KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : వరదల సమయంలో అప్రమత్తంగా ఉండి పరిస్థితిని అదుపుచేయాల్సిన ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఖమ్మంలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నదని, ఆ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని ఆదివారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన ప్రజలు ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలో వీధుల్లోకొచ్చి నిరసనకు దిగారని చెప్పారు. వరదలతో ఇబ్బందులు పడుతూ కనీస సాయం కోసం ప్రజలు ఇలా ఆందోళన చేయడమంటే ప్రభుత్వం ఎంత ఉదాసీన వైఖరితో ఉన్నదో అర్థం చేసుకోవచ్చునన్నారు.
స్పందించినవారికి అభినందనలు
భారీ వరదలు, వర్షాల సందర్భంలో సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులపై చురుగ్గా స్పందించిన బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు, విద్యుత్తు సిబ్బందిని కేటీఆర్ అభినందించారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ సామల హేమ, నార్నే శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ వాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా కాపాడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లను అభినందించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సామాన్యుడిని కాపాడారని వారి దైర్యసాహసాలకు ఎక్స్ వేదికగా కొనియాడారు. తీవ్ర ప్రతికూల వాతావరణం ఉన్నా విద్యుత్తు పునరుద్ధరణ కోసం సిబ్బంది అద్భుత పనితీరు కనబరుస్తున్నారని కేటీఆర్ అభినందించారు. ఎన్పీడీసీఎల్ ఉద్యోగి కరెంటు పోల్ ఎక్కి విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేస్తున్న వీడియో చూసి అతడిని అభినందించారు.వరదల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న అవసరార్థులకు సాయం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.