హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాపాలన కాదని, రాక్షస పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ‘మానుకోటలో పోలీసుల లాంగ్‌మార్చ్ ఏంది? అసలు మానుకోటలో ఏం జరుగుతున్నది?’ అని గురువారం ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. ‘గొడవలు కాలేదు.. అసలేమీ కాలేదు.. పోలీసుల హెచ్చరికలు ఎందుకు? శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చింది? అలాంటప్పుడు ప్రజాపాలన ఎలా అవుతుంది?’ అని నిలదీశారు. ‘ఇది నిర్బంధ పాలన.. నిరంకుశ పాలన.. కంచెల పాలన.. కక్షల పాలన.. ఆంక్షల పాలన.. మొత్తంగా రాష్ట్రంలో రాక్షస పాలన’ అని నిప్పులు చెరిగారు. ‘తెలంగాణను ఎంత అణచివేయాలని చూస్తే అంత తిరుబాటు లేస్తుంది.. ఖబర్దార్ రేవంత్‌రెడ్డీ’ అని హెచ్చరించారు.
దవాఖానల్లో విద్యార్థులు..చెరసాలలో రైతులు
దవాఖానల్లో విద్యార్థులు.. చెరసాలలో రైతులు అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘తల్లికి బువ్వపెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించినట్టే ఉన్నది సీఎం రేవంత్‌రెడ్డి పాలన.. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట!’ అని దుయ్యబట్టారు. గురుకులాల్లో రోజుకోచోట ఫుజ్పాయిజన్తో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారని, ఎన్నడూలేనిది 11 నెలల్లో 42 మంది విద్యార్థులు చనిపోయారని, పిల్లలు పిట్టల్లా రాలుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.