హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు ఉద్యమకారులపై గన్ను ఎక్కిపెట్టిననాడు కేసీఆర్ ఉద్యమానికి తన ప్రాణాలనే పణం గా పెట్టిండు. నువ్వు చెప్పు మోసిననాడు కేసీఆర్ ఉద్యమానికి ఊపిరిపోసిండు. నువ్వు పదవుల కోసం పరితపిస్తున్ననాడు.. ఉన్న పదవిని కేసీఆర్ తృణప్రాయంగా వదిలేసిండు. సాధించుకున్న తెలంగాణను నువ్వు చంపేందుకు బ్యాగు లు మోస్తున్ననాడు కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తుకు ఊపిరి పోసిండు.. చిట్టినాయుడూ.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడమే తన లక్ష్యమని మాట్లాడిన రేవంత్ తీరుపై కేటీఆర్ బుధవారం ఎక్స్ వేదికగా మం డిపడ్డారు.
దామగుండం ధనాధన్.. ధాన్యం కొనుగోళ్లు ఢాం
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు దిక్కులేదని కేటీఆర్ మండిపడ్డారు. ‘మూసీపై ముందుకు ధాన్యం కొనుగోళ్లపై వెన క్కా?’ అని ప్రశ్నించారు. ‘దామగుండం ధనాధన్.. ధాన్యం కొనుగోళ్లు ఢాం.. ఢాం..కొనుగోళ్లకు దిక్కులేదు.. కాంగ్రెస్ కోతలకు కొదవలేదు’ అని ఎద్దేవాచేశారు. దళారులకు దండిగా..రైతన్నకు సర్కార్ దండుగలా మారిందని నిప్పులు చెరిగారు. నాడు క్వింటాకు రూ.2300కు అమ్ముకున్న రైతు, కాంగ్రెస్ పుణ్యమా అని నేడు రూ. 1800కే అమ్ముకుంటున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే సోయి సర్కార్‌కు ఉండాలి’ అని సూచించారు.