మహబూబ్‌నగర్ : కేసీఆర్ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని, తాము జిల్లాలను కుదిస్తామని, కొన్ని జిల్లాలను తొలగిస్తామని ఇటీవల అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. జిల్లాలను ముట్టుకుంటే అగ్గిపుడుతదని, ఆ అగ్గిని పుట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీయే తీసుకుంటదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ ఈ హెచ్చరిక చేశారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘మొన్న అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి చెప్తున్నడు. కేసీఆర్ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసిందట. కేసీఆర్‌గారు ప్రజలకు పాలనను చేరువచేసేందుకు రాష్ట్రంలోని 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచారు. మహబూబ్‌నగర్ జిల్లాను మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి జిల్లాలుగా విభజించారు. తండాల పాలనను తండా వాసుల చేతుల్లోనే పెట్టేందుకు వాటిని గ్రామ పంచాయతీలుగా మార్చారు’ అని చెప్పారు.
‘ఇప్పుడు కాంగ్రెసోళ్లు ఏమంటున్నరు..? మహబూబ్‌నగర్‌ను ఐదు ముక్కలు చేసేది లేకుండెనట. తండాలను గ్రామ పంచాయతీలు చేసేది లేకుండెనట. కేసీఆర్ తప్పు చేసిండట. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలను రద్దు చేస్తరట. ఈ విషయాన్ని మొన్న రెవెన్యూ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. జిల్లాలను శాస్త్రీయంగా విభజించలేదు కాబట్టి అన్నింటిని తీసేస్తాం అంటున్నరు. మరె జిల్లాలను తీసేస్తే నారాయణపేటోళ్లు ఊకుంటరా..? గద్వాలోళ్లు, వనపర్తోళ్లు ఊకుంటరా..? నేను రేవంత్‌రెడ్డికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నా. గద్వాల జిల్లాను ముట్టినా.. నారాయణపేట జిల్లాను ముట్టినా.. వనపర్తి జిల్లాను ముట్టినా.. అక్కడ అగ్గిపుడుతది. ఆ అగ్గిపుట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటది’ అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
అదేవిధంగా ‘జిల్లాల జోలికొస్తే అక్కడే ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని హెచ్చరిస్తున్నా. పిచ్చిపిచ్చి పొరపాట్లు చేయకండి. ప్రజలు మీ అడ్డగోలు హామీలకు మోసపోయి అధికారం ఇచ్చిండ్రు. మీకు చేతనైతే ఇచ్చిన హామీలను నెరవేర్చండి’ అని సవాల్ చేశారు.