ఇందిరమ్మ రాజ్యం తెస్తానన్న రేవంత్ బుల్డోజర్ రాజ్యం తెచ్చిండు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి శని, ఆదివారాల్లో పేదల ఇండ్లపైకి హైడ్రా బుల్డోజర్లను పంపుతూ అరాచకం సృష్టిస్తున్నడు. చెరువు శిఖం భూముల్లో ఉన్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి, మంత్రులు వివేక్, పొంగులేటి, కాంగ్రెస్ నేతలు కేవీపీ, మహేందర్‌రెడ్డి ఇండ్లను వదిలి పేదల నివాసాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నరు.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం.. హస్తం పార్టీ ముసుగులో ఆర్ఎస్ఎస్ పాలన నడుస్తున్నదని, జెండా కాంగ్రెస్‌దైతే ఎజెండా బీజేపీదని, బడే భాయ్, చోటే భాయ్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం కొనసాగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 11 ఏండ్లుగా అధికారంలో ఉంటూ, ఎనిమిదేండ్లుగా జీఎస్టీ పేరిట ప్రజలకు వాతలు పెట్టిన మోదీ..ఇప్పుడు తగ్గించి పండుగ చేసుకోవాలనడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. అంతర్జాతీయస్థాయిలో చమురు ధరలు తగ్గినా మనదేశంలో మాత్రం మోదీ చమురు ధర తగ్గించలేదని చెప్పారు.
సోమవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ బూత్‌స్థాయి మీటింగ్‌కు కేటీఆర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో అన్ని రంగాలు, సబ్బండ వర్గాలు మోసపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆచరణలో మాత్రం విఫలమైందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 700 రోజులైనా యువతులకు స్కూటీలు ఇవ్వలేదని, పింఛన్లు పెంచలేదని ఫైర్ అయ్యారు. నిధుల్లేవని సాకులు చెప్తూ తప్పించుకొనే ప్రయత్నం చేస్నున్నదని విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ఆపలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క పథకం కూడా అమలు కావడం లేదని విమర్శించారు.
ఓట్ల కోసం పచ్చని తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ చిచ్చు పెడుతున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఏ చిన్న మతకలహాలు జరగలేదని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్‌లో ఆయన గతంలో మొక్కిన దర్గానే కూల్చివేయించారని దుయ్యబట్టారు. బీజేపీ మెప్పు కోసమే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ఇవ్వాలని అడిగిన ఉద్యోగులతో తనను కోసుకొని తిన్నా నయాపైసా రాలదని చెప్పడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇలాంటి సీఎంకు ఓటుతో జూబ్లీహిల్స్‌లో బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
జీఎస్టీ తగ్గించినం పండుగ చేసుకోండని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉన్నదని, మోదీ ఏం ఉద్ధరించారని పండుగ చేసుకోవాలని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ మాటలు చెప్పడం తప్ప చేసిందేమీలేదని విమర్శించారు. ఆయనకు నిజంగా ఈ దేశంపై ప్రేమ ఉంటే అమెరికా పెంచిన హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఎనిమిదేండ్లుగా జీఎస్టీ పేరిట పన్నుల భారం మోపి పేదలను మోసం చేసిన ఆయన ఇప్పుడు తగ్గించి ఏదో సాధించినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని, నిజంగా ప్రధానికి చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే గ్యాస్ సిలిండర్, పెట్రోల్‌పై ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.