హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైవర్షన్ గేమ్‌లు అడుతున్నాడని, ఇకనైనా ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. పాలనను పకనపెట్టి కేవలం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను దూషించటమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అలనా లేదు, పాలనా లేదని ధ్వజమెత్తారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మంగళవారం జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సోమవారం మాట్లాడిన పనికిమాలిన మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్నదని దుయ్యబట్టారు. ‘చేతనైతే మీరిచ్చిన 420 అడ్డగోలు హామీలను అమలు చేయాలి.
మా మాదిరి కరెంట్ ఇవ్వాలి. రైతుబంధు ఇవ్వాలి.. రైతులకు ఎకరానికి 15 వేలు ఇస్తా అని డైలాగులు కొట్టుడు కాదు.. దమ్ముంటే.. చేతనైతే రైతుభరోసా ఇవ్వు. మహిళలకు రూ.2500 పథకం అమలు చెయ్. అవ్వ, తాతలకు ఇస్తానన్న 4 వేల పింఛన్ ఇవ్వు. ఇంట్లో ఇద్దరికి పింఛన్ ఇస్తానన్నవ్. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛన్ ఇస్తానన్నవ్.. ఇచ్చి చూపించు. నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలో ఇస్తానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వు’ అంటూ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం జరుపుకొంటున్నదని, చరిత్ర తెలియని చాలా మంది సెప్టెంబర్ 17ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నోరు ఉంది కదా అని కేసీఆర్‌ను దూషించటమే పనిగా పెట్టుకొని, తొమ్మిది నెలలు టైమ్ పాస్ చేసినవ్.. చేతనైతే మీరిచ్చిన 420 అడ్డగోలు హామీలు అమలు చేసి చూపెట్టు..
– కేటీఆర్
‘తెలంగాణ ఆత్మను అవమానించినవ్.. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టినవ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తం’ అని కేటీఆర్ మరో మారు ప్రకటించారు. సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్ద పప్పు అని రేవంత్‌రెడ్డి తిట్టాడని, వాటిని కవర్ చేసుకోడానికే ప్రాపకం చేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డి చేసిన తప్పునకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలతో అభిషేకం చేస్తామంటే అడ్డుకుంటారా? పోలీసులు అత్యుత్సాహాన్ని మానుకొని అరెస్ట్ చేసిన మా విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. తమ విద్యార్థి నాయకులు ఏం తప్పు చేశారని అరెస్ట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినవ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని గాంధీభవన్‌కు తరలిస్తం. నీకు అంత ఇష్టమైతే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని మీ ఇంట్లో పెట్టుకో.. గణేశ్ నిమజ్జనం రోజు చెప్తున్న రాసి పెట్టుకో.. కచ్చితంగా రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తం.
– కేటీఆర్
పల్లె, పట్టణం తేడా లేకుండా పారిశుధ్యం పడకేసిందని, చికున్ గున్యా, డెంగ్యూ, విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని రా ష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ వాపోయారు. ‘బడుల్లో చాక్పీసుల్లేవు..మాజీ సర్పంచ్‌లు బిల్లుల కోసం బాధపడుతున్నరు. ఇప్పటికైనా ప్రజల దృష్టిని మళ్లించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలనపై ప్రభుత్వం దృష్టిసారించాలి’ అని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జనానికి సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, సీహెచ్ మల్లారెడ్డి, మహమూద్ అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఎకరానికి కేసీఆర్ పది వేలే ఇస్తా అన్నడు, నేను 15 వేలు ఇస్తా అని డైలాగులు కొట్టుడు కాదు.. వానకాలం పంటలకు ఇంకా 14 రోజులు మాత్రమే టైముంది. దమ్ముంటే రైతుబంధు ఇవ్వు.
– కేటీఆర్
కేసీఆర్ నిండు మనసుతో తెచ్చిన గురుకులాలపై కక్ష ఎందుకని సీఎం రేవంత్‌రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయం చేయాలనుకుంటే తమతో చేయండి కానీ, పసిమనసులతో చేయకండి అని సూచించారు. ‘కుకల కన్నా దారుణంగా చూస్తున్నారు.. నిత్యం పురుగుల అన్నం తినలేక, కడుపులు మాడ్చుకోలేక చచ్చిపోతున్నాం.. అడిగితే ప్రిన్సిపాల్ తిడుతున్నారు’ అని గురుకుల విద్యార్థుల వేదనను ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి ‘విద్యార్థుల ఆవేదన వినపడుతున్నదా?’ అని ఆయన ప్రశ్నించారు. ‘చదువుకుంటూ ఉన్నతంగా ఆలోచించాల్సిన ఆ పసిమనసులకు ఎందుకింత కష్టం? ఎందుకింత ఆవేదన? ఇదేనా ప్రజా పరిపాలన ? ఇదా ఇందిరమ్మ రాజ్యం? ఆ పసిపిల్లలకు ఇందిరమ్మ రాజ్యంలో కడుపు నిండా అన్నం పెట్ట లేరా? అని నిలదీశారు.