KTR | కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాగ్ధానాల భంగంపై విమర్శల దాడి చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పేరుకేమో ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం అంటున్నారు. మేం ప్రజాస్వామికంగా ఉన్నామని చెప్పి.. తెల్లారిస్తే పాడిందే పాటలా.. అరిగిపోయిన గ్రామ్‌ఫోన్ రికార్డులా.. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా అందరూ ఒకేమాట ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని చెబుతరు. కానీ, నిన్న గవర్నర్ ఉభయసభల నుంచి ఉద్దేశించి చేసిన ప్రసంగంపై, అందులోని డొల్లతనంపై, చెప్పిన పసలేని విషయాలు, పచ్చిఅబద్ధాలపై మా పార్టీ తరఫున శాసనసభలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్‌రెడ్డి మాట్లాడం మొదలుపెట్టి పది నిమిషాలు కాకముందే ఆరు నిమిషాల్లోపే ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ, ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేశారు’ అన్నారు.
‘జగదీశ్‌రెడ్డి ఏమాత్రం సంయమనం కోల్పోకుండా.. రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతుబంధుపై ఎండగట్టారు. తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున ఓ హెచ్చరిక చేశారు. అమలుకాని ఆరు గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్ధానాల భంగంపై విమర్శలతో దాడి చేస్తుంటే.. తట్టుకోలేని ప్రభుత్వం.. నీతిబాహ్యంగా, నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాలపై ఆధారపడే బీఆర్ఎస్ సభ్యుడు జగదీశ్‌రెడ్డిని అనని మాటను అన్నట్లుగా చిత్రీకరించి సస్పెండ్ చేసే ప్రయత్నం చేశారు. జగదీశ్‌రెడ్డి ఒక్కమాట అన్‌పార్లమెంటరీ మాట సభలో మాట్లాడలేదు. అన్నదీ ఒక్కటే మాట.. స్పీకర్ గారు మాకు అందరికీ తండ్రిలాంటి వారు.. మీరు మా అందరి తరఫున అక్కడ ఉన్నారు.. మా అందరి మా హక్కులు మీరే కాపాడాలని ఆక్రోషం వ్యక్తం చేశారు. ఎక్కడ కనీసం ఒక్కమాట కూడా స్పీకర్‌ను అగౌరవంగా, పొరపాటున అనలేదు. కానీ, అనని మాటను అన్నట్లుగా.. జరగని తప్పును జరిగినట్లుగా చిత్రీకరించి మా గౌరవ సభ్యుడిని ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని.. ఏకపక్షంగా, నియంతృత్వ పోకడలతో రాష్ట్ర ప్రభుత్వం ఐదుగంటలు సభను వాయిదా వేసింది.. ఢిల్లీలో ఉన్న రేవంత్‌రెడ్డి ఆదేశం మేరకు గొంతునొక్కారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మాకు కనీసం అవకాశం ఇవ్వలేదు. ఉరిశిక్ష వేసేముందు కూడా ఖైదీలకు తమ వాదన చెప్పుకునేందుకు అవకాశం కల్పిస్తారు. కానీ, జగదీశ్‌రెడ్డికి తాను చేసిన తప్పేంది.. నేను మాట్లాడిన తప్పు ఏంటీ? అనే వివరణ అడిగేందుకు అవకాశం ఇవ్వలేదు. మా నాయకుడు, తెలంగాణ సాధకుడు కేసీఆర్ మాకు స్పష్టంగా అవకాశం ఇచ్చారు. స్పీకర్ పెద్దవారు. ఆయన బాధపడి ఉంటే.. ఏం పర్వాలేదు విచారం వ్యక్తం చేయండని చెప్పారు. సభ సజావుగా జరిగేటట్టు సహకరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ మాటను స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు స్పష్టంగా చెప్పాం. మాకు మైక్ ఇవ్వండి.. మేం నిజంగానే మేం పొల్లు మాట మాట్లాడి ఉంటే.. టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి.. సభ్యలుందరికీ చూపించండి.. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి. ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు.. మూడ్ ఆఫ్ ది హౌస్ తీసుకుంటారు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు’ అని తెలిపారు.
‘అవసరమైతే అన్ని స్పీకర్ చాంబర్లో ఒక సమావేశం పెట్టి ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లిందని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకు వచ్చి విచారం వ్యక్తం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మేం తప్పు చేయలేదు. ఒక్క పొల్లుమాట మాట్లాడలేదు. అయినా సరే.. స్పీకర్‌పై ఉండే గౌరవంతో.. ఆ పదవిపై ఉండే గౌరవంతో మేం అవసరమైతే విచారం వ్యక్తం చేసి.. సభ సజావుగా జరిగేందుకు సహకరిస్తామని స్పీకర్, మంత్రికి చెప్పాం. కానీ, చేయని తప్పుకు మొత్తం సెషన్ అంతా జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. హరీశ్‌రావు రిపీటెడ్‌గా అడుగుతున్నారు. మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వాలని.. చెప్పేది వినండి అన్నా వినకుండా.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు నలుగైదుగురితో మాట్లాడించారు. వారు చెప్పిందే వేదమని.. చెప్పిందే సత్యం అన్నట్లు బుల్డోజ్ ధోరణితో.. నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎం రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయం తీసుకొని మా సభ్యుడి గొంతునొక్కారు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ పట్ట పగలు, నిండు సభలో ప్రజాస్వామ్యం గొంతు కోసింది.
ప్రతిపక్షం హక్కులను పాతరేసింది.
అసెంబ్లీ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా మిగులుతుంది.#CongressFailedTelangana #SaveDemocracy pic.twitter.com/OBB7UaXYg5— Harish Rao Thanneeru (@BRSHarish) March 13, 2025