నల్లగొండ జిల్లా రామన్నపేటలో అదానీ సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. బెల్లంపల్లిలో ఓరియంట్ సిమెంటు పరిశ్రమను, ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను అదానీకి కట్టబెట్టడానికి కాంగ్రెస్ సర్కార్ చర్యలు మొదలు పెట్టింది. మనం చూసుకుంటూ ఉంటే.. సింగరేణిని అదానీకి అప్పచెప్తది.
కాంగ్రెస్‌పై పోరాటం ఇప్పుడే మొదలైంది. ఇంకో నాలుగు రోజులు అయితే సంవత్సరం నిండుతుంది. సంవత్సరీకం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బుద్ధి వచ్చేంతవరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. పోరాటం కొనసాగిస్తం.
– కేటీఆర్
ఒట్లేసిండు.. మాఫీ చెయ్యలే
ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని ఒక్కో జిల్లాల ఒక్కొక్క దేవుడి మీద రేవంత్‌రెడ్డి ఒట్టేసిండు. బాసర సరస్వతి మీద కూడా ఒట్టేసిండు ఆ రుణమాఫీ ఇప్పటికీ పూర్తికాలె. సగం చేసి చేతులు దులుపుకున్నడు. రైతుభరో సానైతే ఇచ్చిందే లేదు. సీఎం ఒక మాట, మంత్రులు మరో మాట చెప్తున్నరు. రుణమాఫీని పక్కదోవ పట్టించేందుకు హైడ్రా పేరుతో పేదల భవనాలను కూలుస్తున్నరు. ఇసొంటి ప్రభుత్వం మాకొద్దు.
– జనార్దన్, రైతు, కుచులాపుర్(తలమడుగు)
రైతులోకం గర్జించింది. హామీల ఎగవేతపై, పథకాల ఎత్తివేతపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆదిలాబాద్ జిల్లాలో గురువారం జరిగిన రైతు నిరసన సభ కాంగ్రెస్ సర్కార్‌పై యుద్ధ ప్రకటనలా కనిపించింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు ప్రభుత్వ తీరుపై రణభేరి మోగించారు. రైతుల్లోని ఆగ్రహం వారి మాటల్లో వ్యక్తమైంది. కేటీఆర్ సైతం చప్పట్లు కొడుతూ వారి ప్రసంగాలకు ప్రతిస్పందించారు.
KTR | ఆదిలాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడాలో ఆదిలాబాద్ రైతు పోరుబాట తోవ చూపెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరి కోతలు ప్రారంభమయ్యాయని, రేవంత్‌రెడ్డి వరికి రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పినా రాలేదని, పత్తి రైతు చిత్తయ్యాడని, రైతు భరోసా రాలేదని, రుణమాఫీ కాలేదని విమర్శించారు. క్వింటాలు పత్తికి రూ.8,800 ఇవ్వకపోతే గులాబీ కండువా వేసుకుని పోయి అధికారులను ప్రశ్నించాలని, బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి అని కాకుండా భారత రైతు సమితి అనే విధంగా కొట్లాడదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతు కుటుంబాలు రోడ్డెక్కి పోలీసుల చేతిలో దెబ్బలు తినే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్‌లో గురువారం రైతు సమస్యలపై నిర్వహించిన నిరసన సభకు హాజరైన కేటీఆర్ మాట్లాడారు. అంతకుముందు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనూ ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీని రాహుల్‌గాంధీ చౌకీదార్ అంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనను బడేభాయ్ అంటారని, అదానీని రాహుల్ ఫ్రాండ్ అంటే.. రేవంత్‌రెడ్డి దోస్త్ అంటారని ధ్వజమెత్తారు. సభకు రైతులు భారీగా వస్తున్నారని, మీ కోసం పోలీసులూ వస్తున్నారని మాజీమంత్రి జోగు రామన్న తనకు ఫోన్ చేసి చెప్పారని, ఎందుకని అడిగితే.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఉట్నూరు స్టేషన్లో కేసు పెట్టారని, జైలుకు ఎత్తుకుపోతారని చెప్పారని పేర్కొన్నారు. రైతులు, ప్రజల కోసం ఏడాది, రెండేళ్లు జైలులో ఉండేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే. గుజరాత్లో పత్తి పండించేది రైతు అయితే తెలంగాణ రైతు రైతుకాదా? గుజరాత్లో క్వింటాలు పత్తికి రూ. 8,800 చెల్లిస్తున్నట్టుగానే ఆదిలాబాద్ రైతులకు కూడా ఇవ్వాలి. లేదంటే బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలను వదిలిపెట్టబోం.
– కేటీఆర్
చిట్టినాయుడు లెక్కే కాదు
తెలంగాణ ఉద్యమంలో రాజశేఖరరెడ్డి, చంద్రబాబు వంటి నాయకులతోనే కొట్లాడామని, ఈ చిట్టినాయుడు ఎంతని ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట ఆదిలాబాద్‌లో ఇండ్లు కూల్చేందుకు వచ్చిన అధికారులతో ఒక్క మాట అన్నందుకు బొడిగం గంగన్న అనే వృద్ధుడిపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు పేదలు, రైతులపై కేసులు పెడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన రుయ్యాడి గ్రామంలో రైతులపై కేసులు పెట్టారని తెలిపారు. రైతుల కోసం తాము కాంగ్రెస్ నాయకులతో కొట్లాడి జైలుకెళ్తామని, రైతులు, ప్రజలు తమకు శక్తినిస్తే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో కొట్టాడినట్టు కొట్లాడతామని చెప్పారు. నాడు తెలంగాణ ఉద్యమంలోనూ ఆదిలాబాద్ ముందున్నదని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. నవంబర్‌లో మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయని, జిల్లా వాసులు అక్కడ ఉన్న తమ బంధువులకు కాంగ్రెస్ మోసాలపై వివరించాలని, కాంగ్రెస్ అడ్డగోలు హామీలను వారికి తెలియజేయాలని కోరారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మంత్రులు ఫోన్ చేయగానే పోలీసులు తొందరపడి ఆగం కావొద్దు. న్యాయంగా, ధర్మంగా నడుచుకోవాలి. పోలీసులు, అధికారులు ఎక్కువ చేస్తే వారి పేర్లు రాసుకుని మిత్తితో సహా తిరిగి చెల్లిస్తాం.
-కేటీఆర్
వారు పార్టీని వదిలినా ఢోకా లేదు
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జనావాసాలకు, రైతు వ్యవసాయ క్షేత్రాలకు దూరంగా స్థలం చూపిస్తే, కాంగ్రెస్ వచ్చాక రైతులకు అన్యాయం జరిగేలా ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. దానిని అడ్డుకునేందుకు తమ పార్టీ పోరాడుతుందని తెలిపా రు. పదేండ్లపాటు అధికారం అనుభవించిన కొందరు సీనియర్లు పార్టీ వదిలిపెట్టి వెళ్లినా బీఆర్ఎస్కు ఎలాంటి ఢోకా లేదని మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డిని ఉద్దేశించి వ్యా ఖ్యానించారు. రైతుభరోసా, రుణమాఫీ చేయనందుకు కాంగ్రెస్ వెంట పడినట్టుగానే పత్తి ధర విషయంలో బీజేపీతో కొట్లాడతామని చెప్పారు. ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రారంభిస్తామని బీజేపీ నేతలు చెప్పారని, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ ఎంపీలు సీసీఐని తెరిపిస్తామని మాటిచ్చారని, ఎమ్మెల్యే చెప్పినా ఏమీకాలేదని విమర్శించారు.
డిక్లరేషన్లు ఏమయ్యాయి?
పంచాయతీ, జడ్పీ ఎన్నికల్లో బీసీ సోదరులకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. సంవత్సరం గడిచినా అమలు కాలేదని, బీసీ సబ్‌ప్లాన్ కింద ఏడాదికి రూ.25 కోట్లు, ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఇస్తానని చెప్పారని, మైనార్టీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, మహి ళా డిక్లరేషన్, యువత డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాపై కేసులు పెట్టడం కాదు.. కల్యాణలక్ష్మిలో భాగంగా ఇస్తామన్న తులం బంగారం ఇవ్వనందుకు సీఎంపై పోలీసులు కేసు పెట్టాలి. రైతు భరోసా, రుణమాఫీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసగించినందుకు చీటింగ్ కేసులు పెడితే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మిగలడు.
-కేటీఆర్
కాంగ్రెస్‌కు సంవత్సరీకం పెడతాం
కాంగ్రెస్‌పై పోరాటం ఇప్పుడే మొదలైందని, ఇంకో నాలుగు రోజులు అయితే సంవత్సరం నిండుతుందని, సంవత్సరీకం పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో రైతుల కోసం మాజీ మంత్రి జోగు రామన్న కదిలారని, అలాగే బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్, ఉమ్మడి జిల్లా నాయకులందరూ కదలాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని, పోరాటం చేస్తామని చెప్పారు. కేసీఆర్ మతం పేరిట రాజకీయాలు చేయలేదని, మనిషిని మనిషిగా చూస్తూ అందరికీ ప్రయోజనాలు అందించినట్టు తెలిపారు. బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్‌కు తోఫాలు, క్రిస్మస్కు గిఫ్ట్‌లు అందజేసినట్టు చెప్పారు. అదానీకి పరిశ్రమలు కట్టబెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, నల్లగొండ జిల్లా రామన్నపేటలో అదానీ సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారని, బెల్లంపల్లిలో ఓరియంట్ సిమెం టు పరిశ్రమను, ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను అదానీకి కట్టబెట్టడానికి చర్యలు చేపట్టిందని విమర్శించారు. సింగరేణినీ అదానీకి అప్పచెప్తారని, పరిశ్రమల విషయంలో మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, కోవ లక్ష్మి, సంజయ్, కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న పాల్గొన్నారు.
మా రైతులను రేవంత్ మోసం చేసిండు
రేవంత్‌రెడ్డి మమ్మల్ని మోసం చేసిండు. రుణమాఫీ చేస్తానని, రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు వేస్తానని ఎన్నికల్లో మాయమాటలు చెప్పాడు. ఇప్పుడు రబీ, ఖరీఫ్ సమయం వెళ్లిపోతున్నా రైతు భరోసా ఇవ్వడం లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకోసారి రైతుబంధు డబ్బులు బ్యాంకులో జమ అయ్యేవి. కేసీఆర్ లాంటి దేవుడిని ఓడగొట్టుకుని రైతులందరం బాధపడుతున్నం. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే రైతులు ఆనందంగా ఉంటారు. అందుకే మేము రైతు పోరుబాటుకు వచ్చాం.
– భూమారెడ్డి, రైతు, కాప్రి గ్రామం, జైనథ్ మండలం, ఆదిలాబాద్
రైతుభరోసా ఎక్కడ సార్?
రైతు భరోసా ఇప్పటి వరకు రాలే. రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్ వచ్చినప్పుడు బాసర సరస్వతి దేవిపై ఒట్టువేశారు. ఆగస్టులో కొంత రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నారు. సీఎం ఒక మాట, మంత్రులు ఒక మాట చెప్తున్నరు. రుణమాఫీని పక్కదోవ పట్టించేందుకు హైడ్రా పేరుతో పేదల భవనాలను కూలుస్తున్నరు. ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు.
– జనార్దన్, రైతు, కుచులాపుర్ గ్రామం, తలమడుగు మండలం, ఆదిలాబాద్