రాష్ట్రంలో వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పలు చెప్తుంటే మరి ఆదాయం ఎట్ల తగ్గింది? బంగారం లాంటి రాష్ర్టాన్ని అప్పజెప్తే, క్యాన్సర్ అంటూ మాట్లాడి రేవంత్ సర్వనాశనం చేసిండు. ఏ రంగాల్లో వృద్ధి పెరిగిందో ఈ బడ్జెట్లో చెప్పాలె. రాష్ర్టానికి రూ.71 వేల కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పి బడ్జెట్‌కు ముందే రేవంత్ తన నేరాన్ని అంగీకరించి అప్రూవర్‌గా మారిండు.
– కేటీఆర్
ఓ వైపు రైతులు, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలతో అల్లాడుతున్న రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించటం సిగ్గుచేటు. ఆ అందాల పోటీలతో ఊరూరా బ్యూటీపార్లర్లు ఏమైనా పెడుతరా? వాటి వల్ల ఎవరికి లాభమో సీఎం, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలె. రాష్ట్రం తీవ్ర కరెంట్, వ్యవసాయ సంక్షోభంలో చికుకుంటే.. సర్కారు ఫోకస్ మొత్తం అందాల పోటీల మీద పెట్టడం విషాదకరం.
-కేటీఆర్
KTR | హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): రైజింగ్ తెలంగాణ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వంలో రూ.71 వేల కోట్ల ఆదాయం ఎందుకు తగ్గిందో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘తెలంగాణ రైజింగ్ అంటూనే ఈ తగ్గింపు ఏమిటి? ఇది ముమ్మాటికీ తెలంగాణ ఫాలింగ్. ఇంతకంటే రాష్ర్టానికి ఘోరమైన అవమానం ఇంకోటి ఉండదు’ అని ధ్వజమెత్తారు. బంగారం లాంటి తెలంగాణను క్యాన్సర్‌తో పోలుస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రేవంత్ అనుసరిస్తున్న తీరును, చేస్తున్న పాలనను తూర్పారబట్టారు. రాష్ట్ర ఆదాయం రూ.71 వేల కోట్లు తగ్గినట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రే ఒప్పుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో వ్యవసాయం, పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్నాయని ప్రభుత్వం గొప్పగా చెప్తుంటే మరి ఈ అదాయం ఎలా తగ్గిందని ప్రశ్నించారు. బడ్జెట్ కన్నా ముందే రేవంత్‌రెడ్డి నేరాన్ని అంగీకరించి అప్రూవర్‌గా మారారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిందని తన ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని ముఖ్యమంత్రే ఒప్పుకొన్నారని ఉదహరించారు. సీఎం రేవంత్‌కు నిర్మించటం చేతకాదని, కూలగొట్టడమే తెలుసని ఎద్దేవా చేశార. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే తెలివి సీఎంకు లేదని దెప్పిపొడిచారు. ‘గాల్లో మేడలు కట్టడం లేదు. మేము వాస్తవిక బడ్జెట్ పెడ్తున్నమని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార గొప్పగా చెప్పిండ్రు. కానీ, జరుగుతున్నదేమిటి?’ అని ప్రశ్నించారు.
అసెంబ్లీలో విలువలు అని చిలక పలుకులు మాట్లాడిన రేవంత్.. స్టేషన్ ఘన్‌పూర్‌లో బజారు భాష మాట్లాడిండు. మాకు అంతకన్నా దిగజారుడు భాష తెలుసు. మేము తలుచుకుంటే రేవంత్ బట్టలు విప్పగలం. రేవంత్ దాటిన రేఖలు.. తారలు.. వాణీల గురించి మాట్లాడగలం. మేము నోరు విప్పితే రేవంత్‌కు ఇంట్లో అన్నం కూడా పెట్టరు. మేమూ సాగర్ సొసైటీ, మైహోం భుజా వ్యవహారాల గురించి మాట్లాడగలం. ఇంకా ఎకువ మాట్లాడితే ఫొటోలు కూడా బయట పెడుతం. రేవంత్ సెల్ఫ్ డ్రైవింగ్ కథలు, ప్రైవేట్ కార్ల వివరాలన్నీ చెప్తం.
-కేటీఆర్
రైతు ఆత్మహత్యలతో రాష్ట్రం అల్లాడుతుంటే అందాలాపోటీలా? అని కేటీఆర్ నిలదీశారు. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో పెట్టడం వల్ల రాష్ర్టానికి కలిగే లాభం ఏమిటని ప్రశ్నించారు. ‘రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి, అందాల పోటీలు పెడతారా? మింగ మెతుకు లేదు. మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఉన్నది అందాల పోటీల కథ’ అని ఎద్దేవా చేశారు. రూ.46 కోట్లతో ఫార్ములా ఈ-రేసుతో రాష్ర్టానికి పెట్టుబడులు వస్తాయని చెప్పినా వినకుండా అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు రూ.250 కోట్లతో అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేస్ వల్ల రాష్ర్టానికి జరిగిన లాభం గురించి తాను వివరించానని చెప్పారు. ఫార్ములా ఈ-రేస్ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయటం వల్ల రాష్ర్టానికి రూ.46 కోట్లు నష్టం జరిగిందని, అందుకు రేవంత్ కారణమని ధ్వజమెత్తారు. ఒప్పందం రద్దుతో రాష్ట్ర ఖజానాకు నష్టమని తెలిసినా కావాలనే రేవంత్ రద్దు చేశారని విమర్శించారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, ఫార్ములా ఈ రేసు రద్దుపై విచారణ చేపడతామని వెల్లడించారు. అందాల పోటీలకు పెట్టే సొమ్ముతో బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవచ్చని, ఆడబ్డిలకు ఇచ్చిన హామీనైనా నిలబెట్టుకోవచ్చని సూచించారు.
రేవంత్ ఇప్పుడు నీతి సూత్రాలు మాట్లాడుతున్నారని, విషయం తనదాకా వస్తేగాని తెలియదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం, కుటుంబ సంబంధాలు, పరువు, ప్రతిష్ట వంటి భారీ డైలాగులు కొడుతున్న రేవంత్‌రెడ్డి గతంలో చేసిందేమిటో చెప్పాలని నిలదీశారు. ‘రేవంత్‌కు ఈ రోజు కుటుంబం గుర్తుకొచ్చిందా? మరి మాకు సంబంధాలు అంటగట్టినప్పుడు.. మా పిల్లలను రాజకీయాల్లోకి లాగి నానా మాటలు అన్నప్పుడు ఆ విలువలు గుర్తుకు రాలేదా?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్ మీద ఉన్న కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి పంటలను ఎండబెట్టడం వల్లే ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి కాంట్రిబ్యూషన్ తగ్గిందని కేటీఆర్ చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని వివరించారు. పట్టణాలు, గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణం పూర్తిగా రేవంత్‌రెడ్డేనని విమర్శించారు. బడ్జెట్లో కోతతో ఈ నిజం కాబోతున్నదని చెప్పారు. కేసీఆర్‌పై ద్వేషంతో వ్యవసాయాన్ని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఏడాది నుంచీ రేవంత్ చేసిందంతా నెగటివ్ పాలిటిక్స్, అక్రమ నిర్బంధాలు, తెలంగాణకు కాన్సర్ అంటూ రాష్ట్ర పరువు తగ్గించడం వంటి అడ్డమైన మాటల వల్లే రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది’ అని వాపోయారు.
రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సీఎం అయిన తొలి ఏడాదిలోనే అన్ని రంగాల్లో ఫెయిల్ అయిండని తన మాటలతోనే తేలిపోయిందని ఎద్దేవాచేశారు. ఎలాంటి ఆర్థిక మాంద్యం లేకుండానే, కొవిడ్ వంటి సంక్షోభం లేకుండానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రంతో బీఆర్ఎస్ నిత్యం తగువు పెట్టుకోవటం వల్ల రాష్ర్టానికి ప్రయోజనాలు దక్కకుండా పోయాయని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇవ్వాళ కేంద్రంతో మంచిగా ఉండి తెలంగాణకు అదనంగా తెచ్చిందేమిటని నిలదీశారు.
తెలంగాణ ప్రజలు విచక్షణతో యోచించి తమకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, ఫలితంగా కేసీఆర్ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశారని కేటీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆగమైతది. వీళ్లకు ఉద్యమాలు చేయటం తప్ప పరిపాలించటం చేతకాదు. వారికి నాయకత్వ లక్షణాలు లేవు’ అని నాడు సమైక్యాంధ్రనేతలు పేర్కొన్నట్టే రేవంత్‌రెడ్డి నిరూపిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ 2014లో రేవంత్‌రెడ్డే అధికారాన్ని చేపట్టి ఉంటే తెలంగాణను విఫల రాష్ట్రంగా చేసేవాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి పాలన చూస్తుంటే సమైక్యాంధ్ర పాలకుల ఆరోపణలను నిజం చేస్తున్నాడనే ఆందోళన కలుగుతున్నదని వాపోయారు.
రేవంత్‌కు ఈ రోజు కుటుంబం గుర్తుకొచ్చిందా? మాపై దారుణంగా, అసహ్యంగా మాట్లాడారు. ఆయనకు కుటుంబాలు, ఫ్యామిలీలు లేవా? అని రేవంత్ ఇప్పుడు మాట్లాడుతున్నడు. మరి మాకు సంబంధాలు అంటగట్టినప్పుడు.. మా పిల్లలను రాజకీయాల్లోకి లాగి నానా మాటలు అన్నప్పుడు ఆ విలువలు గుర్తుకు రాలేదా?
– కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డికి గాసిప్స్ మీదున్న దృష్టి గవర్నెన్స్ మీద లేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ ముఠా టీడీఆర్ సాం చేయబోతున్నదని చెప్పారు. తాను చెప్పేది నిజమో కాదో రేవంతే చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవర్సీస్ సాలర్ షిప్‌ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో ఎండగట్టారని పేర్కొన్నారు. విదేశాల్లో చదువుకోడానికి వెళ్లిన 7 వేల మందికి పైగా తెలంగాణ బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి బాధలను తాము అసెంబ్లీ దృష్టికి తెచ్చామని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తనకు అవకాశం ఉన్నప్పుడు ఒకరకంగా, లేనప్పుడు మరోరకంగా జర్నలిస్టుల పట్ల వ్యవహరించటం రేవంత్‌కు అలవాటైందని తేలిపోయిందన్నారు. నాడు యూట్యూబర్లంతా రేవంత్‌కు జర్నలిస్టులుగా కనిపించి ఈ రోజు ఎందుకు జర్నలిస్టులు కాకుండా పోయారని ప్రశ్నించారు. జర్నలిస్టులను జర్నలిస్టులే కాదని వారి పట్ల అమర్యాదగా రేవంత్ ప్రదర్శిస్తున్న తీరును ఖండించారు.
భూములు అమ్మకూడదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారని, గతంలో ఇదే వర్సిటీకి అనేకసార్లు వచ్చిపోయిన రాహుల్‌గాంధీ ఇప్పుడెందుకు రారని కేటీఆర్ ప్రశ్నించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకంపై రాహుల్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ నేతలతో రహస్యభేటీ అయ్యారని, స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగా చెప్పినా దీనిపై రేవంత్ ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీతో రేవంత్‌కు ఉన్న సంబంధాలు, భవిష్యత్తు బంధాలపై అందరికీ స్పష్టత ఉన్నదని చెప్పారు. ఆ భేటీపై ఇటు రేవంత్, అటు బీజేపీ నేతలు ఎందుకు స్పందించటం లేదని నిలదీశారు.
సీఎం రేవంత్‌ని అభినవగాడ్సేగా కేటీఆర్ అభివర్ణించారు. రేవంత్‌లో జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సే మూలాలున్నాయని విమర్శించారు. తెలంగాణ జాతిపితలాంటి కేసీఆర్ మీద రేవంత్ చిల్లరమల్లర మాటలకు మూలం అదేనని పేర్కొన్నారు.