హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : గురుకుల పాఠశాలల్లో అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల మూసివేతకు కుట్ర జరుగుతున్నదని, ఇందులో భాగంగానే వాటిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
శనివారం తెలంగాణ భవన్లో ముందుగా ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ సూళ్లలో 36 మంది విద్యార్థులు చనిపోయారని, దాదాపు 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారని, తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారని, వారిలో ఇద్దరు చనిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు.
పెద్దాపూర్ గురుకులంలో ఓ విద్యార్థి నిన్ననే చనిపోయాడని, ఇంకో విద్యార్థి మృత్యువుతో పోరాడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకు ముందు మంచానపడ్డ మన్యం అనే వార్తలు వచ్చేవని, ఇప్పుడు మంచానపడ్డ రెసిడెన్షియల్ పాఠశాలలు అనాల్సి వస్తున్నదని వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి భాషలో చెప్పాలంటే విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని, ఈ మరణాలపై ప్రభుత్వం సమీక్షించడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో వె య్యి ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటయ్యాయని, వాటిని సమీక్షించేందుకు గతంలో సెంట్రల్ కమాండ్ సిస్టం ఉండేదని, ఇప్పుడు అలాంటిదేదీ లేదని చెప్పారు.
ప్రతి రెసిడెన్షియల్ సూల్కు హెల్త్ సూపర్ వైజర్ ఉండాలని, విద్యార్థులు జబ్బు పడితే కనీసం మందులు కూడా అందుబాటులో లేవని, విద్యార్థులు పాము, ఎలుక కాట్ల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి రెసిడెన్షియల్ సూ ళ్లపై సదభిప్రాయం లేదన్న విషయం ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు బట్టి తెలుస్తున్నదని చెప్పారు. రెసిడెన్షియల్ సూళ్లలో ఇటీవల మూడు వేల సీట్ల కోసం లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని, దీన్నిబట్టి ఆ సూళ్లకు ఎంత డిమాండ్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. భేషజాలకు పోకుండా గురుకులాలను కాపాడాలని సూచించారు.
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అంతా అమెరికా నుంచే నడుస్తున్నదని, ముఖ్యమైన అధికారులంతా విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భం గతంలో ఎన్నడూ లేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి గతంలో ఎన్ఆర్ఐలను నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారని, మరి వారి దగ్గరకే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులన్నీ బోగస్ అని, రేవంత్ తమ్ముడు డైరెక్టర్‌గా ఉన్న స్వచ్ఛ్ బయోతో ఒప్పందం పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరగాలని, 15 రోజుల క్రితమే ఏర్పాటైన సంస్థతో ఎలా ఒప్పందాలు కుదుర్చుకుంటారని ప్రశ్నించారు. గోడీ సంస్థతో ఒప్పందం అంటూ సీఎం రేవంత్ గతంలో బోడి మాటలు చెప్పారని దుయ్యబట్టారు.
వైద్యరంగం పడకేసిందని, ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీల సంఖ్య దారుణంగా పడిపోయిందని, డాక్టర్ల కొరత వేధిస్తున్నదని, సామాన్యులు సైతం మళ్లీ ప్రైవేట్ హాస్పిటళ్ల బాట పడుతున్నారని చెప్పారు. నెలకు 200 డెలివరీలు జరిగే ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పుడు ఒకటి కూడా కావడం లేదని తెలిపారు. కేసీఆర్ కిట్లు ఇవ్వకపోవడంవల్ల ప్రభుత్వ హాస్పిటళ్లలో డెలివరీలు తగ్గాయని చెప్పారు. అవసరమైతే కేసీఆర్ పేరు తొలగించి వేరే పేరుతోనైనా కిట్లను అందించాలని సూచించారు.
కేటీఆర్‌లా తనకు ఇంగ్లిష్ రాదని రేవంత్‌కు అసూయ ఉండొచ్చని చెప్పారు. కేటీఆర్‌లా ఇంగ్లిష్ నేర్చుకునేందుకు రేవంత్‌రెడ్డి మంచి ట్యూటర్‌ను పెట్టుకోవాలిగానీ పిచ్చి విమర్శలు చేయొద్దని సూచించారు. కేటీఆర్ ఇంగ్లిష్‌పై రేవంత్ చేస్తున్న పిచ్చి విమర్శలు చూసి అందరూ నవ్వుకుంటున్నారని కౌశిక్‌రెడ్డి ఎద్దేవా చేశారు.