అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం పథకాల జాతరకు తెరలేపిన కాంగ్రెస్ ఇప్పుడు పల్లెపల్లెనా చెప్పుల జాతరను తెరపైకి తెచ్చింది. యూరియా కోసం అన్నదాతలు క్యూలలో పడిగాపులు పడుతుంటే రేవంత్ సర్కారు నిద్రమత్తులో మునిగితేలుతున్నది.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తేతెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా చెప్పుల జాతరకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పంగనామాలు పెట్టడం తప్ప చేసిందేమీ లేదని విరుచుకుపడ్డారు. రైతులకు యూరి యా పంపిణీలో విఫలమైన ప్రభుత్వం, నిధుల్లేవనే సాకుతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. సోమవారం తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని వెంగళరావునగర్ డివిజన్ బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కళకళలాడిన మహానగరం రేవంత్ పాలనలో కళ తప్పిందని నిప్పులు చెరిగారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం మూటలు పంచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. ‘రేవంత్ పాలనలో వీధి దీపాలు వెలగడం లేదు, చెత్త ఎత్తే నాథుడు లేడు, రోడ్లపై గుంతలు పూడ్చే పరిస్థితిలేదు, మురుగు కాలువలు శుభ్రం చేయడంలేదు’ అంటూ తూర్పారబట్టారు.
ఆదివారం నాటి వరదల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినా సర్కారులో చలనం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం పథకాల జాతరకు తెరలేపిన కాంగ్రెస్ ఇప్పుడు పల్లెపల్లెనా చెప్పుల జాతరను తెరపైకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. యూరియా కోసం అన్నదాతలు క్యూలలో పడిగాపులు పడుతుంటే రేవంత్ సర్కారు నిద్రమత్తులో మునిగితేలుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతిలో మునిగితేలిన హస్తం పార్టీ నేతలు యూరియాను సైతం బ్లాకుల్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ‘మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గన్‌మెన్ లారీ యూరియాను ఎత్తుకుపోతే, ఎమ్మెల్యేలు, మంత్రులు కనీసం ఓ గోదాం యూరియా అన్నా అమ్ముకోరా? ప్రజలు కాంగ్రెస్ దోపిడీని అర్థం చేసుకోవాలి’ అని కోరారు.
కాంగ్రెస్ సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఎగనామం పెట్టడంతో రాష్ట్రంలోని 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ సర్కారు చేతగానితనంతో పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకొనే కాలేజీలు మూతపడే ప్రమాదమున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో రూ. 3 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించడంతో పాటు రూ. 17 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తుచేశారు.
‘మాది వందేండ్ల చరిత్ర కలిగిన పార్టీ. ఒడ్డు, పొడుగు కలిగినోళ్లం.ఆదాయం పెంచడం, సంక్షేమ పథకాలు ఇవ్వడమెలాగో మాకు తెలుసు’ అని నాడు గప్పాలు కొట్టి గొప్పలు చెప్పిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేడు ఖజానాలో నిధుల్లేవని సాకులు చెప్తున్నారని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు కమీషన్లు ఇచ్చి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు పేద విద్యార్థుల ఫీజులు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన మంచి పథకాన్ని కేసీఆర్ సర్కారు కొనసాగించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తూట్లు పొడుస్తున్నదని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట మేరకు రీయింబర్స్మెంట్ చెల్లించకుంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే పార్టీ మారినా అచ్చంపేట కార్యకర్తలు మాత్రం బీఆర్ఎస్లోనే కొనసాగడం సంతోషకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. సోమవారం తెలంగాణ భవన్లో అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన 300 మంది నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాయకులు పార్టీ మారినంతా మాత్రాన కార్యకర్తలు పార్టీని విడిచి పెట్టిపోరు అనే గొప్ప సందేశాన్ని అచ్చంపేట కార్యకర్తలు ఇచ్చారని చెప్పారు.
వారి స్పందన చూసిన తర్వాత భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా పార్టీని విడిచిపోరనే విశ్వాసం కలుగుతున్నదని తెలిపారు. 22 నెలల పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని, చివరకు ఆయన సొంత గ్రామంలోని మాజీ సర్పంచ్‌ను వేధించి.. అతడి ఆత్మహత్యకు కారణమయ్యారని విమర్శించారు. త్వరలోనే తాను అచ్చంపేటలో పర్యటిస్తానని వెల్లడించారు. కార్యకర్తలు సమరోత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తెచ్చిన మంచి పథకాన్ని కేసీఆర్ సర్కారు కొనసాగించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తూట్లు పొడుస్తున్నది. ఇప్పటికైనా ఇచ్చిన మాట మేరకు కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. లేదంటే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తాం.
-కేటీఆర్
కేసీఆర్‌పై కోపంతోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆయన తెచ్చిన పథకాలకు ఎగనామం పెడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను కేసీఆర్ కొనసాగించారని గుర్తుచేశారు. ‘ప్రస్తుత సర్కారు కేసీఆర్‌పై అక్కసుతో కేసీఆర్ కిట్‌ను కట్ చేసింది. బతుకమ్మ చీరలను బంద్పెట్టింది. రంజాన్ తోఫాను ఎగ్గొట్టింది. క్రిస్మస్ కానుకకు మంగళంపాడింది. రైతుబంధు ఎగ్గొట్టింది. రుణమాఫీ పేరిట దగా చేసింది’ అని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ రాగానే పింఛన్ డబ్బులను రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘అత్తకు నాలుగు వేల పింఛన్ ఇత్తం. కోడలుకు నెలకు రూ. 2,500 ఇత్తం అని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అత్తా కోడళ్ల మధ్య పంచాయితీ పెట్టారు’ అని మండిపడ్డారు. కొత్త కోడలు వస్తే నెలకు రూ. 2,500 వస్తాయని సంతోషపడిన అత్త, నెలనెలా అత్తమ్మకు నెలకు రూ. 4 వేల పింఛన్ వస్తుందని సంబురపడిన కోడలు ఆశలను అడియాశలు చేశారని ధ్వజమెత్తారు.
అడ్డగోలు మాటలు, పచ్చి అబద్ధాలు చెప్తూ రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. నాడు ఓట్ల కోసం, ఇప్పుడు సీటును కాపాడుకొనేందుకు మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. ‘సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉన్నాయనుకొన్నానని, ఢిల్లీకి వెళ్తే ఎవరూ నమ్మడం లేదని, బ్యాంకుల వద్దకు అప్పుల కోసం వెళ్తే చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని, వేతనాలు అడిగిన ఉద్యో గులతో తనను కోసుకొని తిన్నా నయాపైసా రాలదు, నిలదీసిన ప్రతిపక్ష నాయకుల నుద్దేశించి పేగులు తీసి మెడలో వేసుకుంటానని, గుడ్లు పీకి గోలీలాడుకుంటానని’ ఇలా తలాతోకలేని వ్యాఖ్యలతో ఇజ్జత్ తీస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో ముందున్న తెలంగాణను రేవంత్‌రెడ్డి తెలివిలేని పాలనతో దివాలా తీయిస్తున్నారని తూర్పారబట్టారు. ఇప్పటికైనా హామీలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
తన రాజకీయ ప్రయాణం కేటీఆర్తోనేనని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని తాను గతంలోనూ చెప్పానని, ఇప్పుడూ అదే చెప్తున్నానని పేర్కొన్నారు. ‘ఆయన (కేటీఆర్)కు ప్రమోషన్ ఉంటుంది. నాకూ ప్రమోషన్ ఉంటుంది’ అని చెప్పారు. నవరాత్రి వేడుకలకు ఆహ్వానించేందుకు మాత్రమే తాను కవితను కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయ కారణం లేదని వెల్లడించారు.
ఒక ఆలయ ట్రస్టీగా విష్ణువర్ధన్‌రెడ్డి దసరా నవరాత్రుల సందర్భంగా అందరినీ ఆహ్వానించడం ఆనవాయితీ అని, అందులో భాగంగానే ఆయన జాగృతి నాయకురాలు కవితను ఆహ్వానించేందుకు కలిశారని, ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు సోహైల్ స్పష్టంచేశారు. అంతమాత్రన ఆయన పార్టీ మారుతున్నారనే వదంతులు సరికాదని చెప్పారు.