KTR | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాలేదని పోస్టులు పెట్టినా పోలీసులు కేసులు పెడుతున్నారని, దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై తాము కూడా అదే పద్ధతిలో స్పందిస్తామని, దాడికి ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంచాలని కోరుతూ మాజీ మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుక్రవారం డీజీపీ జితేందర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పిరికిపంద పాలన నడుస్తున్నదని, రైతులకు సమాధానం చెప్పలేని చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. ఆయనకు పాలన చేతకాదని దుయ్యబట్టారు.
రుణమాఫీ ధర్నాలు చేస్తుంటే రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ఆఖరికి మహిళా జర్నలిస్టులపైనా కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రుణమాఫీ, రైతు భరోసా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుండటాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లాకేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకత్వంలో రైతు నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఆ ధర్నాలో పెద్ద సంఖ్యలో రైతులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు పాల్గొన్నారని వెల్లడించారు. ధర్నా రోజు జరిగిన అరాకచకాలపై డీజీపీ జితేందర్‌కు ఆధారాలతో సహా విన్నవించామని వివరించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో గాదరి కిశోర్ నాయకత్వంలో 500 మందికి పైగా రైతులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. 50 మంది కిరాయి మూకలు, కాంగ్రెస్ గూండాలు తాగిన మైకంలో పోలీసులతో కలిసి రైతులు ధర్నా చేస్తున్న శిబిరంపై దాడికి తెగబడ్డారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులు, గుడ్లు, రాళ్లు, చెప్పులు వేసి రైతులను తీవ్రంగా అవమానించారని, హింసాయుత వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. ‘మా వాళ్లు తిరగబడితే.. ఆ 50 మంది కాంగ్రెస్ గూండాల్లో ఒక్కడూ మిగిలేవాడు కాదు. ప్రజాస్వామ్యంలో హింస సమాధానం కాదు కాబట్టే మా వాళ్లు గమ్మున ఉన్నారు. ఇందులో దుర్మార్గం ఏంటంటే.. డ్యూటీలో ఉన్న పోలీసులు రైతుల నిరసన శిబిరం టెంట్లు కూల్చివేసి, రాళ్లు రువ్వి.. ఆ గూండాలకు వత్తాసు పలకడం. ఇది రేవంత్‌రెడ్డి అనే ఓ పిరికిపంద పాలనకు నిదర్శనం’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి పోయి రైతులకు సమాధానం చెప్పలేని దమ్ములేని దద్దమ్మ ఈ సీఎం అని కేటీఆర్ అన్నారు. ‘మేము అడిగినం. చేతనైతే రా.. ఏ ఊరికి, ఏ మండలానికి పోదామో చెప్పు అని. నీ నియోజకవర్గం కొడంగల్ పోదామా? నువ్ పుట్టిన ఊరు కొండారెడ్డిపల్లి పోదామా? వస్తవా? అని అడిగా. ఎక్కడికీ రాలేదు. కానీ 20వ సారి ఢిల్లీకి పోయిండు. మన గల్లీలోని ప్రజల సమస్యలు తెలుసుకోకుండా సిగ్గులేకుండా ఢిల్లీకి తొత్తుగా, గులాముగా ఈ సీఎం ఢిల్లీకి పోతుండు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను, కిరాయి గూండాలను అడ్డుపెట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళాజర్నలిస్టులపై కాంగ్రెస్ గూండాలు దాష్టీకం ప్రదర్శించడంపై కేటీఆర్ మండిపడ్డారు. ‘వారు సీఎంను బూతులు తిట్టారా? సీఎం లాగులో తొండలు విడుస్తమన్నారా? చెట్టుకు కట్టేసి కొడ్తమన్నరా? గుడ్లు పీకి గోటీలు ఆడుతమన్నారా? ఏమన్నారు? ఏం తప్పుడు మాటలు మాట్లాడారు? వారు కేవలం సీఎం సొంత ఊరిలో రుణమాఫీ అయిందా? లేదా? అని అడుగుతుంటే.. కాంగ్రెస్ చిల్లరగాళ్లు, గూండాలు ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి చేయడమే కాకుండా.. వారిని కొండారెడ్డిపల్లి నుంచి కల్వకుర్తి వెల్దండి పోలీసు స్టేషన్ వరకు కార్లతో వెంబడించి, బెదిరించి వాళ్లమీదపడి రక్కినంత పనిచేశారు.
ఇది సీఎం నికృష్ట మనస్తత్వానికి, కాంగ్రెస్ కార్యకర్తల తీరుకు ఇది నిదర్శనం’ అని ధ్వజమెత్తారు. వారిద్దరికీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘నీ సొంతూరులో, నీ ఇంటిముందు, నీ పార్టీ.. ఇద్దరు ఆడబిడ్డలను అవమానించింది. వాళ్లు నీ బండారం బయటపెట్టినందుకు.. రుణమాఫీ జరగలేదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందకు.. నిన్నటి నుంచి నికృష్టమైన రోత పుట్టించే వార్తలు, రాతలతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు’ అని దుయ్యబట్టారు.
‘ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారగణం ఏది చెప్తే అది పోలీసులు చేయాలి. కానీ, మీకొక విజ్ఞప్తి. మీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మంచిది కాదు. మా పిల్లలు రుణమాఫీ జరగలేదని పోస్టు పెడితే పోలీసులు కాల్ చేస్తున్నారు. కరెంటు పోయిందని కాల్ చేస్తే విద్యుత్తు అధికారులు కాల్ చేస్తున్నారు. ఈ అత్యుత్సాహం వద్దు. సంయమనం పాటించండి. అధికారం ఎవడబ్బ సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అధికారం మారుతుంటుంది’ అని కేటీఆర్ సున్నితంగా హెచ్చరించారు. ‘మాకు పోలీసుశాఖపై సానుభూతి ఉన్నది. మీకు నా విజ్ఞప్తి ఒక్కటే. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.
ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి మిమ్మల్ని అడ్డంపెట్టుకొని పబ్బం గడుపుకోవాలని అనుకుంటుండు. తన పదవిని కాపాడుకునేందుకు మిమ్మల్ని బద్నాం చేస్తుండు’ అని అన్నారు. తిరుమలగిరి సంఘటన విషయంలో స్థానిక పోలీసులపై చర్యలు తీసుకోవాలని, హత్యాయత్నం చేసిన వారిపై 307 కేసు పెట్టాలని, కాంగ్రెస్ గూండాలను కచ్చితంగా అదుపులోకి తీసుకోవాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. అలాగే కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టులపై దాడిచేసిన గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ లేకపోతే.. మిగతావారి పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని అన్నారు.
మంచిర్యాలలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, పోలీసులు వేధింపులు తట్టుకోలేక సత్యనారాయణ అనే బీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేశారని కేటీఆర్ తెలిపారు. అనేక చోట్ల పోలీసులను అడ్డంపెట్టుకొని వేధింపులు కొనసాగుతున్నాయని, ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను అడ్డంపెట్టుకొని బతుకుదామనుకుంటే ముఖ్యమంత్రంత మూర్ఖుడు మరొకడు ఉండడని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని, 30 రోజుల్లో 28 మర్డర్లు, ఈ నగరానికి ఏమైంది? అంటూ ముఖ్యమంత్రి అనుకూల పత్రికల్లోనే వార్తలు వస్తున్నాయని వివరించారు. వీటన్నింటినీ డీజీపీ దృష్టికి తీసుకొచ్చామని, వాటిపై స్పందించాలని డీజీపీని కోరామని వెల్లడించారు. అన్నీ పరిశీలిస్తామని డీజీపీకి చెప్పినట్టు కేటీఆర్ తెలిపారు.
‘సోషల్ మీడియాలో రుణమాఫీ కాలేదని పోస్టు చేసిన మా తమ్ముళ్ల మీద కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. ఇక నుంచి మేము కూడా అదే పద్ధతిలో స్పందిస్తాం. చర్యకు ప్రతి చర్య ఉంటుందని డీజీపీకి చెప్పాం’ అని కేటీఆర్ అన్నారు. ‘పదేండ్లు శాంతియుతంగా రాష్ర్టాన్ని నడిపినం. 14 ఏండ్లు కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినొద్దని సంయమనంగా ఉన్నం. మా సహనాన్ని, మంచితనాన్ని, తెలంగాణపై ఉన్న ప్రేమను చేతగానితనంగా భావిస్తే.. చర్యకు ప్రతి చర్య తప్పదు’ అని డీజీపీని, ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను మీడియాలో ప్రసారం చేసిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. కొంతమంది పోలీసులు మంత్రుల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని డ్యాన్సులతో పరశించిపోతున్నారని, కేకులు కోస్తూ.. డ్యాన్స్‌లు చేస్తూ, స్పీచ్‌లు ఇస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, ఆర్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, ఎన్ భాస్కరరావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, నోముల భగత్, నాయకులు దాసోజు శ్రవణ్, చిరుమల్ల రాకేశ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రావుల శ్రీధర్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, ముఠా జయసింహా, పడాల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
‘రైతు రుణమాఫీపై నీకు దమ్ముంటే.. సెక్యూరిటీ లేకుండా, పోలీసు బలగాలను అడ్డుపెట్టుకోకుండా రా. బ్యాంకు అధికారులను, వ్యవసాయ అధికారులను వెంటపెట్టుకోకుండా రా. మేము కూడా వస్తం. ఏ ఊరికి పోతవో చెప్పు.. పోదాం’ అని సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. ఎక్కడా చారణా రుణమాఫీ కాలేదని, ఈ విషయంలో రైతులు భగభగ మండుతున్నారని, కాం గ్రెస్ వాళ్లు ఊర్లలోకి వస్తే తరిమికొట్టాలని చూస్తున్నారని చెప్పారు. పోలీసులు, అధికారగణాన్ని అడ్డుపెట్టుకొని తప్పులు చేస్తున్నారని అన్నారు.
9 నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తున్నదని, పోలీసులు కూడా రాజకీయ నాయకుల డైరెక్షన్లో పనిచేయిస్తున్నారని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టానికి వ్యతిరేకంగా కిందిస్థాయి పోలీసులను వాడుకుంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా శాంతిభద్రతలు లేకుండా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం కలిసే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థల సేవలకు సంబంధించి ఎవరైనా కాల్ చేస్తే.. వారినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడులు అవాంఛనీయమని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడిచేసిన వారిపై కేసులు నమోదు చేశామని, కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని చెప్పారు. శుక్రవారం డీజీపీ జితేందర్‌ను కేటీఆర్ కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్, డీజీపీ మధ్య ఆసక్తికర సంభాషణ సాగిందని అక్కడున్నవారు పేర్కొన్నారు. ‘సూర్యాపేటలో జరిగింది ఏమాత్రం కరెక్ట్ కాదు’ అని కేటీఆర్ పేర్కొనగా.. ‘మీతో ఏకీభవిస్తున్నాను. ఇట్స్ వెరీ అన్-యాక్సెప్టబుల్’ అని డీజీపీ సమాధానం ఇచ్చారు.
‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మేము పరిపాలించినప్పుడు ఇలా చేశామా? ఇలా జరిగిందా? ఎప్పుడైనా పరిధి దాటి ప్రవర్తించామా? మంత్రిగా నేను కూడా హద్దులు తెలుసుకొని ప్రవర్తించాను కదా’ అని కేటీఆర్ గుర్తు చేయగా.. ‘అవును. మీరు తెచ్చిన సంస్కరణలే ఇప్పటికీ అమలవుతున్నాయి’ అని డీజీపీ పేర్కొన్నట్టు తెలిసింది. ‘మా సోషల్ మీడియా కార్యకర్తల మీద అడ్డగోలు కేసులు పెడుతున్నారు. మా హయాంలో మాపై చాలామంది తీవ్ర దుష్ప్రచారం చేశారు. అయినా ఎప్పుడూ కేసులు పెట్టలేదు. కేవలం సీఎం, ఇతర బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనే కేసులు పెట్టాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మహిళా జర్నలిస్టులపై దాడిని ప్రస్తావిస్తూ.. ‘జర్నలిస్టులను కూడా కొడితే రాష్ట్రం ఏం కావాలి?’ అని కేటీఆర్ ప్రశ్నించగా.. జరిగింది పొరపాటేనని డీజీపీ ఒప్పుకున్నారని తెలిసింది. ‘మీరు ఫోన్ చేయగానే నేనే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యాను. వాళ్లను ఎస్కార్ట్ ఇచ్చి హైదరాబాద్‌కు పంపాలని పోలీసులను ఆదేశించాను. ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించాను’ అని డీజీపీ హామీ ఇచ్చినట్టు సమాచారం. ‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మీరు మా గొంతు నొక్కొద్దు’ అని కేటీఆర్ కోరగా.. ‘వందశాతం మీతో ఏకీభవిస్తాను. ఇకపై ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకే నేరుగా చెప్పండి. పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా’ అని డీజీపీ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.