KTR : రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ విచారించడంపై ఆయన స్పందించారు. ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. న్యాయం కోసం తాము హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళతామని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక నిలదీసిన వారిపై కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి సీఎం బావమరిది సృజన్రెడ్డేనని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘ఫోన్ ట్యాపింగ్ కేసు పసలేని కేసు అని గతంలో సుప్రీంకోర్టే చెప్పింది. అయినా గూడా ఆ కేసును సాగదీయడంలో అర్థం ఏముంది..? ఈ కేసుకు సంబంధించి సిట్‌గానీ, సర్కారుగానీ ఒక్క ప్రెస్‌మీట్ అయినా పెట్టి అధికారికంగా మాట్లాడిందా..? ఒక్కరిపైన అయినా నేరం రుజువైందా..? తప్పు జరిగింది అంటరు. మరి ఎందుకు నిరూపించలేకపోతున్నరు..?’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.