మూసీ నదిని పణంగా పెడుతూనే సుందరీకరణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నడు. మూసీ పేరుతో వేలకోట్ల దోపిడీ చేయాలన్న ఆలోచనే తప్ప నిజంగా నది పరిరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.దేశ రక్షణ విషయంలో తెలంగాణ ముందుంటుంది. జనావాసాలు లేనిచోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని వికారాబాద్ అడవుల్లో ఏర్పాటు చేసి నష్టం
కలిగిస్తామంటే అంగీకరించే ప్రసక్తే లేదు.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నావికాదళానికి (నేవీకి) సంబంధించిన వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఓవైపు మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్తూనే మరోవైపు మూసీ నదిని పూర్తిగా ప్రమాదంలో పడేసే రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలుపడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది ద్వంద్వ వైఖరి కాదా? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. ఏ ప్రయోజనాలు ఆశించి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో దీనిని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని తేల్చిచెప్పారు.
పదేండ్లు నిలువరించాం
దామగుండంలో రాడార్ ఏర్పాటుతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. దాదాపు 2,900 ఎకరాల అటవీ ప్రాంతంలో 12 లక్షల చెట్లను నేలమట్టం చేసి ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాల్సిన రాడార్ కేంద్రాన్ని తెలంగాణలోనే ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరిరక్షణ అని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ మూసీనే ప్రమాదంలోకి నెట్టే ప్రాజెక్ట్‌కు ఎందుకు అంగీకరించారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా అంగీకారం తెలుపలేదని గుర్తుచేశారు.
అక్కడో న్యాయం.. ఇక్కడో న్యాయమా?
గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం ఎకోసెన్సిటివ్ జోన్‌గా ప్రకటించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేస్తూ ‘గంగోత్రికి ఓ న్యాయం.. మా మూసీ నదికి మరో న్యాయమా?’ అని ప్రశ్నించారు. రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే వికారాబాద్ అడవుల్లోనే మూసీ జన్మస్థానం ఉన్నదని, నది పుట్టిన ప్రాంతాన్ని ‘ఎకోసెన్సిటివ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేవీ రాడార్ ఏర్పాటుతో మూసీ నది అంతర్థానమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సోర్స్ అఫ్ ద రివర్’పై రాడార్ ప్రాజెక్టు గొడ్డలిపెట్టు వంటిందని తెలిపారు. మూసీ నది పురుడు పోసుకున్న చోట 12 లక్షల చెట్ల నరికివేతతో కోలుకోలేని అనర్థం జరుగుతుందని హెచ్చరించారు. పర్యావరణ సమతుల్యతకు పెనుప్రమాదాన్ని సృష్టించే రాడార్ ప్రాజెక్ట్‌ను విరమించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రాడార్‌కు వ్యతిరేకంగా పోరుబాటే
మూసీ నదిని పణంగా పెట్టేందుకు సహకరిస్తూ మరోవైపు మూసీ పరిరక్షణ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ పరిరక్షణ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాడార్ నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం తెలిపేది కాదని పేర్కొన్నారు. మూసీ పేరుతో వేలకోట్ల దోపిడీ చేయాలన్న ఆలోచనే తప్ప నిజంగా నది పరిరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. రాడార్ కేంద్రానికి వ్యతిరేకంగా పర్యావరణ వేత్తలతో కలిసి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో హరితహారంతో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచింది. రేవంత్‌రెడ్డి రాగానే దామగుండంలో దాదాపు 2,900 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్‌కు అంగీకారం తెలిపిండు.
-కేటీఆర్