హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైడ్రాను మొదట స్వాగతించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందన ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. లగచర్ల ఘటన నుంచి ప్రజలను దృష్టిమళ్లించేందుకే కిషన్‌రెడ్డి మూసీ నిద్ర అని కొత్త నాటకమాడుతున్నారని ఆదివారం ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా బీజేపీ ఉన్నదని, ఆ రెండు పార్టీలవి తోడుదొంగల నాటకమని ధ్వజమెత్తారు.
మూసీ బాధితులకు భరోసా ఇచ్చి, బుల్డోజర్లను అడ్డుకుంటామని మొదటి నుంచీ స్పష్టం చేస్తున్నది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డికి అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుకఉన్న మతలబేంటని ప్రశ్నించారు. రేవంత్‌ను కాపాడటం కోసమే కిషన్‌రెడ్డి డైవర్షన్ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. లగచర్ల రైతులను బీజేపీ విస్మరించిన చరిత్రను, కుట్ర రాజకీయాలను తెలంగాణ సమాజం గమనిస్తున్నదని, సమయం వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీల బండారాన్ని బయటపెడుతుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అంటున్నడు.. దేనికి ఏఐసీసీ సంతృప్తి చెందింది? రైతులకు సంకెళ్లు వేసినందుకా? బలవంతంగా భూములు గుంజుకుంటున్నందుకా? మూసీ పేరిట వేల ఇండ్ల కూల్చివేతకు సిద్ధమైనందుకా? హైడ్రాతో పేదలను భయపెడుతున్నందుకా? సబ్బండ వర్గాలను దగా చేసి తెలంగాణను ఆగం చేసినందుకా? దేనికి ఏఐసీసీ సంతృప్తి చెందింది?
-కేటీఆర్
అదానీ, అంబానీలపై రాహుల్ గాంధీ పోరాటం బూటకమేనని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో తమ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బలవంతపు భూ సేకరణను అడ్డుకోకుండా రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా భూసేకరణపై రణగర్జన వినిపిస్తే ఏం లాభమని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీది, బీజేపీది కుమ్మక్కు రాజకీయం.. నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అనే ఒప్పందం.. కుమ్మకు రాజకీయంలో ఇదో రహస్యం.. అదానీ, అంబానీలపై రాహుల్‌గాంధీ పోరాటం ఓ బూటకం.. తెలంగాణకు కాంగ్రెస్ తరతరాల దరిద్రం’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
హైడ్రాను మొదట స్వాగతించింది.. సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించిందీ కిషన్‌రెడ్డి, బీజేపీయే.. రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం.. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం..వారెవ్వా తోడు దొంగల నాటకం.. అకస్మాత్తుగా బీజేపీకి మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనకున్న మతలబేంటి? ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? ఎవరిని వంచించడం కోసం?
-కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఏఐసీసీ సంతృప్తి చెందిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో పాలన ఉన్నదా? అని ప్రశ్నించారు. ‘ఏఐసీసీ దేనికి సంతృప్తి చెందింది? అమాయకులైన అన్నదాతలను జైల్లో పెట్టినందుకా? కొనుగోలు కేంద్రాల్లో రైతులను బలిపశువులను చేస్తున్నందుకా? ఏడాది గడుస్తున్నా గ్యారెంటీ కార్డును పాతాళంలో పాతిపెట్టినందుకా? రెండు లక్షల ఉద్యోగాల హామీని గాలికి వదిలేసినందుకా? రాష్ట్రంలోని సకల రంగాలను, సబ్బండ వర్గాలను దగా చేసి తెలంగాణను ఆగం చేసినందుకా?.. లేక ఢిల్లీకి అందుతున్న వేల కోట్ల మూటలను చూశా?’ అని నిలదీశారు. ఎంత మురిసిపోయినా మాటిచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రిని, గ్యారెంటీ కార్డు ఇచ్చి గారడీ చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం విడిచిపెట్టదని, కనికరం లేని కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెడుతుందని హెచ్చరించారు.
అదానీ, అంబానీలపై రాహుల్‌గాంధీ పోరాటం అంతా బూటకం.. తెలంగాణలో బలవంతపు భూసేకరణను అడ్డుకోకుండా దేశవ్యాప్తంగా భూ సేకరణపై రాహుల్‌గాంధీ రణగర్జన వినిపిస్తే ఏం లాభం? తెలంగాణలో భూసేకరణను మీ రణగర్జన ఎందుకు అడ్డుకోలేకపోయింది? కొడంగల్ రైతుల కన్నీటికి ఎందుకు కారణమైంది? అదానీ, అంబానీలపై మీ జంగ్.. రామన్నపేటలో అదానీ ఫ్యాక్టరీకి ఎందుకు ద్వారాలు తెరిపించింది?
-కేటీఆర్