హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో అన్నింటా రైతన్నకు అగచాట్లు తప్పడం లేదని, దుక్కి దున్నే సమయం నుంచి పంట కొనుగోలు దాకా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరులో పల్ల్లీ, వైరాలో మిర్చి, బయ్యారంలో కరంటు, జగిత్యాలలో యూరియా కోసం ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రైతులు సర్కార్‌పై నిరసన తెలుపుతున్న దృశ్యాలను ఏకరువు పెట్టారు.
దశాబ్దాల కాం గ్రెస్ పాలనలో దగాపడ్డ రైతన్న బతుకును కేసీఆర్ పదేండ్ల పాలన దరికి చేర్చి వెలుగులు నింపితే, ఇప్పు డు మళ్లీ కాంగ్రెస్ పాలన ఆ వెలుగులను చీకటి చేస్తున్నదని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కరంటు, యూరియా, సాగునీరు, కొనుగోళ్లు ఇలా ప్రతీ సందర్భంలో రైతులు ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఏడాది కాంగ్రెస్ పాలన.. ఎదురుచూపుల పాలన.. ఎట్లుండె తెలంగాణ,. ఎట్లాయె తెలంగాణ’ అని పేర్కొన్నారు.