హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ గాలిలో దీపంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తక్షణమే విద్యాశాఖపై ఉన్నతస్థాయి సమీక్షి నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని ఎక్స్ వేదికగా బుధవారం డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గ్రాంట్లు విడుదల చేయకపోవటం సిగ్గుచేటని విమర్శించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే టీచర్లు లేక విద్యార్థులు టీసీలు తీసుకొని పోతున్నారని ఉదహరించారు. రుణమాఫీ కాని రైతులపై దరఖాస్తుల పేరుతో దోపిడీ మొదలైందని పేర్కొన్నారు. రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ముతో రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నదా? అని ప్రశ్నించారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ఊపిరి తీశారు
బీఆర్ఎస్ హయాంలో అమలైన ‘సీ ఎం బ్రేక్ ఫాస్ సీమ్’ను అర్ధాంతరంగా ఆపడం దుర్మార్గమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పథకంపై కేంద్రాన్ని దేబిరించటం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవాచేశా రు. ఈ పథకం ఊపిరి తీసి ప్ర భుత్వం లక్షలాది మంది విద్యార్థుల పొట్టగొట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వ దవాఖానలు రోగులతో కికిరిసిపోవడం దిగజారిన ప్రజారోగ్య వ్యవస్థకు, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. డాక్టర్ల కొరత, మందుల లేమితో కొట్టుమిట్టాడుతున్న దవాఖానల్లో పరిస్థితులను చకదిద్దాలని చెప్పారు. సుడిగాలి (టోర్నడో) బీభత్సానికి ములుగు జిల్లా మేడారం-తాడ్వాయి అటవీ ప్రాంతంలో సుమారు 200 హెక్టార్ల మేర లక్షకు పైగా చెట్లు నేలకూలడం అత్యంత బాధాకరమని కేటీఆర్ పేర్కొన్నారు. నష్టపోయిన గిరిజనులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.