భైంసా/భైంసాటౌన్,/కుంటాల, మే, 16 : ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుంటాలలో భూభారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి సీతక్కను బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు అడ్డుకోవడానికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నర్సాపూర్ (జీ) పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు కిరణ్ కొమ్రేవార్, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరిట క్వింటాల్‌కు 5 కిలోలు కోత విధించడం అన్యాయమని అన్నారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు బందైపోయిందని విమర్శించారు. కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అరెస్టయిన బీఆర్ఎస్ నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్నందుకు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దని సూచించారు. మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోలీస్‌స్టేషన్ నుంచి 2 గంటల్లో విడుదల చేయకపోతే బీఆర్ఎస్ లీగల్ టీంను పంపిస్తానని కేటీఆర్ భరోసానిచ్చారు.