, ప్రజాప్రతిని ధులు వెళ్లడంపై ఆయన నివేదిక ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసిన మెరుపు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంనాటి ఘటనలను తలపించాయి. తొలుత గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించడం, రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై గొంతెత్తి నినదించారు. ఆ తర్వాత వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఒక్కో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఐదు పదుల వయసు పైబడినప్పటికీ యువకుల్లా పరిగెడుతూ సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడం నాటి ఉద్యమం సందర్భంగా చేసిన ఆందోళనలను గుర్తుచేసిందని సోషల్‌మీడియాల్లో నెటిజన్లు పేర్కొన్నారు.