Telangana Thalli Statue | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): నాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న వేళ.. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని రగిలిచేందుకు 2006లో వెలిసింది తెలంగాణ తల్లి విగ్రహం. ఆ విగ్రహంలో తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక వారసత్వం కలగలిసి ఉన్నాయి. తెలంగాణ మూలాలూ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలనే ఆరాధించే బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకం. ఆ పండుగను ప్రతిఫలించేలా బతుకమ్మను ఎత్తుకున్న మాతృమూర్తిలా తెలంగాణ తల్లి రూపం ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తున్నది. 18 ఏండ్లుగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఆరాధించిన తల్లిగా స్థిరపడింది. అలాంటిది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసలు తెలంగాణ తల్లి రూపాన్నే మార్చడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ చెయ్యి గుర్తును ప్రచారం చేసే తల్లిలా, కాంగ్రెస్ ప్రచారాస్త్రం అభయహస్తంలా ఉండేలా రూపుమార్చారని భగ్గుమంటున్నారు. చెయ్యి గుర్తుకోసం పెట్టిన తల్లి ప్రతిమ అని, పాలనలో కాంగ్రెస్ ముద్ర కోసం కక్కుర్తి పడ్డట్టే అనిపిస్తుందని ప్రజలు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర తెలియనివాళ్లు, అసలు ఆనాడు ఉద్యమంలో భాగం కానివాళ్లు మాత్రమే ఇంతటి దారుణానికి పూనుకుంటారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పుట్టుడు చరిత్ర తెలియనోడే పెట్టుడు చరిత్రను రాయాలని భావిస్తారనే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహం మార్పును తెలంగాణ అస్తిత్వంపై ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిగానే తెలంగాణ సమాజం భావిస్తున్నది. స్థిరపడిపోయిన ప్రతీకలపై రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రతాపం చూపుతుందని ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వాలు మారితే తల్లులు మారుతారా? పార్టీకో తల్లి ఉంటుంది కానీ ప్రభుత్వానికో తల్లి ఉంటుందా? అని తెలంగాణ సమాజం ప్రశ్నల కొడవళ్లను సంధిస్తున్నది.
కిరీటం దైవత్వానికి ప్రతీక, భక్తికి ప్రతీరూపంగా భావించడం ఆనవాయితీగా వస్తున్నది. తల్లిని దైవంగా భావిస్తే అనాదిగా దైవాలకు (దేవుళ్ల)కు కిరీటాలే ఉంటాయి. భారతమాత, తెలుగుమాత, అంతకుముందు ఆంధ్రామాత, కన్నడమాత, ఛత్తీస్‌గఢ్ మాత.. ఏ రాష్ట్రమాతకైనా కిరీటమే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా లీకు ద్వారా విడుదల చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై సమాజం విరుచుకుపడుతున్నది. విమర్శలు ఎక్కుపెట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రచార చిహ్నంగా కనిపిస్తున్నదే కానీ, తెలంగాణ తల్లి రూపంగా లేదని కవులు, కళాకారులు, గాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ బతుకును ఆగం చేసే కుట్రలో భాగంగానే రేవంత్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిందని ధ్వజమెత్తుతున్నారు. 1980 దశకంలో ఆంధ్రామాత స్థానంలో ఎన్టీయార్ తెలుగు తల్లి విగ్రహాన్ని రూపుదాల్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆ మాటకొస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అనంతరం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాలు ఏర్పడినా తెలుగుతల్లి రూపాన్ని మార్చారా? అని ఉదహరిస్తున్నారు.
2006 నుంచి ఇప్పటి దాకా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయాలు రాలేదు. ఇప్పుడు విగ్రహ స్వరూపాన్ని మొత్తం మార్చడం వెనుక ఆధిపత్య భావజాలం స్పష్టంగా కనిపిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర చిహ్నం విషయంలోనూ కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగిస్తానని, అవి రాచరిక ఆనవాళ్లు అని మొదట్లో సీఎం ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గినట్టు కనిపించినా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మరోరూపంలో వాటిపైనా ‘మార్పు’ముద్ర పడదనే గ్యారెంటీ ఏమీలేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రతీకలను మార్చాల్సిన అవసరం ఏమున్నదని తెలంగాణ జనసామాన్యం కూడా ప్రశ్నిస్తున్నది.
అందెశ్రీ రాసిన ‘జయ జయ జయయే’ గీతాన్ని రాష్ట్రగీతంగా చేయాలని ప్రభుత్వం భావిస్తే గేయ స్వరూపం (గానరీతి కూడా) యథాతథంగా ఉంచాల్సిందని, అలా కాకుండా కీరవాణి స్వరపరిచిన తర్వాత ఈ గీతంలో ఉప్పొంగే భావోద్వేగం లేకుండా పోయిందనే వాదన ప్రజల నుంచి వినిపించింది. తాజాగా తెలంగాణ తల్లి రూపం విషయంలో ఏకంగా ప్రజల్లో స్థిరపడిపోయి, ప్రస్తు తం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంతో భావోద్వేగ బంధాన్ని వేసుకున్న తెలంగాణ సమాజాన్ని ప్రభుత్వం అవమానపరిచిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తేతెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావులు, శిల్పులు, కళాకారులు, సాహితీవేత్తలతో కేసీఆర్ చర్చించి తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు కురుచబుద్ధితో విగ్రహ స్వరూపం మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమని వాపోయారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ‘గతంలో ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భరతమాత రూపాన్ని మోదీ ప్రభుత్వం ఏమైనా మార్చిందా?, హైదరాబాద్‌లో తెలుగుతల్లి, కన్నడతల్లి విగ్రహాలను మేమేమైనా మార్చినమా?’అని ప్రశ్నించారు. అసలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహమా? లేక కాంగ్రెస్ తల్లా? అర్థం కావడంలేదని ఎద్దేవాచేశారు. ‘నాలుగేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రాహుల్ తండ్రి రాజీవ్‌గాంధీ విగ్రహం స్థానంలో ముమ్మాటికీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పి తీరుతామని స్పష్టంచేశారు. ‘రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని పంపాల్సిన చోటుకే పంపిస్తాం గుర్తుంచుకో రేవంత్‌రెడ్డీ’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు.
మాయం..మోసం రెండూ కలిస్తే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘తెలంగాణ తల్లి నెత్తిన కిరీటం మాయం. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం. తెలంగాణ తల్లి కాళ్ల కడియాలు మాయం. తెలంగాణ రాష్ట్ర రవాణా లోగోలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మాయం. తెలంగాణ రైతుల భూములు మాయం. మూసీ నది ఒడ్డున పేదల ఇండ్లు మాయం. టీఎస్‌లో ‘ఎస్’ మాయం. ఖజానాలో కాసులు మాయం. మాయం చేయడం.. మోసం చేయడం మినహా ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ చేసిందేమిటి ? ప్రజలకు ఒరిగిందేమిటి ?’ అని దుయ్యబట్టారు.
తెలంగాణ తల్లి కొత్త విగ్ర హం కాంగ్రెస్ చెయ్యి గుర్తు తల్లి అంటరు. కానీ తెలంగాణ తల్లి అనరు. తెలంగాణ మీద, కేసీఆర్ మీద ద్వేషభావాన్ని పెంచుకొని చంద్రబాబు చెప్పినట్టల్లా ఆడే నాయకుడి తీరుగా తెలంగాణలో పాలన సాగుతున్నది. విగ్రహ మార్పుతో ఇది తుగ్లక్ పాలనే అని మరోసారి రుజువైంది. మార్పు అంటే ప్రజల బతుకులు మారుతయని అనుకున్నరు. కానీ, విగ్రహాలు, చిహ్నాలను మార్చే కథ తెచ్చిండు. మన బతుకు చిత్రం ఆవిష్కరించేలా కేసీఆర్ తెలంగాణ తల్లిని తీసుకొచ్చారు. చరిత్ర తెలియనివాడు, పాలకుడు అయితే ఇట్లే ఉంటది. – రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే
చెయ్యి గుర్తుతో ఉన్న రాష్ట్ర నూతన విగ్రహం కాంగ్రెస్ తల్లి అవుతుంది కానీ, తెలంగాణ తల్లి ఎప్పటికీ కాలేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు పేరుతో తెలంగాణ చరిత్రపై, అస్తిత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి దాడి చేస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ తల్లి అంటే ఒక దేవతామూర్తి అని, కిరీటం లేకుండా దేవత ఉంటుందా? అని నిలదీశారు. బతుకమ్మ లేదు, అస్తిత్వం లేదు, అసలు ఆత్మే లేక పిచ్చోడి చేతిలో రాయిలా తెలంగాణ తల్లి విలవిల్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ చిహ్నాలపై సీఎం రేవంత్‌రెడ్డి దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. మనదేశంపై విదేశీయులు దండయాత్రలు చేసి, దేవతా విగ్రహాలను విధ్వంసం చేసినట్టుగా రేవంత్‌రెడ్డి అదే పంథాలో తెలంగాణ చరిత్రను చెరిపేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి ఈ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ‘కాకతీయ కళాతోరణంపై కులవివక్ష చూపిస్తున్నారని, చార్మినార్ ఆనవాళ్లను చెరిపేయాలనే కుట్రలు చేస్తున్నారని శుక్రవారం ఎక్స్ వేదికగా దాసోజు విమర్శించారు.
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మన సంస్కృతి, సంప్రదాయాలను విస్మరిస్తే ప్రజలు సహించరని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్‌గౌడ్ హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి.. పార్టీలు మారినట్టుగానే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తల్లి రూపం ఎప్పుడూ ఒకేరకంగా ఉంటుందని, ప్రభుత్వం మారినంత మాత్రాన రూపం ఎలా మారుతుందని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం సీఎం దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
కిరీటం, నగలు లేని శ్రామిక స్త్రీ మూర్తిని పెడతారకున్నాం. నగలు ఉంచారు, భూస్వామ్య కుటుంబ స్త్రీగానే పెట్టారు. చేతిలోని బతుకమ్మను తీసేశారు. చెయ్యి గుర్తు తోచేలా అభయహస్తం పెట్టించారు. బతుకమ్మ ఉండకూడదని, దేవతలా కాదు, ధనిక భూస్వామ్య పడతిలా ఉండాలని నిర్ణయించారని విగ్రహ రూపమే చెప్తున్నది. బతుకమ్మ మీద ఎందుకో కోపం, ఇంత అభ్యంతరం.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ