మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అంచనాలకు మించి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కేటీఆర్‌కు జనం అడుగడుగునా జేజేలు పలికారు. అచ్చంపేట సాక్షిగా ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను కేటీఆర్ ప్రజల ముందు పెట్టారు. కేటీఆర్ కోసం దాదాపు 4 గంటలపాటు వేచి చూసిన జనం.. వర్షం పడుతున్నా ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. కేటీఆర్‌తో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. కేటీఆర్ ‘సీఎం.. సీఎం’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేటీఆర్ రెండుసార్లు పర్యటించారు.
ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పర్యటించి గులాబీ శ్రేణుల్లో జోష్ నింపారు. 22 నెలల క్రితం కాంగెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేరిందా? అన్న ప్రశ్నకు ‘లేదు.. లేదు’ అని ప్రజలు సమాధానమిచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రా రంభం కావాల్సిన జనగర్జన సభ కోసం ఉదయం 11 గంటల నుంచే జనం రావడం మొదలు పెట్టారు. అచ్చంపేట నియెజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి భారీగా తరలివచ్చారు. ఆటోలు, జీపులు, ట్రాక్టర్లు, కార్లు, బస్సుల్లో అచ్చంపేటకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే సభాప్రాంగణం మొత్తం నిండిపోయింది. సాయంత్రం 4:10 గంటలకు కేటీఆర్ వేదిక మీదకు అభివాదం చేస్తూ వచ్చారు. అచ్చంపేట జనగర్జనలో దాదాపు 15 వేల నుంచి 20 వేల మంది వరకు సభకు హాజరై ఉంటారని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
అచ్చంపేటలో జనగర్జన పేరుతో కేటీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేస్తే, దానిని విఫలం చేసేందుకు సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో మంత్రులు హడావుడిగా పర్యటించారు. అయినా జనం పెద్ద సంఖ్య లో సభకు తరలివచ్చారు. కాగా కొండారెడ్డిపల్లి నుంచి ఎవరూ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతల ఇండ్లపై నిఘా ఉంచారు. అధికార పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేటీఆర్ సభ విజయవంతం కావడం తో కాంగ్రెస్ నేతలు డీలా పడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్ష పదవిని అనుభవించి పార్టీ మారిన మాజీ ఎమ్మెల్యే బాలరాజ్‌కు అచ్చంపేట ప్రజలు షాక్ ఇచ్చారు. సభకు వెళ్లకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఊహించిన దానికంటే ఎక్కువ జనం తరలివచ్చారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో పార్టీ అధినేత కేసీఆర్ అచ్చంపేట సమన్వయకర్త బాధ్యతలను నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. దీంతో ఆయన అచ్చంపేట నియోజకవర్గం మొత్తం తిరుగుతూ కార్యకర్తలకు భరోసా కల్పించారు. కేటీఆర్ పర్యటన ఖరారు కాగానే సభను విజయవంతం చేసేందుకు ఇక్కడే మకాం వేశారు. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, సహచర మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ మర్రికి అండగా నిలిచారు.
కడ్తాల్, సెప్టెంబర్ 28: ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి కుటుంబం, బంధువుల ఆస్తులను పెంచుకునేందుకే గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుతోపాటు ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్తులైన్ అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా బాధిత రైతులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారానికి 21వ రోజుకు చేరాయి.
ఆదివారం అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న కేటీఆర్.. కడ్తాల్ మండల కేంద్రంలో దీక్ష చేస్తున్న బాధిత రైతులను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, గోలి శ్రీనివాస్‌రెడ్డి, రజిని, వెంకటేశ్‌గుప్తా, పరమేశ్, దశరథ్‌నాయక్, ఆనంద్, లక్ష్మీనర్సింహారెడ్డి, రామకృష్ణ వీరయ్య, శ్రీనుగుప్తా తదితరులు పాల్గొన్నారు.