KTR | రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఢిల్లీకి బస్తాలు మోసే ఉన్న శ్రద్ధ.. ఎరువుల బస్తాలు తెప్పించే విషయంలో రేవంత్‌కు లేదని తేలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే తాపత్రయం, కేసులు పెట్టేదాంట్లో ఉన్న తాపత్రయం.. సిగ్గులేకుండా తెల్లవారి లేస్తే ఇష్టం వచ్చినట్లు కేసీఆర్‌పై మాట్లాడే మాటల విషయంలో ఉండే ఆరాటం రైతులకు సాయం చేసే విషయంలో లేదు. మేం ఏం మాట్లాడినా ఒంటికాలితో మాపైకి లేచే బీజేపీ.. ఇవాళ రైతులు ఇంత అవస్థల్లో ఉంటే స్పందించడం లేదు. ఒక్క కేంద్రమంత్రి, ఒక్క ఎంపీ మాట్లాడడు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని అడగడు. కేంద్రం ఎంత ఎరువులు ఇచ్చిందో చెప్పే పరిస్థితి కూడా కేంద్రమంత్రులు, రాష్ట్రంలోని బీజేపీకి లేకపోవడం అనేది సిగ్గుచేటు. పక్కనే ఏపీలో మంత్రులు ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో ఉన్న మంత్రులను పట్టుకొని ఎరువులు తెచ్చుకుంటున్నరు. సీఎం 51సార్లు వెళ్లినా ఇప్పటి వరకు 51 బస్తాలు అదనంగా రాలేదు’ అన్నారు.
‘ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అని మేం ఎప్పుడో చెప్పాం. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్రమంత్రులు ఇవాళ రైతులకు సాధించింది గుండుసున్నా. కాంగ్రెస్, బీజేపీ రైతులను, ఎరువుల విషయంలో మోసం చేయడంలో దొందూ దొందే అని తేలిపోయింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మంచిగానే ఇస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పంచడం లేదు.. ఇక్కడికి వచ్చాక యూరియా ఏమవుతుందోనని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ చెబుతున్నడు. అంటే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందని చెబుతున్నవా? కాంగ్రెస్ నేతలు మధ్యలోనే యూరియా తింటున్నరని చెబుతున్నవా? తింటుంటే మీ ప్రభుత్వం ఏం చెబుతున్నది మేం అడుగుతున్నం. పార్లమెంట్లో తగినంత మొత్తంలో సరఫరా చేశామని చెబుతున్నరు.
మరి బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందా? మరి కేంద్ర వ్యవసాయశాఖ, కేంద్రంలోని సంస్థలు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు కంపెనీలకు లాభం చేకూరేలా కుమ్మక్కైనట్లుగా వ్యవహారం చేస్తున్నట్లుగా అనుమానం. కావాలని కొంతమందికి లాభం చేసేందుకే ఈ వైఖరి అవలంభిస్తున్నారని అనుమానం. ఈ విషయంలో దర్యాప్తు జోక్యం చేసుకొని వెంటనే స్పందించాలని కోరుతున్నాం. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందుకు వస్తే వారికి సకల సదుపాయాలు కల్పించింది మా ప్రభుత్వం. మా ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించినా ఆ ఫ్యాక్టరీ ఫుల్ కెపాసిటీతో పని చేయడం లేదు. మనదగ్గరే ఫర్టిలైజర్ ఉత్పత్తై.. కొరత ఉండడం అనేది సిగ్గుచేటు కాబట్టి.. ఈ విషయంలో వెంటనే కేంద్రం స్పందించి సమీక్ష చేసి ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలి’ కేటీఆర్ కోరారు.