KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దివ్యంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని దివాలా తీసిందంటూ రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ, పారిశ్రామికరంగాలతోపాటు ఐటీ ఎగుమతులు, తలసరి ఆదా యం, జీఎస్టీ, జీడీపీ, సొంత ఆదాయ రాబడి, పంటల ఉత్పత్తి, జీవాల సంపద, మత్స్య సంపద వంటి అంశాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచిందని గుర్తుచేశారు. తెలంగాణభవన్‌లో శనివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై, తెలంగాణ ఆర్థికప్రగతిపై, 15 నెలల కాంగ్రెస్ పాలనపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు రేవంత్.. మేము సిద్ధం’ అని సవాల్ చేశారు. తల్లి లాంటి తెలంగాణను క్యాన్సర్ రోగితో పోల్చిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డి అని నిప్పులు చెరిగారు. తెలంగాణ అప్పులపై రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ స్టాటిస్టికల్ అట్లాస్ నివేదికలో ఒప్పుకొన్నదని, తెలంగాణ ఆర్థిక స్థితిపై వాస్తవాలతో నివేదిక విడుదల చేసిన భట్టి విక్రమార పదవి ఉంటుందో ఊడుతుందోనని ఎద్దేవాచేశారు.
గోబెల్స్ వారసుల్లా దుష్ప్రచారం
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నుంచి మొదలు ప్రతి కాంగ్రెస్ నాయకుడు గోబెల్స్ వారసుల్లాగా తెలంగాణ ఆర్థిక ప్రగతిపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి చెప్తున్నవి పూర్తి అబద్ధాలని భట్టి విక్రమార ఫిబ్రవరి 17న ఒక సమగ్ర (రాష్ట్ర గణాంక నివేదిక-2024) నివేదికను విడుదల చేశారని, ఈ నివేదిక ఇచ్చినందుకు భట్టికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఆ నివేదిక బీఆర్ఎస్ పాలనకు అద్దం పట్టిందని, కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని తెలుసుకొని వెబ్సైట్ నుంచి రిపోర్టును రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కారు డిలీట్ చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని ఈ నివేదికతో స్పష్టమైందని చెప్పారు.
తలసరిలో నంబర్ వన్
తలసరి ఆదాయంలో 2014లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 10వ స్థానంలో ఉన్నదని కేటీఆర్ గుర్తుచేశారు. 2023 నాటికి తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నంబర్‌వన్ స్థానంలో తెలంగాణ ఉన్నట్టు రాష్ట్ర గణాంక నివేదిక-2024 వెల్లడించిందని చెప్పారు. ‘2014-15లో దేశ తలసరి ఆదా యం సగటు రూ.86,000 ఉంటే, తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,000 ఉండేది. అట్లాస్ ప్రకారం భారతదేశ సగటు కంటే 2 రెట్లు ఎకువగా తెలంగాణ తలసరి ఆదాయం సగటు ఉన్నది’ అని వెల్లడించారు. 2013-14లో భారతదేశ జీడీపీలో తెలంగాణ వాటా 4 శాతంగా ఉంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి అది పెరిగి 5.1 శాతంగా ఉన్నదని గుర్తుచేశారు. దేశ జనాభాలో 2.8 శాతంగా ఉన్న తెలంగాణ 5.1 శాతం సంపదను దేశానికి అందిస్తున్నదని, మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనమే రెట్టింపు ఆదాయాన్ని కేంద్రానికి ఇస్తున్నామని చెప్పారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం కేసీఆర్ సీఎంగా ఉన్న పదేండ్లలో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూలో భారతదేశంలోనే 88 శాతంతో కేంద్రంపై ఆధారపడకుండా తెలంగాణ అగ్రభాగాన నిలబడిందని తెలిపారు. జీఎస్డీపీలో తెలంగాణ స్థానం 2014లో 5 లక్షల కోట్లు ఉండగా, 2023 నాటికి అది 15 లక్షల కోట్లకు పెరిగినట్టు నివేదిక స్పష్టం చేసిందని వివరించారు. జీఎస్డీపీలో గుజరాత్ కంటే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉన్నదని స్పష్టంచేశారు. తెలంగాణ దివాలా తీసిందని దివాలాకోరు మాటలు మాట్లాడిన వారి నోర్లు మూయించేలా అట్లాస్ వాస్తవాలను బయటపెట్టిందని చెప్పారు. ‘తలసరి ఆదాయంలో మాత్రమే కాదు.. జీడీపీలో భారతదేశానికి తెలంగాణ ఏ విధంగా సాయం అందిస్తున్నదో.. ప్రగతిశీల విధానాలతో, కులం మతం పంచాయితీలు లేకుండా తెలంగాణ ఎలా పురోగమించిందో.. ఎట్లా సంపద సృష్టించిందో ఈ నివేదిక తెలియజేస్తున్నది’ అని పేర్కొన్నారు.
నాడు 34 లక్షలు.. కేసీఆర్ హయాంలో 1.18 కోట్ల ఎకరాలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై చిల్లర మాటలు మాట్లాడిన వారికి అట్లాస్ నివేదికలో స్పష్టమైన సమాధానం ఉన్నదని కేటీఆర్ చురకలంటించారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ లాంటి సాగునీటి పథకాలతోపాటు రైతుబంధు వంటి సంక్షేమ పథకాలతోనే సంపద పెరిగిందని నివేదిక వెల్లడించిందని తెలిపారు. 2014లో 34 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యేదని, తద్వారా 68 లక్షల టన్నుల వరి దిగుబడి అయ్యేదని వివరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి కోటీ 18 లక్షల ఎకరాల్లో వరి సాగు ఉండేదని, రెండు కోట్ల 60 లక్షల టన్నుల వరి దిగుబడి అయ్యేదని పేర్కొన్నారు. 2014లో ఐటీ ఎగుమతులు 57 వేల కోట్లు ఉంటే, 2023 నాటికి అవి 2.41 లక్షలకు చేరినట్టు తెలిపారు.
2014లో ఐటీ రంగంలో 3,23,000 మంది ఉద్యోగులు ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి మూడు రెట్లు ఎకువగా పది లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. 2014లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1356 యూనిట్లు ఉంటే, 2023 నాటికి అది 2349 యూనిట్లుగా ఉన్నదని చెప్పారు. వ్యవసాయ, పరిశ్రమల విస్తరణతోపాటు నాణ్యమైన సరఫరా కారణంగా గృహాల్లో విద్యుత్తు వినియోగం పెరగడంతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ అద్భుతంగా ఉన్నదని కాంగ్రెస్ ప్రభుత్వ నివేదికే స్పష్టం చేసిందని తెలిపారు. 2014లో పాల ఉత్పత్తి 42.07 లక్షల టన్నులు ఉండగా, 2023-24 నాటికి అది 57.22 లక్షల టన్నులకు చేరిందని, మాంసం 5.05 లక్షల టన్నుల నుంచి 10.97 లక్షల టన్నులకు, గుడ్ల ఉత్పత్తి 106 కోట్ల నుంచి 184 కోట్లకు పెరిగిందని వివరించారు. బీసీలను బలోపేతం చేసే కేసీఆర్ చర్యలను కూడా కాంగ్రెస్ నేతలు చులకనగా మాట్లాడారని, కానీ ఇవాళ గొర్రెల ఉత్పత్తిలో, జీవసంపదలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.
మిత్తీలపైనా అబద్ధమే
గడిచిన 10 నెలల కాలంలో మిత్తీల కోసం రూ.26.56 వేల కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందని కేటీఆర్ చెప్పారు. ఉన్నదానికంటే ఎకువ మిత్తీ కడుతున్నామని అబద్ధాలు చెప్తున్న రేవంత్‌రెడ్డి, ఆ పైసలు ఎవరి ఖాతాల్లోకి వెళ్తున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. టకీటకీమని రైతుల ఖాతాల్లో పడటం లేదని, రాహుల్‌గాంధీ ఖాతాలో పడుతున్నాయో లేదో చూడాలని ఎద్దేవాచేశారు. 2014లో తెలంగాణ ఆదాయంలో వడ్డీల శాతం 21.64 ఉండగా, 2023 నాటికి వడ్డీల శాతం కేవలం 17.19 మాత్రమేనని చెప్పారు. ‘రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలి. వీలుంటే అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి తన పాలన పైన చర్చ పెట్టాలి’ అని కేటీఆర్ సవాల్ చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని రేవంత్‌రెడ్డి అనడంపై కేటీఆర్ ఫైరయ్యారు. మహిళలకు ఇస్తానన్న నెలకు రూ.2500 ఏమయ్యాయని, యువతులకు ఇస్తామన్న స్కూటీలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. ‘ఇప్పటికే స్టార్టర్లు, మీటర్లు, ఇంటి తలుపులు ఎత్తుకపోతున్నరు. రేపు ఆడబిడ్డల పుస్తెలతాడు కూడా రేవంత్‌రెడ్డి ఎత్తుకపోతడు’ అని మండిపడ్డారు.
బండి సంజయ్ రక్షణలో రేవంత్
బండి సంజయ్ రక్షణ కవచంలో రేవంత్‌రెడ్డి ఉన్నారని, రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లను ప్రజలంతా ఆర్ఎస్ బ్రదర్స్ అనుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారని, బండి సంజయ్‌కి చేతనైతే ఆర్ఆర్ ట్యాక్స్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి కే అమృత్ సాం మొదలుకొని అనేక సామ్స్ పైన కేంద్రానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతానని ఏమైనా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలోని పొంగులేటి ఇంటిపై ఈడీ దాడిచేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అమృత్ టెండర్లలో రేవంత్‌రెడ్డి బావమరిది సాం చేసినా కేంద్రం ఎందుకు కాపాడుతున్నదని నిలదీశారు. సుంకిశాల ప్రమాదంలో రేవంత్‌రెడ్డి ఎవరిని కాపాడుతున్నాడో తెలుసునని విమర్శించారు.
గట్టిగా సమాధానమిస్తాం
ఏపీ కృష్ణా జలాల చౌర్యంపైనా కేవలం ఉత్తరం రాసి రేవంత్‌రెడ్డి చేతులు దులుపుకొన్నారని కేటీఆర్ విమర్శించారు. ‘కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా కోసం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే సీఎం ఉద్యోగం పోతదని రేవంత్‌రెడ్డి భయపడుతున్నారు. కృష్ణాజలాల దోపిడీపైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎండగడతాం. గతం లో నల్లగొండలో కేసీఆర్ ధర్నా తర్వాత అసెంబ్లీలో తీర్మానంచేశారు. ఏదో అడ్డిమార్ గుడ్డి దెబ్బ లెక రేవంత్‌రెడ్డి సీఎం అయిండు. ఇప్పటికైనా కేసీఆర్‌ను దూషించడం మానె య్. ప్రజల కోసం మంచిగా పనిచెయ్. తెలంగాణను ఎవరు తిట్టినా.. తెలంగాణను ఎవరు తకువ చేసినా అంతే గట్టిగా సమాధానమిస్తం’ అని కేటీఆర్ హెచ్చరించారు.
వారికి పాలన చేతకావడం లేదు
ఢిల్లీ పార్టీలకు తెలంగాణను పరిపాలించడం చేతకాదని తేలిపోయిందని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘వారికి పరిపాలన చేతకావడం లేదు.. కాంగ్రెస్‌ను నమ్మిన పాపానికి రాష్ర్టానికి చిప్ప చేతికిచ్చారు. మిగులు బడ్జెట్‌తో రాష్ర్టాన్ని అప్పజెప్తే లక్ష 40 వేల కోట్ల అప్పు చేసిండ్రు. కేవ లం రేవంత్ తిక నిర్ణయాలు, హైడ్రా లాంటి దికుమాలిన విధానాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లో 18 వేల కోట్లు వస్తాయనుకుంటే 5000 కోట్లు కూడా రాలేదు. రేవంత్‌రెడ్డి ఆస్తులు, ఆదాయం పెరుగుతున్నది కానీ, రాష్ట్ర ఆస్తులు, ఆదాయం పడిపోతున్నది. మేడిగడ్డను ఎండబెట్టడంతో ఈ రోజు భూగర్భ జలాలు తగ్గి వ్యవసాయరంగంలో సంక్షోభం ఏర్పడింది.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: కేటీఆర్
‘ముఖ్యమంత్రి చేతకానితనం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నయ్.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు’ అని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాది నుంచి పక్కనపెట్టి రిజర్వాయర్లలో నీళ్లు లేకుండా చేయడం వల్లే భూగర్భజలాలు అడుగంటిపోయాయని వాపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ శనివారం ఎక్స్‌వేదికగా స్పందించారు. కాంగ్రెస్ సరారు చేతకానితనం వల్ల ఏడాదిలోనే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా ఉన్న కోదండరెడ్డి వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణమని విమర్శించారు. కండ్ల ముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిలలాడుతుంటే బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. ఎండుతున్న పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించటం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. వ్యవసాయరంగంపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులకు ధైర్యం ఇవ్వాల్సిన ప్రభుత్వం అస్త్రసన్యాసం చేయటం దారుణంగా ఉన్నదని మండిపడ్డారు. పదేండ్లపాటు సంతోషంగా సాగిన సాగును ఆగం చేస్తున్నందుకు సీఎం సహా సమస్త కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో సంపద ఎలా పెరిగింది? ఎలా అభివృద్ధిలో పురోగమించింది? ఎలా దేశానికి ఆదర్శంగా మారిందో స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేసిన స్టేట్ స్టాటిస్టికల్ అట్లాస్ నివేదిక స్పష్టంచేసింది. మోదీ తలకిందులుగా తపస్సు చేసినా, రాహుల్‌గాంధీ వంద జోడో యాత్రలు చేసినా కేసీఆర్ లెక రాష్ర్టాన్ని అభివృద్ధి చేయలేరు.
-కేటీఆర్
కృష్ణాజలాల్లో న్యాయమైన వాటా కోసం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తన ఉద్యోగం ఎక్కడ పోతుందోనన్న భయంలో రేవంత్ ఉన్నడు. తెలంగాణ ఆర్థిక ప్రగతిపై సీఎం రేవంత్‌కు చెంపపెట్టులా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార వాస్తవాలు వెల్లడించారు. తెలంగాణ అప్పులపై రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే స్టేట్ స్టాటిస్టికల్ అట్లాస్ నివేదికలో ఒప్పుకొన్నది.
–కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 15 నెలలుగా రేవంత్‌రెడ్డి మొదలు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఒక ఎజెండా ప్రకారం గోబెల్స్ వారసుల్లాగా తెలంగాణ ఆర్థిక ప్రగతిపై దుష్ప్రచారం చేస్తున్నరు. రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నడు. ఇంతటి దివాలాకోరు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరూ లేరు.
-కేటీఆర్
రాష్ట్ర గణాంక నివేదిక-2024 వెల్లడించిన నిజాలు ఇవే..